ములుగు ఏజెన్సీలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం

– గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కలగాలి
– ములుగులో ఐటీ రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం
– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, జూన్ 17 : ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సాంకేతిక రంగంలో కొత్త భవిష్యత్తుకు దారులు వేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లా కేంద్రం ములుగులో ఏర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇప్పటివరకు ఐటీ రంగం ప్రధానంగా నగరాలకు మాత్రమే పరిమితమైందని, ఐటీ అవకాశాలు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు కూడా చేరుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నేటి సాంకేతిక యుగంలో ఎక్కడి నుంచైనా పని చేసే అవకాశాలు ఉన్నాయంటూ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ జరిగితేనే మారుమూల ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. శ్రియా ఇన్ఫోటెక్ సంస్థ సంవత్సర కాలంగా ములుగు ప్రాంత యువతకు వివిధ రంగాల్లో సాంకేతిక శిక్షణ అందిస్తూ యాప్ డెవలప్‌మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా యాప్‌లను అభివృద్ధి చేసి వివిధ పాఠశాలలు, సంస్థలు, ఐటీ రంగానికి సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 15 మంది యువత ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ వంటి నగరాలకు మాత్రమే ఐటీ పరిశ్రమలు పరిమితం కాకూడదని, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు.  జిల్లాలో ఇతర ఐటీ సంస్థలు, కంపెనీలు స్థాపించడానికి ముందుకు రావాలని, పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. శ్రియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు రవికుమార్ రంగారి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అంటూ భవిష్యత్తులో సంస్థ మరింత విస్తరించి మరెందరో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, శ్రియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు రవికుమార్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *