– ర్యాలీలు..రాస్తారోకోలతో ఆందోళన
– బస్ డిపోల ముందు నేతల బైఠాయింపు
– బస్సుల బందుతో ప్రయాణికుల ఇబ్బంది
– బంద్‌లో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు
– అంబర్‌పేటలో కిందపడ్డ హన్మంతరావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్18: బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ ఐకాస చేపట్టిన బంద్ తెలంగాణవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. ఈ బంద్‌కు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతోపాటు ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే బస్సుల బందుతో ప్రయాణి కులు ఇబ్బంది పడ్డారు. గ్రామాలకు వెళ్లాలనుకున్న వారు ఇబ్బందులు పడ్డారు. దీంతో బంద్ పట్ల వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బంద్‌కు మద్దతుగా బీసీ సంఘాలు నిరనస చేపట్టాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నేతలు అడ్డుకుంటున్నారు. బంద్‌లో పాల్గొని దుకాణాలు, వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. బంద్ కారణంగా హైదరాబాద్‌లో పలు చోట్ల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమిత మయ్యాయి. ఉప్పల్, చెంగిచర్ల డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. కూకట్‌పల్లి బస్ డిపోలో దాదాపు 125 ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బంద్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బీసీ బంద్ నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్ డిపోల ఎదుట, రోడ్లపై నేతలు బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు, కులసంఘాల నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. బీసీ సంఘాల నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌లో బీసీ బంద్ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్ వద్ద జరిగిన ధర్నాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ వద్ద తెలంగాణ బీసీ ఐకాస నేతలు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో భారత రాష్ట్ర సమితి నేత శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్, వికారాబాద్ ఆర్టీసీ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల బంద్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్‌లో పలు బస్టాండ్లు వెలవెలబోయాయి. బంద్‌లో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. బీసీ ఐకాస చేపట్టిన బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగింది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాయి. పలు చోట్ల నాయకులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. మరోవైపు బంద్‌ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని డీజీపీ సూచించడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. హైదరాబాద్ అంబర్‌పేట్ ప్రాంతంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల నాయకులు బంద్ చేపట్టారు. ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. బంద్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన భారీ ర్యాలీలో పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నేతలు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. హనుమంతరావు ప్లెక్సీ పట్టుకుని నడుస్తుండగా అది అడ్డువచ్చి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు ఆయనను పైకి లేపారు. అనంతరం ర్యాలీ యథావిధిగా కొనసాగింది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు పాస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బంద్‌లో పాల్గొనని బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలు
బంద్‌కు తాము వ్యతిరేకం కాదని చెబుతూ వస్తున్న పార్టీల చీఫ్‌లు మాత్రం ఆందోళనల్లో పత్తా లేకుండా పోయారు. ఆర్ కృష్ణయ్య స్వయంగా అన్ని పార్టీల చీఫ్ లను కలిసి బంద్‌కు మద్దతు కోరారు. అందరూ పూర్తి మద్దతు ప్రకటించారు. అయితే బంద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొనలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిర్వహించిన నిరసనలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి కూడా ధర్నాల వైపు రాలేదు. దీంతో వీళ్లు ఎందుకు రాలేదనే చర్చ మొదలైంది. అదే సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆందోళనలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీ నిర్వహించి ట్యాంకు బండ్‌పై బైఠాయించారు. హరీష్ రావు, కేటీఆర్ వెలమ సామాజిక వర్గం, అదేవిధంగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు బ్రాహ్మణ సామాజిక వర్గం, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఓసీ కావడంతోనే ఈ ఆందోళనల్లో పాల్గొనలేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.
– బంద్‌తో క్యాబ్, ఆటోలకు డిమాండ్
– కరీంనగర్‌లో హోటల్ శ్వేతపై దాడి
బీసీ బంద్ వేళ ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేటు క్యాబ్ దందా జోరుగా సాగింది. క్యాబుల్లోచార్జీలు భారీగా పెంచారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వొసూలు చేయడంతో లబోదిబోమన్నారు. ఉప్పల్ నుంచి హనుమకొండకు క్యాబ్ డ్రైవర్లు డబుల్ ఛార్జీలు వసూలు చేశారు. సాధారణ రోజుల్లో రూ.300 తీసుకుంటుండగా బంద్ కారణంగా రూ.700 వసూలు చేశారు. నగరంలోని సిటీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అవడంతో సొంత ఊర్లకు వెళ్లేవారు నానా తంటాలు పడ్డారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. మెట్రో రైళ్ల సర్వీసులు యధావిధిగా కొనసాగడతో మెట్రో కిక్కిరిసిపోయింది. ప్రధాన మెట్రో స్టేషన్ల వద్ద, ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్, అర్ పేట్ వంటి కేంద్రాల్లో భారీగా ప్రయాణికులు చేరుకుంటున్నారు. ఎంజీబీఎస్ ముందు బీసీ సంఘాల నేతల ఆందోళన చేపట్టారు. జూబ్లీ బస్ స్టేషన్ లో బీసీ సంఘాలు బైఠాయించాయి. జేబీఎస్ దగ్గర బంద్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రాజేంద్రనగర్, దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ, హయత్‌నగర్, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దిల్ సుఖ్ నగర్ బస్ డిపో వద్ద బీసీ బంద్ ఉద్ధృతంగా సాగింది. ఉదయం నుంచే బీసీ సంఘాల నేతలు, వివిధ పార్టీల నాయకులు వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. ప్రైవేటు బస్సులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు, బీసీ సంఘాల నేతల మధ్య వాగ్వాదం చెలరేగింది. బంద్ వేళ కరీంనగర్‌లో హోటల్ శ్వేత తెరచి ఉంచారు. హోటల్ మూసివేసి బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అయినా నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో సీపీఐ నాయకులు హోటల్ లోకి వెళ్లి ఫర్నిచర్, సామగ్రి ధ్వంసం చేశారు.
నల్లగొండలో కార్ల షోరూమ్‌పై దాడి
నల్లగొండ : నల్గొండ జిల్లాలో బీసీ జేఏసీ బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలోని చర్లప్పల్లి పవన్ మోటార్స్ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బంద్ చేయకుండా షోరూం ఓపెన్ చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు షోరూం అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నల్గొండ డీఎస్పీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





