“పెరుగుతున్న వాహనాల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుంటే, రహదారులపై ప్రజల భద్రతను కాపాడటానికి మనకు సరైన రోడ్ల ప్రణాళిక అవసరం. అదేవిధంగా కఠినమైన చట్టాల అమలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పద్ధతులు కూడా అవసరం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో డిసెంబర్ 11, 2025న ప్రచురితమైన కథనం ప్రకారం భారతీయ రోడ్లపై గుంతలు నిశ్శబ్ద హంతకులుగా తయారయ్యాయి. 2023లో రికార్డు స్థాయిలో 2,161 మరణాలకు ఇవే కారణమయ్యాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో రోడ్లు గతుకులమయంగా మారడం, తూతూ మంత్రంగా చేపట్టే చర్యలు, నిర్వహణలో అశ్రద్ధ, సంబంధిత అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం లేకపోవడం వల్ల గుంతలను పూడ్చడం కంటే అవి మరింత పెరగడానికి కారణమయ్యాయని ఆ కథనం పేర్కొన్నది..”

అసిస్టెంట్ ప్రొఫెసర్ అంబేడ్కర్ యూనివర్సిటీ
దిల్లీ భారతదేశం సుమారు 63.86 లక్షల కిలోమీటర్ల పొడవైన రహదారి వ్యవస్థ కలిగి ఉంది. ఈ విషయంలో అమెరికా తర్వాత స్థానం మనదే! రహదారులు ఆర్థికాభివృద్ధికి, సమ్మిళితత్వం రూపంలో చేకూరే సామాజిక ప్రయోజనాలకి దోహదపడతాయి. మన దేశంలోని రహదారుల వ్యవస్థ ప్రధానంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, గ్రామీణ రోడ్లు, పట్టణ రోడ్లు, ప్రాజెక్ట్ రోడ్లుగా విస్తరించి ఉన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) గణాంకాల ప్రకారం ప్రపంచంలోని మోటారు వాహనాల్లో 32శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల పరిధిలో ఉన్నాయకానీ ఆ దేశాల్లో జరిగే రోడ్డు ప్రమాదాల నల్ల 75శాతం మరణాలు సంభవిస్తున్నాయి. స్వల్ప లేదా మధ్య తరహా ఆదాయ దేశాలలో ప్రతి 10,000 వాహనాలకు ఏటా 20 నుండి 200 వరకు మరణాల సంఖ్య నమోదవుతోంది. అదే, పారిశ్రామిక దేశాలలో అయితే ఈ సంఖ్య 1.5 నుండి 5 మధ్య ఉంటోంది. డబ్ల్యూ.హెచ్.ఓ. మరో నివేదిక ప్రకారం 2010- 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాలు 5శాతం తగ్గి, ఏటా ఆ సంఖ్య 1.19 మిలియన్లకు చేరుకుంది. ఐక్యరాజ్య సమితిలోని 108 సభ్య దేశాలు ఈ తగ్గుదలని నివేదించాయి. అయితే, భారతదేశంలో మాత్రం ఈ మరణాలు 15శాతం పెరగడం గమనార్హం.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) నివేదిక ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలలో 1.73 లక్షల మందికి పైగా మరణించగా, 4.47 లక్షల మంది గాయపడ్డారు. ప్రమాదాలకి గురైన వారిలో దాదాపు 46శాతం మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటివి కారణాలని తేలింది. ఎన్.సి.ఆర్.బి. గణాంకాల ప్రకారం 61.4శాతం రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగానే సంభవించాయి. నిర్లక్ష్యంగాను, ర్యాష్ డ్రైవింగ్ లేదా ఓవర్టేకింగ్ వంటి కారణాలతో 23.7శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మాత్రం 2.1శాతం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
2010లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2011- 2020 మధ్య కాలాన్ని “రోడ్డు భద్రత కోసం కార్యాచరణ దశాబ్ది”గా ప్రకటించింది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో పాటు రోడ్డు భద్రత విషయంలో రెండు ముఖ్యమైన అంశాలను నిర్దేశించింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం సంపన్న దేశాలతో పోలిస్తే అల్పాదాయ దేశాలలో జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య మూడు రెట్లు అధికం. ఫలితంగా ఆయా దేశాలపై ఆర్థిక భారాన్ని కూడా మోపుతుంది. ఈ పరిణామం మనుషుల్లో వ్యథని కలిగించడంతో పాటు, ఆర్థికంగా ఉత్పాదకతకి దోహదపడే లక్షలాది యువ జీవితాలను బలిగొని ఆయా దేశాల GDPని కబళిస్తుంది. కేంద్ర రోడ్డు- రవాణా- రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ 2024 డిసెంబర్ 12న లోక్సభలో ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ “దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాలలో 1.78 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, బాధితుల్లో 60శాతం మంది 18-34 మధ్య వయస్కులేనని” చెప్పారు. పరిస్థితులు మెరుగుపడాలంటే దేశ పౌరుల ప్రవర్తనలో మార్పు రావాలని, సమాజం ఈ దిశగా చైతన్యవంతం కావాలని, చట్టబద్ద విధానాలను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ బాధితులు :
ఎన్.సి.ఆర్.బి. నివేదిక ప్రకారం 2023లో సంభవించిన రోడ్డు ప్రమాద మరణాలలో ప్రతి ఐదుగురిలో ఒకరు పాదచారులే కావడం విషాదకరం. పాఠశాలలు, కళాశాలల సమీపంలో సుమారు 10,000 మరణాలు సంభవించినట్లు ఒక అంచనా. భారతదేశంలో ఉప- జాతీయ స్థాయిలో సంభవించే రోడ్డు ప్రమాదాలు, అందులోని సామాజిక- ఆర్థిక వాస్తవాలు, సూక్ష్మ అంశాలను విశ్లేషించడానికి సేవ్ లైఫ్ ఫౌండేషన్ (SLF)తో కలిసి ప్రపంచ బ్యాంకు ఒక సర్వేను చేపట్టింది. సామాజిక స్థాయి, జండర్, నివసించే ప్రదేశం వంటి ప్రస్తుత అసమానతలు రోడ్డు ప్రమాదాల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయో, అల్పాదాయ కుటుంబాలపై ఎలాంటి భారం మోపుతాయో, తరచుగా వారిని మరింత అప్పుల్లోకి, పేదరికంలోకి ఎలా నెట్టివేస్తాయో ఈ సర్వే విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని 12 శాతం కుటుంబాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాల్లోని 40 శాతం కంటే ఎక్కువ కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తర్వాత కనీసం ఒక మరణం సంభవించినట్లు వెల్లడయ్యింది. అధిక ఆదాయ కుటుంబాలతో పోలిస్తే స్వల్ప ఆదాయ కుటుంబాల్లో ప్రమాదం తర్వాత రెట్టింపు మరణాలను నమోదుచేశాయి. తద్వారా రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా నష్టపోయేది పేదలే అనే వాస్తవాన్ని ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది.
మన దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల గౌరవం లేకపోవడంతో పాటు భయం కూడా ప్రధాన కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయం. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడానికి నాలుగు కీలక రంగాలను ఆయన సూచించారు: 1. రోడ్డు ఇంజనీరింగ్. 2. ఆటోమొబైల్ ఇంజనీరింగ్. 3. చట్టాల అమలు. 4. ప్రజలలో అవగాహన. ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (IBEF) లెక్కల ప్రకారం 2025 అక్టోబర్ నాటికి ప్యాసింజర్ వాహనాలు, త్రీ వీలర్లు, ద్విచక్ర వాహనాలు, క్వాడ్రిసైకిళ్ల (నాలుగు చక్రాలు కలిగిన ట్రాలీ లేదా ఆటోరిక్షా) మొత్తం ఉత్పత్తి దేశంలో సుమారు 2.8 మిలియన్ యూనిట్లు. దేశీయ డొమెస్టిక్ ఆటోమొబైల్ మార్కెట్లో టూ-వీలర్లు, ప్యాసింజర్ వాహనాలదే పైచేయి. 2025 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లు వరుసగా 77.87శాతం, 15.60శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ప్యాసింజర్ కార్ల అమ్మకాలలో చిన్న, మధ్య తరహా కార్లదే హవా అని చెప్పొచ్చు.
