దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు
బాధ్యలందరిపై కఠిన చర్యలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: మీడియాపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మీడియాపై మూకుమ్మడి దాడి చేయడం అత్యంత దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. మీడియాలో జరిగే చర్చలు, చెప్పే విషయాలు కుట్రపూరితంగానే జరుగుతున్నాయని ఎవరైనా భావిస్తే చట్ట ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలుపవచ్చని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నిరసన తెలపడంతో పాటు ప్రభుత్వంలోని వ్యవస్థల దగ్గరికు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఆ స్వేచ్ఛ రాష్ట్రంలో అందరికీ ఉందని అన్నారు. ఇలాంటి ఫిర్యాదులపై పరిశీలన చేసి న్యాయం చేసే వ్యవస్థలు ఈరోజు రాష్ట్రంలో అత్యంత పటిష్టంగా ఉన్నాయని చెప్పారు.
ఎంతో శాంతియుతంగా, అభివృద్ధికి ఆలవాలంగా ముందుకు సాగుతున్న హైదరాబాద్ మహానగరం, రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరగడం గర్హనీయమని ఉపముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రానికి, హైదరాబాద్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని, తద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందుకు సాగాలని ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రాష్ట్రం, హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలా చేసే ఇలాంటి దుశ్చర్యలను, వ్యవస్థీకృత దాడులను ప్రభుత్వం ఎలాంటి పరిస్థితిలో ఉపేక్షించదని మీడియా ముఖంగా స్పష్టం చేశారు. అంతేకాక దాడులు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మహా న్యూస్ మీడియా హౌస్ణ్‌పై జరిగిన దాడిని ప్రత్యక్షంగా పరిశీలించాను. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.