సాంస్కృతిక వైభవాన్ని చాటేలా కళా ప్రదర్శనలు

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేయాలి
– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణ సాంస్కృతిక, కళా వారసత్వాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా జానపద, శాస్త్రీయ సంగీత, నృత్య కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. సమ్మిట్ నిర్వహణ, అతిథులకు స్వాగతం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రచార వ్యూహాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరుకానున్న ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ పెట్టుబడుల అవకాశాలతోపాటు రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని సీఎస్ సూచించారు. సమ్మిట్ ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులకు ఘన స్వాగతం పలికేలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ కళారూపాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న రక్షా ఎక్స్‌పో, చివరి రోజైన 9న ఏర్పాటు చేయనున్న ఎయిర్ షోను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆ రోజున తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక కల్చరల్ కార్నివాల్ నిర్వహించాలని ఆదేశించారు.
సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి
సమ్మిట్‌కు కర్టెన్ రైజర్ కార్యక్రమాలను ఈ నెల 24న హైదరాబాద్‌లో, 29న దిల్లీలో ఘనంగా నిర్వహించాలని సీఎస్ సూచించారు. సమ్మిట్, రక్షా ఎక్స్‌పోలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆకర్షణీయమైన హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌తోపాటు ఇతర ప్రముఖ ప్రాంతాల్లోనూ ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంతోపాటు నగరంలోని ప్రధాన రహదారులు, ప్రముఖ ప్రాంతాలు, స్టార్ హోటళ్ల వద్ద వెంటనే హోర్డింగులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయస్థాయి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియా వేదికల ద్వారా సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీల భాగస్వామ్యంతో ప్రత్యేక షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించి, సమ్మిట్ ప్రాధాన్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, కార్యదర్శులు హరిచందన, శశాంక, ముకుంద్ రెడ్డి, అజిత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్‌వో మల్సూర్, డిజిటల్ విభాగం డైరెక్టర్ కర్రీ శ్రీరామ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *