పీఠికల కూర్పు ‘అంతరంగం’ తో పాఠకుల హృది తట్టిన తెలుగు సాహితీ విమర్శనాత్మకాచార్య కోవెల సుప్రసన్నాచార్య
శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారి పేరు మొదట నాకు తెలిసింది 1963 లో. వారి గురించి యం ఎస్ ఆచార్య గారి ‘జనధర్మ’ వారపత్రికలో ఏదో సందర్భంలో పేర్కొన్న వ్యాసం నేను చదవడం జరిగింది. మరు సంవత్సరం వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో 1964-65 లో నేను పీయూసీ చదివేటప్పుడు వారు మాకు తెలుగు సబ్జెక్టు బోధించిన గురువు గారిగా మొదటి సారిగా 1964 జూలైలో క్లాస్ రూంలో ప్రత్యక్ష దర్శనమిచ్చారు. ఆరోజుల్లోనే కోవెల సంపత్కుమారాచార్య గారి పేరు విన్నాను. చాలాకాలం శ్రీ సంపత్కుమారాచార్య గారి తమ్ముడు శ్రీ సుప్రసన్నాచార్య గారని అనుకునేవాణ్ణి. తర్వాత తెలిసింది సంపత్కుమార్ గారు సుప్రసన్నగారి పినతండ్రి అని. ఏది ఏమైనా ఇద్దరూ వరంగల్ గర్వించదగ్గ అసమాన సాహితీ దురంధరులు, మహాకవులు. ఇద్దరు సోదరుల వలె మెలిగారు. జంట రచయితల వలె కొంత కాలం కలిసి రచనా వ్యాసంగం చేసారు. 1967-68 లో ఆవిర్భవించిన ‘చేతనావర్త’ కవులలో ఈ ఇద్దరు ప్రధాన పాత్ర వహించారు.
తర్వాత నేను 1969 లో ఉద్యోగ రీత్యా వరంగల్ వదిలి హైదరాబాద్ చేరడం వల్ల వరంగల్ సాహితీ మూర్తుల వివరాలు తెలియక పోయేవి. అయితే సుప్రసన్న గారు 1982 లో పోతన పంచశతి జయంతి ఉత్సవాల రూపకర్త అనీ, 1986 ‘విద్యారణ గోష్ఠి’ రూపకల్పనలో ముఖ్య భూమిక నిర్వహించారనీ తెలిసింది. ఆరు నెలల క్రితం గూగుల్ సెర్చ్ లో గార్లపాటి రాఘవరెడ్డి గారి గురించి క్రొత్త వివరాలు దొరకక, నిరాశతో ఒకసారి కోవెల సుప్రసన్న గారేమైనా గార్లపాటి గారి గురించి ఏమైనా తెలుపుతారా అనుకుంటూ కోవెల సుప్రసన్నాచార్య పేరుతో సెర్చ్ చేస్తే అమోఘ రత్నం లభ్యమైంది. అది సుప్రసన్నాచార్య గారి ‘సాహిత్య జీవన యాత్ర’. జనవరి, 2014 లో ‘సారంగ’ బ్లాగులో “అక్షరాల వెనుక తత్వ దీపం వెలిగితేనే దారి తేటపడుతుంది: సుప్రసన్న” శీర్షికన వచ్చింది. అందులో వరంగల్ సాహిత్య , రాజకీయ అలనాటి అనుభవాల పూర్తి వివరణలతో బాటు గార్లపాటి గారి గురించి కూడా ఉండటం నాకెంతో ఆనందాన్నిచ్చింది. సుప్రసన్న గారి జనన కాలం నుండి అలనాటి రజాకార్ దుండగుల దుశ్చర్యల కాలంలో, పిదప హైదరాబాద్ రాష్ట్ర భారత విలీనం తదుపరి సాగిన ఆయన వివిధ రకాల చదువు సంఘటనలు, తదుపరి ఉన్నత శిఖరాలకు చేరి విశ్వవిద్యాలయ అధ్యాపక స్థాయికి ఆయన ఎదిగిన తీరు ఆశ్చర్య సంభ్రమాలకు గురి చేస్తుంది. అనేక సాహిత్య సభలు నిర్వహించిన ఆ సాహితీమూర్తికి నా కౌమారదశ లో విద్యార్థిగా వుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. గురువు సుప్రసన్నగారికి పాదాభివందనం చేస్తూ, వారి జీవన యాత్ర ను మీరు కూడ పంచుకోవాలని బ్లాగ్ వివరాలు తెలియజేస్తున్నాము.
సుప్రసన్న గారు తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిలో సిద్ధహస్తుడైన గొప్ప రచయిత. ఆయన కలం వివిధ రచనా ప్రక్రియల షడ్రుచులుక్షుణ్ణంగా తెలిసిన ఒక గొప్ప జిహ్వ. పద్యం, వచనం, కావ్యం, కథనం, గేయం, నాటక రచన ఇవన్నీ ఆ కలానికి పూర్తిగా అవగతం. ఆయన గొప్ప సాహిత్య విమర్శకుడు. ఏ రచన ఐనా, ఏ రచయిత ఐనా ఆయన చేసిన విమర్శనా ప్రక్రియలో కొత్తదనం పొంది మరింత ప్రకాశవంతం కావటం జరుగుతుంది. సాధారణంగా ఆయన మితభాషి. మృదు స్వభావి. కాని తరగతి గదిలో ఐనా, సాహిత్య వేదిక పైన ఐనా ఆయన భాషణా పటిమ ఎటువంటి హద్దులు లేని విషయ పరిజ్ఞాన ప్రదాతం.
