~ అభివృద్ధిలో విఫలమైన కాంగ్రెస్
~ దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ చీఫ్ రామచందర్‌రావు
– ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి హైలం కాలనీలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ వేసేందుకు కాలనీ నుంచి డప్పు నృత్యాలతో ర్యాలీగా బయలుదేరారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపక్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. నామినేషన్ దాఖలు అనంతరం రామచందర్ రావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధికి ఓటు వేయబోతున్నారని, దీపక్ రెడ్డి విజయం తథ్యం అని విశ్వాసం వ్యక్తం చేశారు. కాలనీల్లో ప్రజలు ప్రతి రోజూ మురుగు నీటి సమస్యలతో బాధపడుతున్నా ప్రభుత్వం స్పందించడంలో విఫలమైందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అని రామచందర్‌రావు విమర్శించారు. డ్రైనేజీల సమస్య చిన్నది కాదని, ఇది నగర అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిరచేదిగా ఉందని, ధనికులు నివసించే మంచి కాలనీల పరిస్థితి ఇలాగుంటే సామాన్య ప్రజల స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో సివిల్స్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చిందని, వాటి అమలుపై పురోగతి లేదని అన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి, పథకాల అమలులో సరైన ప్రాధాన్యం ఇవ్వడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గృహాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడంలో విఫలం కాగా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం కనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, ప్రచారాలన్నీ అబద్ధాల మీద ఆధారపడ్డవి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలు పేరిట 421 వాగ్దానాలు చేసి, మళ్లీ ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నదని, ఇది ఐపీసీ 420 ప్రకారం మోసానికి సంబంధించిన అంశాలను తలపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది సరిపోయే బిరుదు అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తప్ప మిగతా పార్టీలు ప్రజలపై మాయాజాలం, అబద్ధాల ప్రచారం, తప్పుడు హామీలతోనే పోటీ పడుతున్నాయన్నారు. నిజమైన అభివృద్ధి, ప్రజల నమ్మకానికి, పారదర్శక పాలనకు బీజేపీయే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు. .హైదరాబాద్ నగర అభివృద్ధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పురోగతి, శాంతి స్థిరత్వం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ ఉపఎన్నికను బీజేపీ విజయానికి తొలి అడుగుగా ప్రజలు చూడాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మార్పు వైపు తీసుకెళ్లే పాలన కోసం ఈ ఉప ఎన్నిక ఎంతో కీలకమని రామచందర్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





