– గ్రేటర్ ఎన్నికల వేళ పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లు
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
వరంగల్ లో రాజకీయ పార్టీల హడావిడి మొదలైంది. రానున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటినుండే ప్రణాళిక లు సిద్ధం చేసుకుంటున్నాయి. దానితోపాటు భవిష్యత్లో జరగనున్న వివిధ ఎన్నికలన్నిటికీ కీలకంగా మారనున్న ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమస్త ఓటరు సవరణ (ఎస్ఐఆర్‌ట్)పై కార్యకర్తలకు అవగాహన కల్పించే ప్రక్రియను కూడా చేపడుతున్నారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం ఒక్క రోజున్నే కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ కార్యకర్తలతో సమావేశాలు నిర్వ హించగా, ఈనెల 29న బీజేపీ వరంగల్లో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హాజరుకానున్నారు. కాగా, సోమవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ సమావేశాలు చాలా హాట్ హాట్‌గా జరిగాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ల మధ్య లేఖల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలంటూ ఆయన ఒక విధంగా వార్నింగ్ ఇచ్చి నట్లు లేఖలో డిమాండ్ చేయడంపట్ల బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని, కాంగ్రెస్ వైఫల్యాలపై వినతిపత్రం ఇచ్చేందుకు తమకు రాహుల్ గాంధీ అపా యింట్మెంట్ ఇప్పించాలని లేఖాస్త్రాన్ని సంధించారు. ఒక పక్క ఈ లేఖలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో వరంగల్ వేదికగా మూడు ప్రధాన పార్టీలు సమావేశాలు నిర్వహించడం ఆసక్తి ని కలిగిస్తున్నది. రాష్ట్ర నాయకత్వాల సవాళ్ళ పరిణామాలు జిల్లాస్థాయిలోకూడా చోటుచేసుకుంటున్నాయి. సోమవారం నాటి సమావేశాలకు ముందే ఈ పార్టీల ప్రతినిధులు ఒకరిపై ఒకరు మాటల దాడి మొదలుపెట్టగా రాష్ట్ర నాయకుల రాకతో అది మరింత వేడందుకుంది. గత ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను ఏకరువు పెడుతూనే,భూ కబ్జాదారులంటూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధికార కాంగ్రెస్ తీరుపై ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ మొదటినుంచి మోసపూరిత వాగ్ధానాలు చేయడంవల్లే భారత దేశంలోని అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ నాయకత్వాన్ని తృణీకరించాయి. ఆ పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకులు చెప్పిన అబద్ధాలు, అడ్డగోలు హామీలను గుడ్డిగా నమ్మడంవల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీని కాదని కాంగ్రెస్‌కు పట్టంకడితే ఒక్క హామీని కూడా ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందన్న విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుందన్న కెటిఆర్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా తిరిగి కేసిఆర్‌కు పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నామని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడి ముఖ్యమంత్రి వందసార్లు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొట్టినా వంద పైసలుకూడా తేలేకపోయాడంటూ ఆయన రేవంత్‌రెడ్డిని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ముప్పై నెలల కాలంలో జరిగింది అభివృద్ధి కాదని, విద్వంసమని అన్నారాయన. చీకటిని చూస్తేగాని వెలుగు విలువ తెలవదన్నట్లు పదకొండు ఏళ్ళ కెసిఆర్ పాలన చూసిన వారికి రెండున్నరేండ్ల రేవంత్‌పాలన పట్ల విరక్తి మొదలైందని, అందుకే ప్రజలంతా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారంటూ తమ కేడర్‌ను ఉత్సాహపరిచారు.
కాంగ్రెస్‌కూడా అదేస్థాయిలో బీఆర్‌ఎస్‌తోపాటు, బీజెపిపైన విరుచుకుపడింది. ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణపై కార్యకర్తలు, నాయకులకు అవగాహన కలిగించేందుకు పార్టీ రాష్ట్ర పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మన మహేష్‌కుమార్ గౌడ్ సోమవారం ఇక్కడ సమావేశమైనారు. రానున్న ఎన్నికల్లో వందస్థానాలను తప్పక గెలుచుకుంటామన్న నమ్మకాన్ని కార్యకర్తలకు కలిగించే ప్రయత్నం చేశారు. అయితే పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికి అవకాశాలు రాలేదన్న విషయాన్ని పార్టీ గుర్తించిందని, వారికి ఇకముందు న్యాయం చేస్తామన్న మహేష్‌కుమార్‌గౌడ్ దేర్ హై మగర్ అందేర్ నహీ అన్నారు. కాగా, ఆయనతోపాటు మీనాక్షి నటరాజన్ ’సర్’ పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. అందరికీ ఓటు హక్కు కల్పించాలన్నది ‘సర్’ ఉద్దేశ్యం కాగా, బీజేపీ లక్ష్యం మాత్రం వేరుగా ఉందని, బెంగాల్‌లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





