- సహజ వనరుల దోపిడీని అడ్డుకున్నందుకే మావోయిస్టులు, గిరిజనుల హత్యలు
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ ముట్టడి, అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ (Operation Kagar) ను ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు.ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్ భవన్ కు ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను అడ్డుకుని, పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. తోపులాటలో పలువురు నేతలకు గాయాలు అయ్యాయి. అరెస్ట్ చేసిన నేతలను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు…..
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ దండకారణ్యం తుపాకుల గర్జనతో దద్దరిల్లుతున్నదని, మావోయిస్టులతో పాటు గిరిజనుల నెత్తురు ఏరులై పారుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరు నెలలుగా ఏకధాటిగా కొనసాగుతున్న కూంబింగ్ ఆదివాసీ గూడాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదని, చిన్న అలికిడి జరిగినా, బూట్లచప్పుడు వినిపించినా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొందని. ‘మావోయిస్టు రహిత భారత్’ కోసమంటూ చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ నిజంగా నక్సల్స్ను నిర్మూ లించడం కోసమేనా? అదే నిజమైతే ఆదివాసులను అడవుల నుంచి తరిమేయడం దేనికి? యథేచ్ఛగా మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ చేస్తున్న ఈ మారణ హోమం వెనుక ఉన్న ఉద్దేశమేంటి? ప్రజల్లో ఉద్భవిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర సర్కార్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎందుకంటే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి ప్రభుత్వాలెన్నో మారినా మునుపెన్నడూ లేని విధంగా దేశంలో రాజ్యహింస పెచ్చరిల్లిందని, దీనికి కారణాలేంటని లోతుగా పరిశీలిస్తే, అడవుల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న ఖనిజ నిక్షేపాలు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు అప్పనంగా అటవీ సంపదను దోచి పెట్టేందుకే ఈ నరమేధం. ‘ఖనిజ’ వేట అందులో భాగమేనని వారు ఉద్ఘటించారు.
ఛత్తీస్ గడ్ లో బొగ్గు, ఇనుము, సున్నపు రాయి, డోలమైట్, బాక్సైట్ నిక్షేపాలకు ప్రసిద్ధి. దేశంలో టిన్ ఖనిజాన్ని ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఇదేనన్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదపై దేశ బడా కార్పొరేట్ల కన్నుపడిందని, అత్యున్నత స్థాయి గ్రేడ్ ఇనుప ఖనిజం (హెమటైట్) ను వారికి కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం కూడా చేసుకుందని వారు తెలిపారు. ఈఏడాది జనవరిలో ఏడువేల ఎకరాల్లో నాలుగు పదమూడవ ఖనిజ బ్లాకుల వేలానికి సిద్ధమైందని, అయితే ఈ ఖనిజ తవ్వకాలతో ఎక్కువ నష్టం జరిగేది అక్కడ నివసించే ఆదివాసులకేనన్నారు. అడవివి, వారిని విడదీసి చూడలేమని,ఈ తెగలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు సర్కార్లు చేయని కుట్రలేదన్నారు.
ఆపరేషన్ కగార్ అంశాన్ని దేశంలోని పౌరులు నిశితంగా అధ్యయనం చేయాలని తెర వెనుక జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని, దేశ సంపద ప్రజలందరికీ చెందాలే తప్ప బడా పెట్టుబడిదారీ కార్పొరేట్ లకు కాదని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 జీవించే హక్కును కాలరాస్తున్న నరేంద్రమోదీ విధానాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని వారు తెలిపారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బిజ్జ శ్రీనివాసులు, టి. సత్య ప్రసాద్, పేరబోయిన మహేందర్, శ్రీమాన్,చేపూరి కొండల్, రాష్ట్ర సమితి సభ్యులు ఆర్. బాలక్రిష్ణ, చిలుక రాజ్ శ్రీను, సల్మాన్ బేగ్, శివ కుమార్, మహమూద్, మాజీద్, కొండూరి వెంకటేష్, అశోక్, బిచ్చల శ్రీనివాస్,హేమంత్, నయీమ్, అశోక్,వెంకటేష్, సురేష్, మధు, మధుకర్,శోభన్, వీరన్న, వెంకట్, రజనీకాంత్, నాగేశ్వరరావు, సంజయ్,వర్మ, గణేష్ లతో పాటు 30మంది పాల్గొన్నారు.