గిరియానం – 21
మార్గమధ్యలో సియోమి అనే చిన్నగ్రామంలోని స్థానికుల ఇంటికి వెళ్ళాం. అది లోహకారుల కుటుంబం. అంటే వెండి, రాగి, ఇత్తడితో రకరకాల కళాకృతులు తయారు చేసి అమ్ముతారు. ఇంటిల్లిపాది కష్టపడి పనిచేస్తున్నారు. పురుషులు ఇత్తడి, రాగితో పెద్ద కళాకృతులు తయారు చేస్తున్నారు. మహిళలు, పిల్లలు వెండితో చిన్న చిన్న కళాకృతులు తయారు చేస్తున్నారు. ప్రయాణం చేయడం అంటే కేవలం ప్రదేశాలు చూడడo మాత్రమే కాదు. స్థానిక ప్రజల జీవన విధానం, సంస్కృతి కూడా తెలుసుకోవడం. అందుకే మేం ఫ్నోమ్ ఫెన్ నుంచి సియమ్ రిప్ దాకా రోడ్డు దారిలో ప్రయాణించాo. దారిలో స్థానిక ప్రజలతో మాట్లాడం, వ్యవసాయ క్షే త్రాలను దర్శించడం, స్థానిక పానీయం, ఆహారాన్ని రుచిచూడడం అందులో ముఖ్యమైనవి.
హోటల్ గది ఖాలీ చేసి, అక్కడే అల్పాహారం ముగించి ఉదయం ఎనిమిది గంటలకు వాహనంలో బయలుదేరాం. ఫ్నోమ్ ఫెన్ నుంచి సెయమ్ రిప్ కు సుమారు మూడువందల ఇరవై కిలోమీటర్ల దూరం. ఐదారు గంటల ప్రయాణం . మేం అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాం కాబట్టి హోటల్ గదికి సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో చేరుకున్నాం. అందమైన గ్రామీణ ప్రాంతాలగుండా మా ప్రయాణం సాగింది. ఇరు వైపులా పచ్చని పంటపొలాలు. అక్కడి వరి వంగడం ఆ ప్రజల మాదిరి గానే పొట్టిగా ఉండడాన్ని గమనించాo. దాదాపు ఒకటింబావు అడుగు ఎత్తులో కోతకు సిద్ధంగా ఉంది. లోటస్ లాండ్స్ చాలా దూరం అందమైన తామర పూలతో చూపు తిప్పుకోనివ్వలేదు. అందం కొరకు, ఆకర్షణ కొరకు పెంచినవి కాదు, అక్కడి ప్రధానమైన పంట. స్థానికులు ఆ తామర కాడలను ఆహారంలో ఉపయోగిస్తారు. వాటితో రకరకాల కూరలు వండుతారు. అంతే కాదు, అది వాళ్ళకు ఆదాయ వనరు కూడా.. మహిళలు వాటితో భిన్న మైన, అందమైన కళాకృతులను తయారు చేసి అమ్ముతారు.
మార్గమధ్యలో సియోమి అనే చిన్నగ్రామంలోని స్థానికుల ఇంటికి వెళ్ళాం. అది లోహకారుల కుటుంబం. అంటే వెండి, రాగి, ఇత్తడితో రకరకాల కళాకృతులు తయారు చేసి అమ్ముతారు. ఇంటిల్లిపాది కష్టపడి పనిచేస్తున్నారు. పురుషులు ఇత్తడి, రాగితో పెద్ద కళాకృతులు తయారు చేస్తున్నారు. మహిళలు, పిల్లలు వెండితో చిన్న చిన్న కళాకృతులు తయారు చేస్తున్నారు. బడికి వెళ్ళకుండా చిన్నపిల్లలు పనిచేయడం చూసి నాకు బాధ కలిగింది. వాళ్ళతో మాట్లాడిన తరువాత ఆశ్చర్యపోయాను. అక్కడ ఐదుగురు పిల్లలున్నారు. అందులో ఒక అమ్మాయి. మూడునాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది. తెల్లగా, ముట్టుకుంటే కందిపోయేంత సుకుమారంగా బొమ్మలాగా ఉంది. రెండేళ్ళ బాబు వాళ్ళ అమ్మ చేస్తున్న పనిని అనుకరిస్తూ సుత్తితో కొడుతున్నాడు. మన తల్లులు చిన్న పిల్లలకు సుత్తి లాంటి పరికరాలు ఇవ్వడానికే భయపడతారు. కానీ అలాంటి భయం ఆ తల్లిలో కనిపించలేదు. ఏకాగ్రతతో ఆమె పని ఆమె చేసుకుంటోంది. బాబు కూడా ఎంతో జాగ్రత్తగా దెబ్బ తగలకుండా సుత్తితో కొడుతున్నాడు. పిల్లలకు చిన్నప్పటినుంచే చదువుతోపాటు తాముచేస్తున్న పనిలోకూడా శిక్షణ ఇస్తారట. మిగతా ముగ్గురు 5,4,3 తరగతులు చదువుతున్నారు. అక్కడ సగం దినమే బడి ఉంటుందట. ఉదయం తల్లికి పనిలో సహాయం చేసి మధ్యాహ్నం బడికి తళతామని చెప్పారు.
మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది. ఎక్కడికి వెళ్లినా స్థానిక ఆహార పానీయాలు రుచి చూడవంసిందే.. దారిలో స్థానిక పానీయం అమ్ముతున్న చిన్నచిన్న దుకాణాలున్నాయి. టామ్ తో.. చాలా తక్కువగా తాగాలనే కండిషన్ మీద ఒక కొట్టుదగ్గర ఆగా0 . తీరాచూస్తే అది మన తెలంగాణలో అతి ప్రాచుర్యంమైన నీరా పానీయం. అదే కంబోడియా స్థానిక పానీయo కావడం కాకతాళీయకమే అయినా సంతోషం కలిగింది. సరిగ్గా భోజన సమయానికి మా వాహనం కాంబోడియా టూరిస్టు రెస్టారెంట్ ముందు ఆగింది. పచ్చటి చెట్ల మధ్య చిన్న చిన్న కృత్రిమ జలపాతాలతో, భిన్న వర్ణ పూలమొక్కలతో, చెక్క, బాంబూ కర్రల నిర్మాణంతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. స్థానిక ఆహారం అక్కడి ప్రత్యేకత. మేం శాకాహార భోజనం ఆర్డర్ చేశాం. ” ఫిష్ సాస్ వేయాలా? ” అని అడిగింది వెయిటర్. అక్కడ ఫిష్ శాకాహారం. కొబ్బరి సూప్, జీడిపప్పు వేసి వేయించిన బీట్రూట్ కర్రీ, క్యాబేజీ బీన్స్ కర్రీ, కొబ్బరన్నం మొదలైనవి వడ్డించారు. తేలికగా, చాలా రుచిగా ఉంది ఆహారం. కడుపు నిండింది. కానీ ఆయాసం లేదు.
ప్రయాణంలో టామ్ తమ భాషా సంస్కృతుల గురించి చెప్పు కొచ్చాడు. రెండు మూడు కిలోమీటర్ల దూరంలో చాలా పాఠశాలలే కనిపించాయి.1-12 తరగతుల దాకా ఉచిత విద్యా విధానమే అయినా ఆచరణలో పుస్తకాలు, యూనిఫాం, ఎన్ రోల్ మెంట్ ఫీజుల పేరుతో ఖర్చు అవుతుంది. అందుకే చాలా పేద కుటుంబాల పిల్లలు ఆరో తరగతితో బడి మానేస్తున్నారట. విద్యా బోధన అధికారిక ఖ్మెర్ భాషలో ఉంటుంది. ఉన్నత విద్యలో ఇంగ్లీషు, కంప్యూటర్స్, సైన్సు బోధిస్తారు.
ఖ్మెర్ భాష మూడో శతాబ్దం నుంచే ఉందని ఏడో శతాబ్దం నాటి శాసనాలవల్ల తెలుస్తోంది. ఈ లిపిలో 33 హల్లులు, 24 ఆధారిత అచ్చులు, 14 స్వతంత్ర అచ్చులున్నాయని టామ్ చెప్పాడు. కాలక్రమాన భాష కొంత మార్పుచెంది 19 వ. శ నుంచి ఇప్పటిదాకా ఉనికిలో ఉంది. 88% ప్రజలు ఇదే భాష మాట్లాడుతారు. ఫ్రెంచి వలస కాలం, రాజకీయ అశాంతి వల్ల పట్టణ ప్రాంతాల్లో ఉండే చదువుకున్న వాళ్ళు ఫ్రెంచ్, ఇంగ్లీషు నేర్చుకున్నారు. 95% ప్రజలు థేరవాద బౌద్ధాన్ని ఆచరిస్తారు. ‘ థేరవాద ‘ అంటే పెద్దల మార్గం అని అర్థం. అది కేవలం మతం కాదు. జీవన విధానం. నమస్కరించే పద్ధతిలో తేడాలుంటాయి. మానవ శరీరంలోని తలభాగం పవిత్రమైంది. అందుకే రెండుచేతులు హృదయానికి దగ్గరగా జోడించి తలవంచి పెద్దవాళ్ళకు, అతిథులకు నమస్కరిస్తారు.
అందమైన పరిసరాలలో కబుర్లతో ఆరుగంటల ప్రయాణం అతితొందరగా అయిపోయినట్లు అనిపించింది. సీరం రీప్ హోటల్ లో గైడ్ ఫెంగ్ మాకు స్వాగతం చెప్పాడు. మిగతా మూడు రోజులు ఆయనే మా గైడ్. “గంట విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం సూర్యాస్తమయం చూడడానికి వెళదాం.” అని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నట్లుగానే ఫెంగ్ సాయంత్రం ఐదుగంటలకల్లో వచ్చాడు. రాధ అలసటగా వుంది రానని చెప్పింది. మేం ముగ్గురం టోన్లే సాప్ లేక్ సందర్శనకు వెళ్ళాం. బోటులో గంట ప్రయాణం. ప్రవేశ రుసుం ఒక్కరికి 30 అమెరికా డాలర్లు. అది కంబోడియాలో అతిపెద్ద మంచి నీటి సరస్సు. ఖ్మేర్ భాషలో ‘ టోన్లే ‘ అంటే నది, ‘ సాప్ ‘ అంటే పెద్దది అని అర్థం. వీటితో పాటు ‘ ఫెంగ్ ‘ అంటే న్యాయమని తన పేరుకు కూడా అర్థం చెప్పాడు గైడ్. పడవ ప్రయాణం. ఆహ్లాదకరమైన సాయంకాలం. నీళ్ళపై తేలుతున్న యిళ్ళు వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. వెయ్యి పైనే ఉంటాయని చెప్పాడు ఫెoగ్. నీటిమట్టం పెరిగినప్పుడు బొంగు కర్రలతో ఇళ్ళను పైకి లేపుతారు. చేపలు పట్టడం వాళ్ళ ప్రధాన వృత్తి. 300 రకాల చేపలు ఆ సరస్సులో లభిస్తాయిట. వియత్నాంలో కూడా ఇలాంటి ఫ్లోటింగ్ విలేజస్ చూసాను కానీ ఇంత దగ్గరగా, ఇంత ఎక్కువ సంఖ్యలో లేవు.
ఆగ్నేయాసియాలోనే అది అతిపెద్ద మంచినీటి సరస్సు. 1997 లో యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ గా దానిని గుర్తించింది. టోన్లో సాప్ ప్రపంచంలోనే ఏడాదికి రెండుసార్లు తన ప్రవాహ దిశను మార్చుకునే ఏకైక సరస్సు. అది అలా ప్రవహిస్తూ వెళ్ళి కెమాంగ్ నదిలో కలుస్తుంది. నీరు వెనక్కి తగ్గినప్పుడు సారవంతమైన ఆ బురద నేలలో వరి పండిస్తారట. ఫెంగ్ వివరిస్తున్న ఈ వివరాలన్నీ వింటూ ఉండగానే ఆకాశాన అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యం ఆవిష్కృతమైంది. అది చూస్తూ నీటిమీద తేలే షాపింగ్ మాల్ దగ్గర మా పడవ ఆగిపోయింది. అక్కడ కాసేపు గడిపి తిరిగి హోటలుకు చేరుకున్నాం.





