ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల పాటు హైదరాబాద్ బుక్ ఫేర్ అనే పుస్తకాల పండుగ జరగబోతున్నది. ‘ఈ రోజుల్లో పుస్తకాలు చదివే చాదస్తులెవరండీ’ అని సన్నాయి నొక్కులు నొక్కే వారుంటారు. పుస్తకమే శ్వాసగా ధ్యాసగా ప్రాణంగా ప్రపంచంగా బతుకుతున్నవాళ్లూ ఉంటారు. ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతున్న పండుగే గనుక ఇందులో కొత్త ఏమున్నది అనే వాళ్లూ ఉంటారు. పది కోట్ల మంది తెలుగు మాట్లాడేవాళ్లు, అందులో కనీసం ఏడు కోట్ల మంది చదువూ రాతా వచ్చినవాళ్లు ఉండగా, ఒక్కొక్క పుస్తకం వెయ్యి కాపీలు కూడా అమ్మని జాతికి పుస్తకాల పండుగ ఎందుకు అని ఈసడించే వాళ్లు కూడా ఉంటారు. కాని ఎవరు ఏమనుకున్నా ఏమన్నా పుస్తకం ఉన్నది, ఉంటుంది. అక్షరం అనే మాటకే మరణం లేనిది అనే అర్థం ఉండగా వేలాది, లక్షలాది, కోట్లాది అక్షరాలతో కూడిన పుస్తకం మరెంతగా క్షారం లేకుండా ఉంటుంది?!
పుస్తకం లేకుండా మానవ సమాజం జీవించిన కాలం ఒకటి ఉండిందన్నమాట నిజమే. కాని మనిషి తన ధ్వనులకు, సైగలకు, మాటలకు అక్షరాల చిహ్నాలు, ప్రతీకలు ఏర్పాటు చేసుకుని, ఆ అక్షరాలను బండరాళ్ల మీదనో, గుహల గోడల మీదనో చెక్కడం మొదలు పెట్టినాక మానవ జీవితమే మారిపోయింది. ఆ అక్షరాలు చెక్కిన బండలను తేలికగా రవాణా చేసే అవకాశం లేదు గనుక తేలికైన మాధ్యమాల కోసం అన్వేషిస్తున్న క్రమంలో చిన్న ఇటుకల మీద అక్షరాలు చెక్కి వరుసగా పేర్చినవి మొదటి పుస్తకాలు. అక్కడి నుంచి తోలు మీద, వస్త్రం మీద, చెట్టు బెరడు మీద, కొన్ని చెట్ల ఆకుల మీద, చెట్ల బెరడు గుజ్జుతో తయారయిన తొలి రూపపు కాగితం మీద ఆ అక్షరాలు చెక్కుతూ పోయారు.
అప్పటివరకూ నోటి మాటతో రచించిన, ప్రచారం చేసిన, నిక్షిప్తం చేసిన, ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ చేసిన పుస్తకాలు అక్షరాలకెక్కాయి. ఒకసారి కాగితం కనిపెట్టిన తర్వాత పుస్తకాలకు ప్రతులు రాయడం, అంటే పుస్తకాలను వ్యాప్తి చేయడం, స్థిర రూపం ఇవ్వడం సాధ్యమయింది. ఆ తొలి పుస్తకాల నుంచి వందల ఏళ్లు గడిచాక 1450లలో విడి అక్షరాల ముద్రలు తయారు చేసి, వాటిని సిరా సహాయంతో కాగితం మీద అచ్చువేసే గూటెన్ బర్గ్ అచ్చు యంత్రం వచ్చింది. మానవజాతి చరిత్రలో అది ఒక మహాద్భుత అన్వేషణ. ఇవాళ ప్రపంచం దాని మంచి చెడులతో సహా ఇట్లా ఉన్నదంటే అందుకు పూర్తి బాధ్యత గూటెన్ బర్గ్ దే అని మార్క్ ట్వేన్ అన్నమాట అక్షరాలా నిజం. గూటెన్ బర్గ్ అచ్చు యంత్రం, దాని సహాయంతో వేగంగా, విరివిగా పుస్తకాలు అచ్చువేసే అవకాశం వచ్చాక, పుస్తక జ్ఞానం కొందరి గుత్త సొమ్ము కావడం నుంచి బహిరంగంగా, సామాజిక ఆస్తిగా మారడం మొదలయింది.
గూటెన్ బర్గ్ అచ్చు యంత్రం మొదలయ్యాక యాబై ఏళ్లకే, 1500 నాటికే ప్రపంచంలో, బహుశా యూరప్ లో, అచ్చయిన పుస్తకాల సంఖ్య తొంబై లక్షలు కావచ్చునని ఒక అంచనా. గూటెన్ బర్గ్ నుంచి ఇప్పటికి మొత్తం అచ్చయిన పుస్తకాల సంఖ్య పదమూడు కోట్లు కావచ్చునని గూగుల్ అంచనా వేసింది. సాలీనా ఐదు లక్షల నుంచి పది లక్షల కొత్త పుస్తకాలు ఈ జాబితాకు చేరుతున్నాయని మరొక అంచనా. ప్రపంచ వ్యాప్తంగా వందలాది భాషల్లో అచ్చవుతున్న అనేక పుస్తకాల సమాచారం ఈ పరిశోధనా సంస్థలకు అందదు గనుక ఈ అంకెలు పూర్తి వాస్తవం కాకపోవచ్చు. ఈ అంకెలు మొత్తం అచ్చయిన ప్రతుల సంఖ్య కాదు, ఇవి కేవలం అచ్చయిన శీర్షికల సంఖ్య మాత్రమే. ఒక్కొక్క శీర్షిక పుస్తకం కొన్ని వందలో, వేలో ప్రతులు అచ్చయి ఉంటుందంటే ఇవాళ్టికివాళ లెక్క వేసినా కొన్ని వందల కోట్ల పుస్తకాల ప్రతులు చలామణీలో ఉన్నాయన్నమాట. పుస్తకాల రంగాలు, శాస్త్రాలు పెరుగుతున్న కొద్దీ పుస్తకాల సంఖ్య కూడా పెరుగుతున్నది.
హైదరాబాద్ పుస్తక సంస్కృతికి పెట్టింది పేరు. ముఖ్యంగా అసఫ్ జాహీ పాలనా కాలంలో ప్రపంచమంతటా పుస్తకాలు వ్యాపిస్తున్న సమయాన, బహుభాషా రాజ్యంగా హైదరాబాద్ రాజ్యం అనేక భాషల పుస్తకాలకు కేంద్రం అయింది. రాజ్యంలో తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషల ప్రజలు, రాజభాష ఉర్దూ, రాజ్యంలోని ఉన్నత వర్గాలకు ఫ్రెంచి, ఇంగ్లిష్ సంస్కృతులతో సంపర్కం, అధికార వ్యవస్థలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ ఉద్యోగుల వల్ల హిందీ, కొత్తగా ఏర్పడిన రైల్వేలో పని చేయడానికి మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన తమిళులు – అలా హైదరాబాద్ పందొమ్మిదో శతాబ్ది చివరా, ఇరవయో శతాబ్ది మొదటా ఏడెనిమిది భాషల కేంద్రం అయింది. నిజమైన కాస్మోపాలిటన్ – బహుళత్వ – నగరం అయింది.
కనుక పుస్తకం అంతమైపోతున్నదని, అది అంతరించిపోయే జాతుల్లో ఒకటని ఎవరు ఎన్ని శాపనార్దాలు పెట్టినా పుస్తకం ప్రపంచవ్యాప్తంగా నానాటికీ విస్తరిస్తున్నది. బుక్ కల్చర్ పోయి, లుక్ కల్చర్ వచ్చింది అని ఎలక్ట్రానిక్ మాధ్యమాల కొత్త రోజుల్లో అన్నమాట, ఇప్పుడు సెల్ ఫోన్ లుక్ కల్చర్ తర్వాత మరింత వాస్తవం అనిపించవచ్చు గాని, మనకంటే ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అమెరికన్, యూరపియన్ సమాజాలలోనే పుస్తకం అంతరించిపోలేదు సరిగదా పుస్తక రచన, పుస్తక ప్రచురణ, పుస్తకాల అమ్మకాలు, పుస్తక పఠనం, మొత్తంగా పుస్తక సంస్కృతి నానాటికీ విస్తరిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానంలో ఆ దేశాలతో పోలిస్తే వెనుకబడి ఉన్న మన సమాజంలో పుస్తకం అంతం సమీపంలో ఉన్నదనే మాటకు అర్థమే లేదు.
అయితే మన సమాజంలో పుస్తక సంస్కృతి, పుస్తక పఠనం ఉండవలసినంత విస్తారంగా లేవన్నమాటకు గణాంకాలే రుజువు. రచయితలు పెరుగుతున్నారు, ఇంతకాలమూ చదువుకు దూరంగా ఉంచబడిన, పక్కలకు తోసేయబడిన కులాలూ వర్గాలూ చదువులో ప్రవేశించి, ఒకటి రెండు తరాల విద్యావంతులు వచ్చాక, ఆయా వర్గాల నుంచి కొత్త రచయితలు పుట్టుకొస్తున్నారు. ఆ వర్గాల నుంచే కొత్త పాఠకులు వస్తున్నారు. వారి ఆసక్తులూ అభిరుచులూ వేరు కావచ్చు. ‘నడవగలవంటే నాట్యం వచ్చునన్నమాటే, మాట్లాడగలవంటే పాడగలవన్న మాటే’ అని ఒక ఆఫ్రికన్ సామెత చెప్పినట్టు, నువ్వు మనిషివైతే, మెదడుంటే, ఆలోచించడం, వ్యక్తీకరించడం దాని లక్షణం. ఆ వ్యక్తీకరణకు అక్షరాలు తొడిగితే అదే రచన. అంటే ప్రతి మనిషీ రచయితే. కాకపోతే రచయిత కావడానికి కొంత సాధన, కొంత శిక్షణ, స్వీయ సమయపాలన అనే క్రమశిక్షణ, తన భాషలో, ఇతర భాషల్లో రచయితలు ఏమి రాస్తున్నారో తెలుసుకునే అధ్యయనం అవసరం. ఆధునిక జీవనంలో ఇవన్నీ సాధ్యమైనా కాకపోయినా, కొత్త తరం రచయితలు, మొదటి తరం, రెండో తరం విద్యావంతుల లోంచి వికసిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిసి కనీసం ఇరవై ప్రముఖ ప్రచురణ సంస్థలు సంవత్సరానికి వెయ్యి నుంచి రెండు వేల పుస్తకాలు ప్రచురిస్తున్నాయి. చిన్న ప్రచురణ సంస్థలు, వ్యక్తులు స్వయంగా ప్రచురిస్తున్న పుస్తకాలు మరొక వెయ్యి ఉంటాయి. అంటే తెలుగులో రోజుకు సగటున పది పుస్తకాలు వెలువడుతున్నాయి. కొనేవాళ్లూ చదివేవాళ్లూ లేకపోతే, కొందరు సందేహజీవులు భావిస్తున్నట్టు చదివే అలవాటు శూన్యమై పోయి ఉంటే ఇన్ని పుస్తకాలు అచ్చయి ఉండేవే కావు. అయితే ఒకప్పటి లాగ సృజనాత్మక సాహిత్య ప్రక్రియల పుస్తకాల సంఖ్య తగ్గిపోయి ఉండవచ్చు. వైద్యం, వ్యక్తిత్వ వికాసం, భక్తి, సాంకేతిక పరిజ్ఞానం, రాజకీయాలు, సినిమా, క్రీడలు వంటి కొత్త రంగాల పుస్తకాలు వెలువడుతూ ఉండవచ్చు.
పుస్తక సంస్కృతి పూర్తిగా పోయిందనుకున్నా, పోతున్నదనుకున్నా, లేదనుకున్నా, నిజంగా అటువంటి విచారం ప్రకటిస్తున్న వారు చేయవలసిన బృహత్ కర్తవ్యం పుస్తక సంస్కృతిని వ్యాపింపజేయడమే. పుస్తకాలు కొనడం, కొనిపించడం, చదివించడం, పుస్తకాలు చదవడంలో ఆసక్తి పెంచే కార్యక్రమాలు చేపట్టడం, బుక్ రీడర్స్ క్లబ్ లు ఏర్పాటు చేయడం, పుస్తక సమీక్షలను, పరిచయాలను ప్రోత్సహించడం, పుస్తకం మనిషికి ఎంత అవసరమో ప్రచారం చేయడం, మళ్లీ ఒకసారి గ్రంథాలయోద్యమాన్ని వ్యాపింపజేయడం… ఈ పనులన్నిటికీ వేదిక పుస్తకాల పండుగ. ఇప్పుడు ఈ పుస్తకాల పండుగ ఏడాదికొకసారి జరుగుతున్నది గాని, ప్రతి నెలా, ప్రతి వారమూ, ప్రతి రోజూ, ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీథిలో, ప్రతి ఇంట్లో నిరంతరం జరగవలసిన పండుగ ఇది.
ఆ సంప్రదాయపు వారసత్వంలోనే 1980ల చివరిలో ప్రారంభమయిన హైదరాబాద్ బుక్ ఫేర్ ఇప్పుడు 37వ పండుగకు సిద్ధమవుతున్నది. ఈ పండుగ మరొకసారి పుస్తక సంస్కృతి అవసరాన్ని ఎత్తిపట్టాలి. పుస్తకాన్ని జెండాగా ఎగరేయాలి. పుస్తక పఠన సంస్కృతిని మరొకసారి విస్తరించి హైదరాబాద్ కాస్మోపాలిటన్ – బహుళత్వ స్వభావాన్ని, బహుభాషా సహజీవన విలువలను నిలబెట్టాలి.
చదవని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్ అని పోతన చెప్పాడని మాత్రమే కాదు. పుస్తకం చదవని మనిషికీ చదివిన మనిషికీ కచ్చితంగా తేడా ఉంటుంది. చదవని మనిషి అనుభవానికీ, అనుభూతులకూ, ఆలోచనలకూ తన పంచేంద్రియాల పరిమితులుంటాయి. ఆ ఇంద్రియాలకుఅందిన అనుభవాలే, వాటి నుంచి పొందిన అనుభూతులే, వాటి నుంచి గ్రహించిన ఆలోచనలే ఆ మనిషికి అందుతాయి. కాని పుస్తకం చదివిన మనిషి, ఆ పుస్తకం కథో నవలో అయితే డజన్ల కొద్దీ, వందల కొద్దీ మనుషుల అనుభవాలను తాను అనుభవించకుండానే గ్రహించవచ్చు. అది కవిత్వమో, నాటకమో అయితే అనేక పాత్రల అనుభూతులను, అనేక రసాలను ఆ పుస్తకం నుంచి గ్రహించవచ్చు. అది ఒక వ్యాసమో, సైద్ధాంతిక, శాస్త్ర గ్రంథమో అయితే తన ఆలోచనలకు భిన్నమైన, దూరమైన, వ్యతిరేకమైన ఎన్నో ఆలోచనలను గ్రహించవచ్చు. మనిషికీ పుస్తకానికీ సాగే సంభాషణలో, సంవాదంలో మనిషి ఉన్నతీకరణ సాధ్యమవుతుంది. స్థలకాల బద్ధులైన మనుషులు తమ స్థల కాలాలను అధిగమించి కొత్త అనుభవాలనూ, కొత్త అనుభూతులనూ, కొత్త ఆలోచనలనూ, కొత్త ఊహలనూ చేయడానికి పురికొల్పగలిగినది పుస్తకమే. అంటే మనిషి ఉన్నతీకరణకు, సమాజ ఉన్నతీకరణకు పుస్తక సంస్కృతి అవసరం.
హైదరాబాద్ పుస్తక సంస్కృతికి పెట్టింది పేరు. ముఖ్యంగా అసఫ్ జాహీ పాలనా కాలంలో ప్రపంచమంతటా పుస్తకాలు వ్యాపిస్తున్న సమయాన, బహుభాషా రాజ్యంగా హైదరాబాద్ రాజ్యం అనేక భాషల పుస్తకాలకు కేంద్రం అయింది. రాజ్యంలో తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషల ప్రజలు, రాజభాష ఉర్దూ, రాజ్యంలోని ఉన్నత వర్గాలకు ఫ్రెంచి, ఇంగ్లిష్ సంస్కృతులతో సంపర్కం, అధికార వ్యవస్థలోకి వచ్చిన ఉత్తరప్రదేశ్ ఉద్యోగుల వల్ల హిందీ, కొత్తగా ఏర్పడిన రైల్వేలో పని చేయడానికి మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన తమిళులు – అలా హైదరాబాద్ పందొమ్మిదో శతాబ్ది చివరా, ఇరవయో శతాబ్ది మొదటా ఏడెనిమిది భాషల కేంద్రం అయింది. నిజమైన కాస్మోపాలిటన్ – బహుళత్వ – నగరం అయింది. కాస్మోపాలిటన్ పుస్తక సంస్కృతి విలసిల్లింది. తర్వాతి పాలకులు ఈ బహుభాషా సహజీవన సంస్కృతిని చెరిపెయ్యాలని ఎంత ప్రయత్నించినా ప్రజల్లో అది నిలిచే ఉంది, బతికే ఉంది.
ఆ సంప్రదాయపు వారసత్వంలోనే 1980ల చివరిలో ప్రారంభమయిన హైదరాబాద్ బుక్ ఫేర్ ఇప్పుడు 37వ పండుగకు సిద్ధమవుతున్నది. ఈ పండుగ మరొకసారి పుస్తక సంస్కృతి అవసరాన్ని ఎత్తిపట్టాలి. పుస్తకాన్ని జెండాగా ఎగరేయాలి. పుస్తక పఠన సంస్కృతిని మరొకసారి విస్తరించి హైదరాబాద్ కాస్మోపాలిటన్ – బహుళత్వ స్వభావాన్ని, బహుభాషా సహజీవన విలువలను నిలబెట్టాలి.