– ఆర్టీసీ సమ్మెపై కేబినెట్‌లో చర్చ
– ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
– సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో ఉన్నాం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వానిదే
– మంత్రులు పొన్నం తదితరులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టిందని సీఎం ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి శుక్రవారం మాట్లాడతారని చెప్పారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కేబినెట్ స్థాయిలో చర్చించడం ఆలస్యమైందని,
ఆర్టీసీ సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. కేబినెట్ స్థాయిలో చర్చ జరగడం కొంత ఆలస్యం అయిందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేశామని తెలిపారు. రేపు (శుక్రవారం) జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతామని చెప్పారు. విద్యుత్ బస్సుల విషయంలో ఉద్యోగాలు తీసివేస్తారు అనే ప్రచారం సరి కాదు అని అన్నారు.
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి శ్రీధర్‌బాబు
ఆర్టీసీ కార్మికులు తమ ఆత్మీయ కుటుంబ సభ్యులు. కార్మికులంతా తమ అన్నలు, సోదరీమణులే.. సమస్యలు ఉన్నాయి.. నిరసన వ్యక్తం చేయడంలో తప్పులేదు. చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రెచ్చగొట్టే శక్తుల ప్రభావానికి గురై తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని, మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరారు. భావోద్వేగాలకు, క్షణికావేశాలకు గురికావద్దు. చర్చల ద్వారా ప్రతిదీ పరిష్కారం అవుతుంది. రాష్ట్ర సాధనలో మాతోపాటు మీ అందరి కృషి ఉంది. ప్రజాప్రభుత్వం మీదేనని అన్నారు. ఇవాళ కేబినెట్ సమావేశం ఎజెండాను పక్కనపెట్టి ఆర్టీసీ కార్మికుల సమస్యలపైనే చర్చించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలు పరిష్కరించాలనే సంకల్పంతోనే ఉన్నారని ఆయన తెలిపారు. కొన్ని శక్తులు మిమ్మల్ని ఆవేశాలకు గురిచేసి ఇబ్బంది పెట్టాలని చూస్తాయని, డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో శుక్రవారం చర్చలు జరపుదామని చెప్పారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరిచుకుందామని,. మేం మొండి పట్టుదలతో లేము.. తమకు ఎలాంటి భేషజాలు లేవు అని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాన్ని అందరం ఎంతో కష్టపడి నిర్మించుకున్నాం.. మన కలలను సాకారం చేసుకుందాం.. మీ డిమాండ్ల పట్ల మాకు సానుకూల అభిప్రాయమే ఉంది. అపోహలకు గురికాకుండా సంయమనంతో ఉండండి.. కుటుంబాలను ఆందోళనకు గురిచేయొదు.?ద. మంత్రులందరం మీ సమస్యల పట్ల సానుభూతితో ఉన్నాం అని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మీ జీవితాలను మరింత మెరుగుపర్చాలన్న సంకల్పంతో ఉన్నాం. రెచ్చగొట్టేవాళ్లు, హింసకు ప్రేరేపించేవారి మాటలు నమ్మి ఆవేవాశాలకు పోవద్దని మరోసారి కోరుతున్నానన్నారు. ఇది ప్రజా పాలన, ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వం అని చెప్పారు.
ఎజెండా మొదలు కాకుండానే చర్చించాం : మంత్రి దామోదర్
ఆర్టీసీ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి శిత్తశుద్ధి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆర్టీసీ ఉద్యోగిని హైదరాబాద్‌కు తరలిస్తున్నామని, హైదర్‌గూడ అపోలోలో మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఆవేశపడొద్దు.. చర్చలు జరుపుదాం అని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులన్నారు. బావోద్వేగాలతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు.
ఆత్మబలిదానాలు వద్దు : మంత్రి కోమటిరెడ్డి
ఉద్యమంలో మనం కొట్లాడినం.. ఆత్మ బలిదానాలు వద్దు అని రోడ్లు, భవనాల శాఖ తమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వంలో 58 రోజులు సమ్మె జరిగి 36 మంది మరణించినా పట్టించుకోలేదని విమర్శించారు. ఆర్టీసీకి రూ.10వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు. తెలంగాణ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానుకగా ఇచ్చాము. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





