సౌదీలో ప్రమాదం.. శాశ్వత వికలాంగురాలైన నర్సు

– కూతురిని కాపాడాలని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన తల్లి
– రూ.38 లక్షల బ్యాంకు రుణం కారణంగా ‘ట్రావెల్ బ్యాన్’
– రోగిని సౌదీ నుంచి స్వదేశానికి రప్పించి వైద్యం అందించాలి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 3: ఎందరో రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కాపాడిన ఓ నర్సు నేడు తన ప్రాణాల కోసం, స్వదేశానికి చేరుకోవడానికి పోరాడుతోంది. ఒకప్పుడు ఐసీయూలో రోగులను ఆదుకున్న ఆమె ఇప్పుడు మంచానికే పరిమితమై, ఇతరుల సహాయంపై ఆధారపడి జీవిస్తోంది. సౌదీ అరేబియాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఊర్తి కమ్మపాడు గ్రామానికి చెందిన గిరిజన యువతి గుగులోతు సునీత, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలనే లక్ష్యంతో 2024 సెప్టెంబర్ 7న సౌదీ అరేబియాకు వెళ్లారు. కింగ్ అబ్దుల్లా హాస్పిటల్, అసీర్ క్లస్టర్‌లో ఇంటెన్సివ్ కేర్ నర్స్ స్పెషలిస్టుగా సేవలందిస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. అయితే 2025 ఏప్రిల్ 23న జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రెండు చేతులు, వెన్నెముక, తలకు తీవ్ర గాయాలవడంతో పలు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. శరీరంలో మెటల్ ప్లేట్లు అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం వైద్య కమిటీ ఆమెకు 87 శాతం శాశ్వత వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి విధులకు అనర్హురాలిగా ప్రకటించింది. దీంతో ఉద్యోగం కూడా కోల్పోయారు. ప్రమాదానికి ముందు కుటుంబ అవసరాల కోసం సౌదీలోని అల్ రాజ్హీ బ్యాంక్ నుంచి 1,48,000 సౌదీ రియాల్స్ (సుమారు రూ.38 లక్షలు) రుణం తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని వైద్య పత్రాలు బ్యాంకుకు సమర్పించినప్పటికీ రుణ వ్యవహారం పరిష్కారం కాకపోవడంతో ఆమెపై ‘ట్రావెల్ బ్యాన్’ విధించారు. దీంతో చికిత్స కోసం స్వదేశానికి రావాల్సిన అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ భారత్‌కు తిరిగి వచ్చే మార్గమూ మూసుకుపోయింది. వైద్య చికిత్స, న్యాయపరమైన ఖర్చులు, నివాస వ్యయాలు భరించే స్థోమత లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సునీత తల్లి గుగులోతు పరెంగి ‘నా కూతురు ఎంతో మందికి ప్రాణాలు పోసింది.. ఇప్పుడు ఆమెను కాపాడండి’ అంటూ కన్నీరుమున్నీరై సీఎం ప్రవాసీ ప్రజావాణి ద్వారా గ‌త నెల 31న వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి సునీత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన మార్గదర్శనం చేశారు. ప్రజావాణి హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వలంటీర్ గంగుల మురళీధర్ రెడ్డి వినతిపత్రం తయారీలో సహకరించారు. సునీత హృదయవిదారక పరిస్థితి గురించి తెలుసుకున్న ‘సీఎం ప్రజావాణి’ ఇంచార్జి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ డా. జి. చిన్నారెడ్డి వెంటనే స్పందించారు. సునీతను అత్యవసరంగా స్వదేశానికి రప్పించి వైద్య సహాయం అందించే అంశంపై సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రికి వినతిపత్రాన్ని ఎండార్స్ చేశారు.

కుటుంబ భారం మోసిన సునీత

కుటుంబానికి ప్రధాన ఆసరాగా నిలిచిన ఆమె, తన తల్లి గుండె శస్త్రచికిత్స, తండ్రి మెదడు శస్త్రచికిత్స ఖర్చులతోపాటు ముగ్గురు సోదరీమణుల చదువులు, వివాహాలు, ప్రసూతి ఖర్చులు భరించారు. 2011లో అన్న మరణించడంతో అతని ఇద్దరు చిన్నారుల బాధ్యతను కూడా తన భుజాలపై వేసుకున్నారు. కుటుంబం దారిద్య్ర‌ రేఖకు దిగువ (బీపీఎల్) వర్గానికి చెందడం వల్ల ప్రస్తుతం వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఈ సమస్య పరిష్కారం కోసం సునీత ఇప్పటికే రియాద్‌ లోని ఇండియన్ ఎంబసీకి, జిద్దాలోని ఇండియన్ కాన్సులేట్‌ లకు ఈ-మెయిల్లు పంపినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించలేదని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్’ ద్వారా అత్యవసర ఆర్థిక, న్యాయ సహాయం అందించి, బ్యాంకు రుణ సమస్యను పరిష్కరించి, ‘ట్రావెల్ బ్యాన్’ ఎత్తివేసేలా చర్యలు తీసుకుని, సునీతను సురక్షితంగా రప్పించి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి లను కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *