పథకాల అమలులో అలసత్వాన్ని సహించం

– ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 18: ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నివాసంలో సీఎంవో కార్యదర్శులు, సీఎస్‌ రామకృష్ణారావుతో ముఖ్యమంత్రి శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా అలసత్వం వీడాలని సూచించారు. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని చెప్పారు. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్‌ను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇకపై సీఎస్‌తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page