- ఎంపీల్లోనూ తిరుగుబాటు
– అభిషేక్ నాయకత్వాన్ని వ్యతిరేస్తున్న మెజార్టీ ఎంపీలు
కోల్‌కతా, జూన్ 5: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. పార్టీ రెబల్ గ్రూప్ ఎమ్మెల్యలతో 23 మంది ఎంపీలు ప్రస్తుతం సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తాజాగా బాంబు పేల్చాయి. దీంతో రాబోయే రోజుల్లా టీఎంసీ పార్లమెంటరీ విభాగం నిట్టనిలువుగా చీలిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు పట్టు సాధించారు. పార్టీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా 57 మంది టీఎంసీలు ఎమ్మెల్యేలు ఇటీవల ఎన్నుకున్నారు. ఆ ఎన్నికను స్పీకర్ రతీంద్ర బోస్ కూడా గుర్తించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మమతా బెనర్జీని గౌరవిస్తున్నామని చెబుతూనే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ నాయకత్వాన్ని మాత్రం ఒప్పుకునేది లేదని కరాఖండిగా చెబుతున్నారు. తాజాగా టీఎంసీ ఎంపీల్లోనూ అసంతృప్తి పెల్లుబుకుతోంది. అభిషేక్ బెనర్జీ పట్ల పలువురు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పాటేందుకు వీరు చర్చలు జరుపుతున్నారని, 12 మందికి పైగా ఎంపీలు ఇందుకు సుముఖంగా ఉన్నారని అంటున్నాయి. టీఎంసీ పార్లమెంటరీ ప్రత్యేక కూటమిగా ఏర్పడేందుకు, చీలిక తెచ్చేందుకు తగిన సంఖ్యాబలంపై కూడా చర్చ జరుగుతోందని చెబుతున్నారు. టీఎంసీకి లోక్‌సభలో ప్రస్తుతం 29 మంది ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి ఫిరాయింపుల చట్టం నుంచి వేటుపడకుండా ఉండాలంటే కనీసం 23 మంది మద్దతు ఇందుకు అవసరమవుతుంది. రాజ్యసభ పరంగా చూస్తే టీఎంసీకి 13 మంది ఎంపీలున్నారు. ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం 9 మంది ఎంపీలు కలిసిరావాలి. ఈ పరిణామాలపై రెబల్ నేత రీతాబత్ర బెనర్జీని ప్రశ్నించగా, గత వారం రోజుల్లో తాను ఏ ఎంపీతోనూ మాట్లాడలేదని, అందువల్ల వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారో తనకు తెలియదని చెప్పారు. అయితే రేపటిరోజు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరని అన్నారు. దీనిపై వెటరన్ రాజ్యసభ ఎంపీ సుఖేందర్ శేఖర్ రాయ్ మాట్లాడుతూ, ఇంత తక్కువ సమయంలో 60 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం ఎప్పుడూ చూడలేదని, అదే స్పందన లోక్‌సభలోనూ ఉండే అవకాశాలు లేకపోలేదని అన్నారు.
అసమ్మతికి కళ్లెం వేసే యత్నం
లోక్‌సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండటంపై ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ లోక్‌సభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది. 80 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికే పరమితమైంది. ఈ నేపథ్యంలో లోక్‌సభకు పోటీ చేసే ఆలోచనలో మమతాబెనర్జీ ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. బహరాంపుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను రాజీనామా చేసి మమత పోటీకి మార్గం సుగమం చేయాలని కోరనున్నట్టు తెలుస్తోంది. 2011 ప్రపంచ కప్ విన్నింగ్ స్క్వాడ్‌లో ఒకరైన భారత మాజీ క్రికెటర్ పఠాన్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో బహరాంపుర్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అధీర్ రంజన్ చౌదరిపై 85,000 వోట్ల ఆధిక్యంతో పఠాన్ గెలుపొందారు. మమతా బెనర్జీ గతంలోనూ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. కోల్‌కతా సౌత్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. అయితే తొలి ఎన్నిక మాత్రం జాదవ్‌పుర్ నుంచి సీపీఐ అగ్రనేత సోమనాథ్ ఛటర్జీపై పోటీ చేసి గెలుపొందారు. రైల్వేమంత్రిగానూ పనిచేశారు. 2011లో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించింది. కాగా, ఇటీవల పార్టీ నాయకత్వం పనితీరుపై లోక్‌సభ టీఎంసీ సీనియర్ ఎంపీల్లో అసమ్మతి తలెత్తేది. కొందరు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మమతకు సన్నహితురాలిగా పేరున్న పార్టీ సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ బహిరంగంగానే ఇటీవల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బరాసత్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఉన్న ఆమె లోక్‌సభలో తనపై అనుచితంగా మాట్లాడుతున్నారంటూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. పార్టీ పనితీరును ప్రశ్నించిన సీనియర్ ఎంపీల్లో సుఖేందు శేఖర్ రాయ్, శాంతనుసేన్ సైతం ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తిరుగుబాటును టీఎంసీ ఎదుర్కొంటోంది. టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పార్టీకి చెందిన 57 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. స్పీకర్ రతీంద్ర బోస్ కూడా ఈ నియామకాన్ని గుర్తించారు. ఈ క్రమంలో ముందుగా లోక్‌సభలో అసమ్మతికి క్లళెం వేసేందుకు ఆ సభలో అడుగుపెట్టాలనే ఆలోచనలో మమత ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