సాహిత్యాన్ని తన జీవన సాఫల్యతోద్ధరణగా భావించి నిరంతర సాహిత్యాధ్యయనంలో గడచిన డెబ్బై సంవత్సరాలు ఆయన గావించిన సాహిత్యానుభవం విలక్షణమైన ఆదర్శ జీవితానుభవం. ఆయనకు ప్రశంసలపై ప్రచారంపై మమకారం లేదు. తన అభిప్రాయాల్ని ప్రీతీ భీతీ లేకుండా మృదుమధురంగా చెప్పడం సుప్రసన్న గారి స్వభావం.
సుప్రసన్న గారు 1954 నుండే అనేక సాహితీసంస్థలను స్థాపించి వాటికి అధ్యక్షుడిగా ఉన్నారు. ‘సాహితీ బంధు’, ‘మిత్రమండలి’ ‘రసధుని’, ‘ ‘కులపతి సమితి’ అనే సంస్థలను స్థాపించారు. జాతీయ సాహిత్య పరిషత్తులో జీవిత సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యుడిగా, ‘పోతన విజ్ఞాన సమితి’ కార్యదర్శిగా చేశారు. ఆయన రచనలు అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. మిగతా సాహితీ ప్రముఖుల్లో లేని ‘అవధాన’ ప్రక్రియలో కూడా వీరికి అనుభవం వుంది. దాదాపు 70 అవధానాలు చేశారు. మొదటిసారి 1973 లో జరిగిన అవధాన కార్యక్రమ సభ ప్రేక్షకులలో శ్రీ పీ వీ నరసింహారావుగారు కూడా చివరి వరకు కూర్చొని సుప్రసన్న గారిని అభినందిస్తూ ‘ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి?’ అని చనువుగా పలకరించారని తెలిసింది. సుప్రసన్న గారు అనేక సార్లు అరవిందాశ్రమం దర్శించుకున్నారు. వారి పై అరవిందుల, రమణ మహర్షుల చింతన ప్రభావం వుంది.
వీరికి జరిగిన సన్మానాలు, వచ్చిన అవార్డులు అనేకం. 1955 లోనే తెలంగాణ లిటరసీ ఫోరం ఉత్తమ కవితా పురస్కారం తో సాగిన ఈ అవార్డుల పరంపరలో ముఖ్యమైన వాటిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు(1971), ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (1987), ఉత్తమ పరిశోధన పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం (1997), ఆంధ్ర సారస్వత సమితి ఉత్తమ కవితా పురస్కారం (2002), తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శా పురస్కారం (2001), కేంద్ర సాహిత్య అకాడెమీ ‘టాగూరు సాహిత్య పురస్కారం’ (2010) – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘హంస (కళారత్న)’ పురస్కారం (2013), తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం (2016).
గొప్పవిశేషం ఏమిటంటే ఆయన రాసిన వివిధ పీఠికల కూర్పుతో ‘అంతరంగం’ అనే పుస్తకం గా ప్రచురించారు. ఈ పీఠికలు ఆయా రచన/ రచయిత లను ప్రశంసించడం కంటే ఆ రచన చుట్టూ ఉన్న విషయానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన పాఠకుడి జ్ఞానం మరింత విస్తృతమై
సుప్రసన్నగారి విస్తృత విషయ పరిజ్ఞానం పాఠకుడిని మైమరపిస్తుంది. అటువంటి పీఠికల కూర్పు ‘అంతరంగం’ కు టాగూర్ సాహిత్య అవార్డు రావడం గొప్ప విశేషం. ఆయన ప్రధాన భావ సంపుటి ఆధ్యాత్మిక మైనా, ఆధునిక సామ్యవాద భావజాల రచనలు కూడ చేశారు. విశ్వనాథ వారి రచనల పై ఎన్నో సిద్ధాంత గ్రంథాలను రాసిన ఆయనే చలం రచనల పై గూడా సమగ్ర వ్యాసాలు రాశారు. ఇటువంటి వైవిధ్యభరిత జ్ఞాన సంపదను కలిగి ఉండటం సాహిత్య రంగంలో అరుదు. అందుకే ఆయన తెలుగు సాహితీ రంగంలో రచనా సవ్యసాచి.
ఆయన పంచెకట్టులో ఎంత నిండుగా వుంటారో, ఆయన సాధారణ వస్త్ర సంప్రదాయ పేంట్, బుష్ షర్ట్ ధరించినపుడు కూడా అంతే హుందాగా తెలుగదనం కనబడుతుంది. అందుకే ఆయనలో, ఆయన రచనల్లో అర్థం లేని ఛాందస వాదం లేదా అర్థం కాని ఆధునికత కనపడక అందరికీ అర్థమయ్యే మానవతా వాదం కనబడుతుంది. ఆయన 60 ఏండ్ల క్రితం మాకు తరగతి గదిలో బోధించిన ‘మను చరిత్ర’ పాఠంలోని ‘ఆ పురి బాయకుండు’ పద్యంలోని అరుణాస్పద పుర ప్రవరుని లాగా వరంగల్ వదలని ‘భాషాపర శేష భోగి’. విలక్షణ జీవన విధానం కలిగిన ‘నిర్మల ధర్మ కర్మ దీక్షా పర తంత్రుడు’. ఇంకా రచనా ప్రక్రియ లో ‘అనారతా ధ్యాపన తత్పరుడు’.
శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు