– రోడ్డు భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి
– డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ అనే నూతన అవగాహన కార్యక్రమాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.శివధర్ రెడ్డి ప్రకటించారు. పోలీస్ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రతా నిపుణులు తదితరులతో తన కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. యేటా వివిధ సంఘటనల్లో హత్యలకు గురయ్యే వారి సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య పది రెట్లు ఎక్కువగా ఉందని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతను ప్రజా ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అరైవ్ అలైవ్ రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని డిసెంబర్‌లో 15 రోజులపాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఈనెల 16న జరిగే ప్రపంచ రోడ్డు భద్రతా బాధితుల స్మారక దినం సందర్భంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయనున్నామన్నారు. ఈ ప్రచారం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం, నియమాలను కచ్చితంగా పాటించేలా చేయటం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాన్ని ప్రోత్సహించటం, ప్రమాదాలను తగ్గించటం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టాలన్నారు. పోలీసు శాఖ, రవాణా శాఖ, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ ఆలోచనలను సమీకరించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి నవంబర్ 9 లేదా 10న జరిగే తదుపరి సమావేశంలో చర్చించాలని డీజీపీ సూచించారు. అంతేకాక వివిధ ప్రాంతాల్లో అమలులో ఉన్న రోడ్డు భద్రతకు సంబంధించి ఉత్తమ విధానాలను పరిశీలించి తెలంగాణలో అనుసరించదగిన మార్గాలను రూపొందించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు సూచనలు చేశారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ జారీకి ముందు డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రైవింగ్ విద్యా శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఆ శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని, పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రతా విద్యను పాఠ్యాంశంగా చేర్చటం, ప్రజల్లో అవగాహన పెంచేందుకు రోడ్డు భద్రతా పార్కులను ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి వాహన డ్రైవర్ సేఫ్టీ కనెక్ట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్‌ను ఉపయోగించాలన్నారు. ఈ యాప్ డ్రైవింగ్ విధానాన్ని పర్యవేక్షించి భద్రతా ప్రమాణాలను పాటించేందుకు సహకరిస్తుందన్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా రోడ్డు భద్రతా నియమాలపై విస్తృత ప్రచారం చేయాలని, అరైవ్ అలైవ్ టీజీ వంటి ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని చెప్పారు. ప్రయోజనకరమైన సూచనలను ఇచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను డీజీపీ అభినందించారు. ప్రజల భాగస్వామ్యం, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన, నియమాల అమలు, డిఫెన్సివ్ అంశాల సమన్వయమే రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కీలకమని స్పష్టం చేశారు. సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ ఎం.భగవత్, ఏడీజీపీ (మల్టి జోన్-2) దేవేంద్ర సింగ్ చౌహాన్, ఐజీపీలు (మల్టిజోన్-1) ఎస్.చంద్రశేఖర్ రెడ్డి (ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్) డాక్టర్ ఎం.రమేశ్, ఐజీపీి (రైల్వే అండ్ రోడ్డు భద్రత) కె.రమేశ్‌నాయుడు, జాయింట్ సీపీ (ట్రాఫిక్, హైదరాబాద్ సిటీ) డి.జోయెల్ డేవిస్ తదితర అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థల తరఫున తన్మయి దీక్షిత్ (ఫౌండర్, సేఫ్టీ కనెక్ట్), నరేశ్ రాఘవన్ (టాప్ డ్రైవర్), మాల్కమ్ వోల్ఫ్ (రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్), లోకేంద్ర సింగ్ (ఎచ్‌సీఎస్సీ వలంటీర్), అనిల్ సూర్య (ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్), వినయ వంగాల (సివిల్ యాక్టివిస్ట్), వినోద్ కనుముల (రోడ్డు భద్రత నిపుణుడు) తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





