– ఇబ్బంది పెట్టిన ప్రతీ ఒక్కరికీ సమాధానం ఇస్తా
– వర్ధన్నపేట కార్యకర్తల భేటీలో మాజీమంత్రి కేటీఆర్ హెచ్చరిక
వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 22: వచ్చే ఐదేళ్లు ఎవ్వరినీ మరచిపోమని, సీఎం చిట్టి నాయుడును అస్సలు వదిలిపెట్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తొపాటు నియోజకవర్గానికి చెందిన నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లు ఏదీ మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని మర్చిపోం.. మనమీద కేసులు పెట్టినోడిని మరిచిపోం. మనతో నిలబడినోళ్లను కూడా మరిచిపోమన్నారు. తప్పకుండా చెప్తున్నా.. నేను కేసీఆర్ సారంతా మంచోన్నైతే కాదు. వచ్చే ఐదేళ్లు చిట్టినాయుడుకు, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది.. పక్కా విడిచిపెట్ట, రిటైరైనా.. పారిపోయి సప్తసముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయిం చిండో ఒక్కొక్కడిని వెతికి తెచ్చి ముందట నిలబెట్టే బాధ్యత నాది.. వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. ఇది నేనేం ఊరికే చెప్పడం లేదు.. గురు పెట్టుకోండి. కానీ అరూరి రమేశ్.. వీడు మంచోడేనే అన్నా అని మళ్లా వారిని తీసుకొని రావద్దని కేటీఆర్ సూచించారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో సంక్షోభం
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఎస్‌ఐఆర్ ప్రక్రియ, డిజిటల్ మెంబర్‌షిప్ (సభ్యత్వ నమోదు), సోషల్ మీడియాపై నిర్వహించిన శిక్షణ తరగతులలో కేటీఆర్ హాజరై కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన సంక్షోభం తెచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఇంటింటా సంక్షోభం తెచ్చిందని ఎద్దేవా చేశారు. పంటల కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి రైతులకు మరణ శాసనం రాసిండని, ఒకప్పుడు కేంద్రం చెప్తే వినడానికి మోడీ బ్రోకరా అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అదే పని చేస్తున్నాడని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమంగా వుందని, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన సంక్షోభం తెచ్చిందని విమర్శించారు. అరూరి రమేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించి ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు, పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే పాడీ కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, టి. రాజయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు సతీష్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, బిఆర్‌ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, లలిత యాదవ్, మాజీ వర్ధన్నపేట నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





