– ఆరోపణలకు ఈసీ బహిరంగ సమాధానాలు ఇవ్వాలి
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ప్రజల ఓటు విలువను కాపాడాలంటూ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని పోలీసు బ్యారికేడ్లతో ఆపలేరని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నంత మాత్రాన వారు లేవనెత్తిన ప్రశ్నలు మాయమైపోవని, సమాధానం కోసం నిలబడిన గొంతును అడ్డుకుంటే ఆ ప్రశ్న మరింత బలంగా దేశమంతటా ప్రతిధ్వనిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల పారదర్శకత కోసం దృఢంగా నిలబడి ప్రతిపక్ష నిరసనకు నాయకత్వం వహించిన రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు. దిల్లీలో ఎన్నికల సంఘం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య జవాబుదారీతనంపై మరింత చర్చకు దారితీసిందన్నారు. ఓటర్ల జాబితాల సవరణ, ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై వివరణ కోరుతున్న నాయకులను అడ్డుకున్న దృశ్యాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయన్నారు. బ్యారికేడ్ల ఎత్తుతో ప్రజాస్వామ్య బలాన్ని కొలవలేరు.. ప్రజల సందేహాలకు ఇచ్చే సమాధానాల స్పష్టతలోనే వ్యవస్థల బలం కనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలకు అనుగుణంగా పూర్తి నిష్పాక్షికతతో వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు. రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠను నిలబెట్టేది అధికార దర్పం కాదు.. ప్రజల విశ్వాసం.. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే నిర్ణయాల్లో పారదర్శకత, అభ్యంతరాల పరిశీలనలో నిజాయతీ, సమాధానాల్లో స్పష్టత ఉండాలి.. సంస్థను ప్రశ్నించడం దాని ప్రతిష్ఠను దెబ్బతీయడమంటూ భావించే ధోరణి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం’ అని మంత్రి అన్నారు. ఓటర్ల జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను రాజకీయ విమర్శలంటూ కొట్టిపారేయడం సరికాదన్నారు. ప్రతి ఓటుకూ విలువ ఉండాలని, ప్రతి అర్హుడూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని రాహుల్ గాంధీ పట్టుబడుతున్నారని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో ఆయన చేస్తున్న పోరాటం దేశ ప్రజలందరికీ సంబంధించినదని స్పష్టం చేశారు. ప్రజల తీర్పుతో ఏర్పడే ప్రభుత్వాల విశ్వసనీయతను కాపాడాలంటే ఆ తీర్పు వెలువడే ఎన్నికల ప్రక్రియపై పూర్తి నమ్మకం ఉండాలి అని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





