“రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం బేఖాతరు చేస్తూ సాగుతున్న తీరు అత్యంత ఆందోళనకరం. గార్ల మండలం పూర్తిగా ఐదవ షెడ్యూల్డ్ ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది. పీసా చట్టం ప్రకారం ఇక్కడ ఎలాంటి భూసేకరణ లేదా ప్రాజెక్టు చేపట్టాలన్నా స్థానిక ‘గ్రామసభ’ తీర్మానం, ఆమోదం తప్పనిసరి. కానీ ఏ ఒక్క గ్రామసభ అనుమతి తీసుకోకుండా చట్టాలను తుంగలో తొక్కారు..”

న్యాయవాది
రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
మొబైల్ నెంబర్: 7793968907)
“నది కేవలం ప్రవహించే నీరు కాదు… అది ఒక సంస్కృతి, ఒక జీవనాడి. నదిని మళ్లించడం అంటే ఆ నేల తల్లి గర్భాన్ని కోసి, అక్కడి బిడ్డల నోటి ముద్దను లాక్కోవడమే.” ఏజెన్సీ ప్రాంతమైన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసాలకు, స్థానిక ప్రజల హక్కుల కాలరాస్తున్నదానికి సజీవ సాక్ష్యంగా మారుతోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే నినాదం ఏ ఆకాంక్షలతోనైతే పుట్టిందో, నేడు అదే తెలంగాణ గడ్డపై ఒక స్థానిక ప్రాంతం తన ఉనికిని, తన నీటి హక్కును కాపాడుకోవడానికి మళ్లీ పోరాడాల్సి రావడం చారిత్రక వైపరీత్యం. గార్ల మండల పరిధిలో ప్రతిపాదించిన “మున్నేరు – పాలేరు లింక్ కెనాల్” (జీవో నెం. 98) ప్రాజెక్టు పర్యావరణ, సామాజిక, చట్టపరమైన విధ్వంసానికి దారితీస్తుంది.
త్యాగం ఒకరిది–భోగం మరొకరిది
మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలంలోని ముల్కనూరు – దుబ్బగూడెం గ్రామాల మధ్య ఉన్న మున్నేరు నది చెక్‌డ్యామ్ నుండి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు తలపెట్టిన 9.6 కిలోమీటర్ల కాలువ వల్ల స్థానిక గార్ల మండలానికి గానీ, మహబూబాబాద్ జిల్లాకు గానీ పైసా ప్రయోజనం లేదు. ఈ ప్రాజెక్టు ఏకపక్ష దోపిడీకి నిదర్శనంగా మారింది. ఇక్కడి భూములు కోల్పోయేది స్థానిక రైతులు, కానీ లబ్ధి పొందేది మాత్రం ఎక్కడో ఉన్న అపరిచిత శక్తులు. స్థానికంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించని ఈ ప్రాజెక్టు, ఉన్న వనరులను కూడా హరించివేసే వ్యూహాత్మక దోపిడీ మాత్రమే. దీనివల్ల మున్నేరు ఆయకట్టు ప్రాంతం ఎడారిగా మారనుంది. ప్రకృతిని శాసిస్తామనే మానవ అహంకారానికి ఈ కాలువ తవ్వకం ఒక ఉదాహరణ.
ప్రకృతిపై గొడ్డలిపెట్టు
ఈ ప్రాజెక్టు వల్ల జరిగే పర్యావరణ నష్టం పూడ్చలేనిది. మున్నేరు నది సహజ ప్రవాహాన్ని అడ్డుకుని నీటిని మళ్లించడం వల్ల చుట్టు పక్కల మైళ్ల విస్తీర్ణంలో వాటర్ టేబుల్ దారుణంగా పడిపోతుంది. భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోర్లు ఎండిపోయి హరిత క్షేత్రాలు కాస్తా ఎడారిగా మారే ప్రమాదం ఉంది.
గిరిజన అస్తిత్వంపై దాడి
“అడవి, నది, భూమి… ఇవి ఆదివాసీకి ఆస్తులు కావు, వారి అస్తిత్వపు ఆనవాళ్లు.” గార్ల మండలం విశిష్టమైన గిరిజన సంస్కృతికి, తండాల సాంప్రదాయాలకు నిలయం. ప్రకృతిని దైవంగా పూజించే ఈ బిడ్డల పవిత్ర స్థలాలు, సాంప్రదాయ సరిహద్దులు ఈ కాలువ కింద సమాధి కానున్నాయి. తరతరాలుగా కలిసిమెలిసి జీవిస్తున్న గిరిజన పల్లెలను ముక్కలు చేస్తూ, సామాజిక బంధాలను తెంచివేస్తూ తెస్తున్న ఈ ప్రాజెక్టు కేవలం కాంక్రీట్ కట్టడం కాదు, ఒక సంస్కృతిని నిర్మూలించే ప్రయత్నం. గార్ల మండలం ప్రాథమికంగా వ్యవసాయ, పశుపోషణ ఆధారిత ఆర్థిక వ్యవస్థపై నడుస్తోంది. కాలువ కారణంగా భూములు కోల్పోవడం వల్ల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఒక్కసారిగా రోడ్డున పడతారు. ఇది బలవంతపు వలసలకు దారితీస్తుంది. ఉపాధి కోల్పోయిన స్థానిక యువత పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడి, పచ్చని పల్లెలు ముసలి వారితో, బోసి పోయిన ఇళ్లతో కళా విహీనంగా మారే ప్రమాదం పొంచి ఉంది.
