రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: పదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్ బీసీలను పట్టించుకున్న పాపానపోలేదని, ఇపుడు బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మార్గదర్శకంలో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ బిల్లు చేసుకుని గవర్నర్‌కు పంపిందన్నారు. బీఆర్‌ఎస్ హయంలో బలహీన వర్గాల తరఫున గొంతెత్తి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది ఉండేదా అని కవితను సూటిగా ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య అంటే గౌరవం ఉందన్నారు. దిల్లీ వస్తాం..మీరు ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి..అందరం కలిసి వెళదాం.. మీ తమ్ముడిగా రిక్వెస్ట్ చేస్తున్నా అని కృష్ణయ్యనుద్దేశించి మంత్రి అన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా బీసీ విజన్ గురించి బల్ల గుద్ది చెబుతున్నారన్నారు. బీసీల విషయంలో సీఎం రేవంత్, టీపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నుంచి క్యాబినెట్ వరకు క్లియర్ కట్‌గా ఉన్నామన్నారు. కేసీఆర్ కావొచ్చు, ఆయన చుట్టూ ఉన్న వారివెరైనా సరే బీసీల కోసం మాతో కలిసి రండి అని మంత్రి పిలుపునిచ్చారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. బలహీనవర్గాలను పట్టించుకోని కవితతో కూర్చొని మద్దతు గురించి కృష్ణయ్య మాట్లాడటం సమంజసం కాదన్నారు. బీసీ బిల్లుకి రాజకీయ రంగు పులమడం సబబు కాదని మంత్రి వారికి హితవు పలికారు. తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నారన్నది క్లియర్ అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.