కాబట్టి, పెరుగుతున్న వాహనాల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుంటే, రహదారులపై ప్రజల భద్రతను కాపాడటానికి మనకు సరైన రోడ్ల ప్రణాళిక అవసరం. అదేవిధంగా కఠినమైన చట్టాల అమలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పద్ధతులు కూడా అవసరం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో డిసెంబర్ 11, 2025న ప్రచురితమైన కథనం ప్రకారం భారతీయ రోడ్లపై గుంతలు నిశ్శబ్ద హంతకులుగా తయారయ్యాయి. 2023లో రికార్డు స్థాయిలో 2,161 మరణాలకు ఇవే కారణమయ్యాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో రోడ్లు గతుకులమయంగా మారడం, తూతూ మంత్రంగా చేపట్టే చర్యలు, నిర్వహణలో అశ్రద్ధ, సంబంధిత అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం లేకపోవడం వల్ల గుంతలను పూడ్చడం కంటే అవి మరింత పెరగడానికి కారణమయ్యాయని ఆ కథనం పేర్కొన్నది.
రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వశాఖ (MORTH) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో మొత్తం 4,80,583 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలలో 1,72,890 మంది ప్రాణాలు కోల్పోగా, 4,62,825 మంది గాయపడ్డారు. ఇందులో 63.7 శాతం ప్రమాదాలకు, 60.8 శాతం రోడ్డు మరణాలకు అతివేగమే ప్రధాన కారణం. 2022తో పోలిస్తే 2023లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 4.2శాతం పెరిగింది. రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవించిన మరణాలతో పాటు గాయపడ్డవారి సంఖ్య కూడా వరుసగా 2.6శాతం, 4.4శాతం పెరిగాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం దేశంలో సగటున ప్రతిరోజూ 1,317 ప్రమాదాలు, 474 మరణాలు సంభవిస్తున్నాయి. అంటే ప్రతి గంటకు 55 ప్రమాదాలు, 20 మరణాలు సంభవిస్తున్నాయన్న మాట! ప్రపంచంలోనే అత్యధికంగా నమోదవుతున్న ఈ మరణాలు విధాన రూపకర్తలతో పాటు సామాన్య ప్రజలను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
వేగ నియంత్రణ యంత్రాంగాలు:
మన రోడ్లపై వేగ నియంత్రణ కోసం మూడు రకాల యంత్రాంగాలు ఉన్నాయి:
1. స్పీడ్ బ్రేకర్లు: వాహనాల వేగాన్ని సత్వరం తగ్గించడానికి దోహదపడే చిన్న కణుపులు లేదా గుంతలు.
2. స్పీడ్ హంప్స్: అన్ని రకాల వాహనాల వేగాన్ని నియంత్రించే ఎత్తయిన వంపు తిరిగిన నిర్మాణాలు.
3. రంబుల్ స్ట్రిప్స్: రోడ్డుపై శ్రద్ధ పెట్టని డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. రోడ్డు ఉపరితలంపై ఏర్పాటు చేసే వరుస గాడులు లేదా చిన్నపాటి బంప్స్.దేశీయ రహదారులపై తరచుగా స్పీడ్ బ్రేకర్లను చూస్తుంటాం. జూన్ 9, 2017న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక వార్త ప్రకారం మన దేశంలో స్పీడ్ బ్రేకర్లు ప్రాణాలను కాపాడటానికి బదులు ఎక్కువ ప్రాణాలను తీస్తున్నాయట. ఈ ఇందులో మరికొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ గణాంకాలను పరిశీలిస్తే తెలిసింది ఏమిటంటే… రోడ్డు భద్రతా చర్యల వల్ల ప్రతిరోజూ 30 ప్రమాదాలు జరుగుతున్నాయి! వీటిలో కనీసం తొమ్మిది ప్రాణాలు పోతున్నాయి.
రోడ్లపై లోపభూయిష్టమైన డిజైన్లు వేయటం, నాసిరకమైన పదార్థాలు వాడటం, స్పష్టమైన గుర్తులు లేకపోవడం వంటివి వాహన డ్రైవర్ల పాలిట మృత్యుపాశాలు అవుతున్నాయట. భారతదేశంలో స్పీడ్ హంప్స్ వంటి ట్రాఫిక్ నియంత్రణ పరికరాల రూపకల్పన కోసం ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 99-2018 కోడ్ ని ఉపయోగిస్తారు. IRC నియమావళి ప్రకారం స్పీడ్ బంప్స్ కనీస కార్డ్ పొడవు 3 మీటర్లు, ఎత్తు 0.1 మీటర్లు ఉండాలి. ఏదైనా ఒక వాహనం ఆ హంప్ ని దాటేటప్పుడు కనీస వేగం గంటకు 25 కిలోమీటర్లు ఉండాలని కూడా ఈ కోడ్ నిర్దేశిస్తున్నది. KIIT విశ్వవిద్యాలయ బృందం భువనేశ్వర్ సమీపంలోని NH16 ప్రధాన రహదారులలో చేసిన అధ్యయనం ప్రకారం అక్కడున్న ఏ స్పీడ్ బంప్ కు కూడా ఈ కనీస నిర్దేశిత కార్డ్ పొడవు, ఎత్తు లేదని వెల్లడయ్యింది.
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే కార్పొరేట్ సంస్థల సహాయంతో పాటు, విధానపరమైన మద్దతు చర్యలు, రాజకీయ సంకల్పం కూడా అవసరమన్నది రోడ్డు భద్రతా నిపుణుడు అశ్విని బగ్గా అభిప్రాయం. ఆయన మాటల ప్రకారం భారతదేశ జీడీపీలో ఆటోమొబైల్ పరిశ్రమ వాటా 10శాతం నుండి 12శాతంగా ఉంది. వాహనాల ఉత్పత్తి, వినయోగం రోజురోజుకు పెరుగుతున్నాయి, కాబట్టి ఈ ఆటోమొబైల్ రంగ వృద్ధిని ఆపడం కష్టం. అదేవిధంగా రహదారులపై మౌలిక సదుపాయాల కోసం చేసే ఖర్చు కూడా పెరుగుతోంది. అయితే సమస్యల్లా ఒక్కటే. మన రోడ్డు వినియోగదారులకు సదరు మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక జ్ఞానం కొరవడింది. పెరుగుతున్న వాహనాల సాంకేతికత, అందుకు తగ్గట్టుగా హైవేలపై సురక్ష చర్యలు లేకపోవడం భారతదేశంలో ప్రమాదాలకు ఒక కారణమని ఆయన అంటున్నారు.
రోడ్డు ప్రమాదాలలో చితికిపోతున్న బాల్యం:
పట్టణాల్లోని చాలా ప్రాంతాల్లో విద్యాసంస్థల కోసం కచ్చితంగా నిర్దేశించిన జోన్ ఏదీ లేకపోవడాన్ని మనం గమనిస్తుంటాము. దీనివల్ల అన్ని వయసుల విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లిరావడం అనేది ప్రమాదాలతో చెలగాటంగా మారింది. అతి వేగంతో నడిపే వ్యాన్లు, ఆటోరిక్షాలు, బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించడం, వాటిలో చాలావరకు కనీస భద్రతా సౌకర్యాలు లేకపోవడం సర్వసాధారణం. పాఠశాలకు బయలుదేరడం నుంచే వారి రోజువారీ ఇబ్బంది మొదలవుతుంది. అతి వేగంతో దూసుకొచ్చే వాహనాలను తప్పించుకోవడానికి ప్రయత్నించడం, పార్క్ చేసిన కార్ల మధ్య సన్నటి సందుల్లో నడవడం వంటివి చేయాల్సి ఉంటుంది. పైగా మన ఫుట్ పాత్ లు ఇరుకిరుకుగా, ఎగుడుదిగుడుగా ఉంటాయి. ఆక్రమణలతోను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లతోను నిండిపోయి ఉంటాయి. పాఠశాలల దగ్గర పార్క్ చేసిన వాహనాలు, పెద్దపెద్ద వ్యాన్లు రివర్స్ చేయడం వంటివి ఘటనలు పిల్లల పాలిట ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వీటికి తోడు భారీ యూ-టర్న్ లు, తీవ్ర రద్దీతో కూడిన రోడ్లు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. పాదచారులకు కొరవడిన మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సిబ్బంది అలక్ష్య ధోరణులు మన పిల్లలను రోడ్డు ప్రమాదాలకు గురిచేస్తున్నాయి.
పరిష్కారం కోసం ప్రయత్నాలు:
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారికి విధించే జరిమానాలను పెంచుతూ 2019లో మోటారు వాహన చట్టం (MVA)లో సవరణలు చేశారు. ఈ చర్య ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గిస్తుందని అంచనా వేశారు. కానీ దీని ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి, జరిమానాను పెంచడం అనేది కచ్చితమైన నిరోధకం కాదని తేటతెల్లమైంది.తీవ్రస్థాయి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జైలుశిక్షను పెంచే సెక్షన్ 106(2) BNS (భారతీయ న్యాయ సంహిత, 2023)ను అమలు చేయాలన్న ఒక ప్రతిపాదన కూడా ఉంది. అయితే వివిధ ట్రక్ యూనియన్ల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత కారణంగా ప్రభుత్వం ఈ సెక్షన్ ని నిలిపివేసింది. కొత్త చట్టాలను రూపొందించడం కంటే, ఉన్న MVA చట్టం, రహదారి నియమాలు, BNS నిబంధనలను పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం కృషిచేయడం ఉత్తమమార్గం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు చేపట్టి మంచి ఫలితాలు రాబట్టిన ఆ రాష్ట్ర ADGP అలోక్ కుమార్ సూచనల ప్రకారం.. మోటారు వాహన చట్టం- 1988లోని సెక్షన్ 206(4) కింద నిర్లక్ష్య వాహన ఛోదకుల డ్రైవింగ్ లైసెన్స్ ని సస్పెండ్ చేయాలి. BNSలోని సెక్షన్ 106(2)ను అమలులోకి తీసుకురావాలి. అలాగే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కోసం సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలి.
భాగస్వామ్య ఏజెన్సీల మధ్య సమన్వయంతో కూడిన విధానం పాటించడం ద్వారా రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలను సమర్ధంగా తగ్గించవచ్చు. రహదారులపై ఆధునిక సాంకేతికతతో కూడిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. రహదారి భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో సాంకేతికత ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని సిటిజన్ కంజ్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్ కి చెందిన సీనియర్ పరిశోధకులు దివ్య సెంథిల్ చెప్తున్నారు. అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థలు (ADAS) వాహనాలను సురక్షితం చేయడంలో సహాయపడతాయి. వాహనాలు ఢీకొనకుండా ఉండటానికి, సురక్షితమైన డ్రైవింగ్ దూరాలను పాటించేలా సహాయపడటానికి సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా మెషిన్ లెర్నింగ్ (ML) AI/ML అల్గారిథమ్ లను ఉపయోగించుకుంటాయి. ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్, సురక్షిత రహదారి రూపకల్పన వంటి స్మార్ట్ మౌలిక సదుపాయాలతో కూడిన పరిష్కారాలు ప్రమాదాలను నియంత్రించి.. రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయి. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, పాదచారుల గుర్తింపు వ్యవస్థలు వాహన వినియోగదారులను కూడా (VRUలను) రక్షించే లక్ష్యంతో పనిచేస్తాయి. రహదారులపై ఈ తరహా సాంకేతికతను తీసుకురావాలంటే ఇందుకు కీలకమైన డేటాను సేకరించడం అవసరం. అధిక ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను గుర్తించడానికి ఈ డేటాను మరింతగా ప్రాసెస్ చేయవచ్చు. ఇది వివిధ రహదారి భద్రతా చర్యలు చేపట్టడానికి, వ్యూహాల ఫలితాలను మధింపు చేయడానికి ఒక మార్గంగా కూడా ఉపయోగపడుతుంది.
రహదారి భద్రతను పెంచడంలో రోడ్ సేఫ్టీ కి సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఒక కీలకమైన అంశం. గార్డ్ రైల్స్ , క్రాష్ బారియర్స్, రంబుల్ స్ట్రిప్స్ తో పాటు సురక్షితమైన రహదారి రూపకల్పన వంటి మౌలిక సదుపాయాలతోనే ప్రమాదాల తీవ్రతను తగ్గించడం సాధ్యం. యాక్సిడెంట్స్ జరిగిన సందర్భాలలో రహదారి వినియోగదారులను రక్షించడానికి ఇవి తోడ్పడతాయి. రద్దీని తగ్గించి, ట్రాఫిక్ ని క్రమబద్దీకరించే విధంగా చక్కగా రూపొందించిన రహదారులు వాహనదారులతో పాటు పాదచారుల భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ తరహా సురక్షితమైన రహదారి మౌలిక సదుపాయాల కల్పనకి, సమర్ధ నిర్వహణకి అనేక ఇతర సాంకేతికతలు కూడా దోహదపడతాయి.
ముగింపు
రహదారి భద్రతను (1) విద్య, (2) అమలు (3) ఇంజనీరింగ్ (4) పర్యావరణం (5) అత్యవసర సేవలు వంటి ఐదు విధానాల ద్వారా నిర్వహించవచ్చని మక్బూల్ సహా మరి కొందరు చేసిన ఒక అధ్యయనంలో తేలింది. రహదారి భద్రతా పద్ధతులపై భారీ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, సరైన విధంగా రహదారుల రూపకల్పన, విద్యాసంస్థల కోసం భద్రతా మండలాలను కేటాయించడం, మోటారు వాహన చట్టాలను చిత్తశుద్ధితో అమలుపరచడం, ప్రమాదం తర్వాత వేగవంతమైన సంరక్షణ సేవలు అందించడం, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచడం, రహదారి ప్రమాదాలను నివారించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. ప్రజలకు సురక్షితమైన రహదారులను అందుబాటులోకి తెచ్చే దిశగా కృషి చేయడానికి, విధాన రూపకర్తలు- పౌరసమాజ ప్రతినిధులు సామాజిక మాధ్యమాల ద్వారా రహదారులపై బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరిగేలా ప్రచారంచేయడానికి దృష్టిపెట్టాలి.
మనలో మార్పు రావాలి. ఉదాహరణకు: హెల్మెట్లు ధరిస్తే చాలా మంది బైక్ రైడర్ల మరణాల రేటు తగ్గుతుంది. కానీ నాణ్యత గల హెల్మెట్లు ధరించే విషయంలో చాలా మంది యువతలో వ్యతిరేకత ఉంది. ప్రమాద బాధితులలో సగానికి పైగా పాదచారులే అని, వీరు సైకిల్ లేదా మోటార్ సైకిల్ నడిపేవారేనని, వీరిని బలహీన రహదారి వినియోగదారులు అని పిలుస్తారని, వీరు తరచుగా సమాజంలోని పేద వర్గాలకు చెందినవారని విధాన రూపకర్తలు ముందుగా గ్రహించాలి. మొత్తం మరణాలలో 69 శాతం మంది పనిచేసే సామర్ధ్యం గల యుక్తవయస్సు వారే అన్నది సుస్పష్టం. ప్రమాదం కారణంగా ఆదాయ నష్టంతో పాటు వైద్యఖర్చుల భారం ఆ బాధితులను, వారి కుటుంబాలను తీవ్ర ఆర్థిక వత్తిడిలోకి నెట్టేస్తాయి. సామాజిక భద్రతా వలయాలు పరిమితంగా ఉన్నప్పుడు వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందన్న గ్రహింపు అవసరం.