ఖాకీ నీడలో సర్వేలు
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం బేఖాతరు చేస్తూ సాగుతున్న తీరు అత్యంత ఆందోళనకరం. గార్ల మండలం పూర్తిగా ఐదవ షెడ్యూల్డ్ ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది. పీసా చట్టం ప్రకారం ఇక్కడ ఎలాంటి భూసేకరణ లేదా ప్రాజెక్టు చేపట్టాలన్నా స్థానిక ‘గ్రామసభ’ తీర్మానం, ఆమోదం తప్పనిసరి. కానీ ఏ ఒక్క గ్రామసభ అనుమతి తీసుకోకుండా చట్టాలను తుంగలో తొక్కారు. పీసా మరియు 1/70 చట్టాల ధిక్కరణకు ప్రభుత్వమే పాల్పడుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ప్రక్రియను పక్కనబెట్టి, భారీ పోలీసు బలగాల పహారాలో, తుపాకుల నీడలో సర్వేలు నిర్వహించడం స్థానిక ప్రజలను, ముఖ్యంగా మహిళలను తీవ్ర మానసిక భయాందోళనలకు గురిచేస్తోంది. ఇది క్షేత్రస్థాయిలో సైకలాజికల్ టెర్రర్ ను తలపిస్తుంది.
బడ్జెట్ మాయాజాలం
ఈ ప్రాజెక్టు వెనుక ప్రజా శ్రేయస్సు కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ఎక్కువున్నాయనడానికి బడ్జెట్ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. బడ్జెట్ వివరాలు ప్రారంభపు అంచనా బడ్జెట్ (జీవో నాటికి) 162 కోట్లు, ప్రస్తుతం సవరించిన బడ్జెట్ 204 కోట్లు, అదనంగా పెరిగిన నిధులు 42 కోట్లు. స్థానిక ప్రజలకు ఎలాంటి మేలు చేయని కాలువ కోసం, అసలు పని ప్రారంభించక ముందే బడ్జెట్‌ను ఏకంగా రూ. 42 కోట్లు పెంచడం వెనుక ఏ రకమైన శక్తులు పని చేస్తున్నాయో సామాన్యుడికి సైతం అర్థమవుతోంది. ఇది ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేసే అవినీతి అస్త్రం కాక మరేమిటి?
డిజిటల్ ప్రజా బ్యాలెట్
ప్రభుత్వాలు, అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలను దాచాలని చూసినా, అంతర్జాతీయ ఆన్‌లైన్ ప్రజా బ్యాలెట్ ద్వారా వ్యక్తమైన ప్రజా తీర్పు కళ్లు తెరిపించేలా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి మే15 వరకు వరకు జరిగిన డిజిటల్ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ సర్వేలో మొత్తం 651 ఓట్లు నమోదు కాగా, 620 (95.24%) మంది లింక్ కెనాల్ రద్దుకే (ఎస్) మద్దతు పలికారు. కేవలం 31మంది (4.76%) మంది మాత్రమే రద్దు అవసరం లేదు (నో) అన్నారు. ఇది కేవలం కొద్దిమంది వ్యక్తుల నిరసన కాదు, యావత్ మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజా సమూహపు ముక్తకంఠ గర్జన! అని ఈ సర్వే ఫలితం స్పష్టం చేస్తోంది.
మున్నేరు రిజర్వాయర్ కావాలి
“ప్రజాభిప్రాయాన్ని గౌరవించని ఏ అభివృద్ధీ నిలబడదు. విధ్వంసాన్ని అభివృద్ధిగా భ్రమపడే రోజులు పోయాయి.” ఈ ప్రాజెక్టు వల్ల గార్ల మండలానికి వచ్చే లాభం ‘సున్నా’, కానీ జరిగే నష్టం ‘అనంతం’. పర్యావరణం, సంస్కృతి, జీవనోపాధిని సమాధి చేసే ఈ జీవో నెం.98 ని తక్షణమే రద్దు చేయాలి. బలవంతపు పోలీసు సర్వేలను ఆపాలి. దోపిడీ కాలువల ద్వారా నీటిని తరలించే కుట్రలను విరమించుకుని, స్థానిక 60 వేల ఎకరాల మున్నేరు పరివాహక ప్రాంత ఆయకట్టు సాగు కోసం ముల్కనూరు వద్దే “మున్నేరు రిజర్వాయర్” నిర్మించాలి. అప్పుడే ఇక్కడి గిరిజన, గిరిజనేతర రైతాంగానికి నిజమైన న్యాయం జరుగుతుంది. నేల తల్లిని, నమ్ముకున్న నదిని కాపాడుకోవడానికి సాగుతున్న ఈ జల దీక్ష.. న్యాయం సిద్ధించే వరకు విశ్రమించదు!





