“మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష భావజాలాన్ని విస్తరింప జేయడంలో తన వంతు పాత్ర పోషించిన ” ప్రజాతంత్ర’ పత్రిక నిర్వాహకునిగా ఆ విగ్రహం ముందు నిలబడినప్పుడు సహజంగానే మన దేశ,రాష్ట్ర పరిస్థితులు గుర్తుకు వొస్తాయి. మన దగ్గర కూడా పత్రికా స్వేచ్ఛ, పౌరహక్కులు, మానవ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలు నిరంతరం పరీక్షకు లోనవుతూనే ఉన్నాయి. ఈ సమయంలో డైసీ బేట్స్ జీవితం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది..”
వాషింగ్టన్ డి.సి. అమెరికా క్యాపిటల్ భవనంలో డైసీ లీ గాట్సన్ బేట్స్ విగ్రహం ముందు ఆగస్ట్ 31 మధ్యాహ్నం 2 గం లకు నిలబడిన క్షణం, అది ఒక సాధారణ పర్యాటక అనుభవం మాత్రమే కాదు. జర్నలిజం, పౌరహక్కులు, సామాజిక న్యాయం—ఈ మూడు విలువలు ఒకే వ్యక్తిత్వంలో ఎలా కలిసిపోతాయో గుర్తు చేసే చారిత్రక క్షణం.
డైసీ బేట్స్ (1914–1999) అమెరికా పౌరహక్కుల ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన పేరు. ఆమె ఉద్యమకారిణి మాత్రమే కాదు; జర్నలిస్ట్, రచయిత్రి, పత్రికా ప్రచురణకర్త, NAACP నాయకురాలు. ముఖ్యంగా నల్లజాతీయ పిల్లలకు సమాన విద్యా హక్కు కల్పించేందుకు సాగిన పోరాటంలో ఆమె పాత్ర అత్యంత కీలకం.
డైసీ బేట్స్ చిన్ననాటి నుంచే జాతి వివక్ష క్రూర వాస్తవాన్ని అనుభవించింది. ఆ బాధనే ఆమె సామాజిక పోరాట శక్తిగా మార్చుకుంది. తన భర్త ఎల్.సి. బేట్స్‌తో కలిసి 1941లో Arkansas State Press అనే వారపత్రికను ప్రారంభించింది. ఆ కాలంలో నల్లజాతీయులపై వివక్ష, పోలీసు దౌర్జన్యాలు, అసమాన న్యాయం వంటి అంశాలను ధైర్యంగా వెలుగులోకి తీసుకువొచ్చిన పత్రికగా అది గుర్తింపు పొందింది. డైసీ బేట్స్‌కు జర్నలిజం అంటే కేవలం వార్తలు ప్రచురించడం కాదు. అన్యాయాన్ని ప్రశ్నించడం, అణగారిన వర్గాలకు స్వరం ఇవ్వడం, అధికారాన్ని జవాబుదారీ చేయడం—అదే ఆమె పత్రికా తత్వం. 1954లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక Brown v. Board of Education తీర్పు ప్రభుత్వ పాఠశాలల్లో జాతి ఆధారిత వేర్పాటును రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. కానీ చట్టం మారినా సమాజం వెంటనే మారలేదు. దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో నల్లజాతీయ విద్యార్థులను శ్వేతజాతీయుల పాఠశాలల్లో చేర్చేందుకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
ఈ నేపథ్యంలో 1957లో ఆర్కాన్సాస్‌లోని లిటిల్ రాక్ నగరంలో తొమ్మిది మంది నల్లజాతీయ విద్యార్థులు Central High School లో చేరేందుకు ప్రయత్నించారు. వీరే చరిత్రలో ప్రసిద్ధి చెందిన “Little Rock Nine”.ఆ విద్యార్థుల వెనుక నిలిచిన ప్రధాన శక్తి డైసీ బేట్స్. ఆమె ఇల్లు ఉద్యమ కార్యాచరణ కేంద్రంగా మారింది. విద్యార్థులకు ధైర్యం చెప్పడం, వారి భద్రత కోసం ఏర్పాట్లు చేయడం, న్యాయపరమైన సహాయం సమన్వయం చేయడం, మీడియాతో సంబంధాలు నిర్వహించడం—ఇలా ఆమె పాత్ర నాయకురాలిగా, మార్గదర్శకురాలిగా విస్తరించింది.జాత్యహంకార గుంపుల బెదిరింపులు, ఇంటిపై దాడులు, ఆర్థిక ఒత్తిళ్లు—ఏవీ ఆమెను వెనక్కి తగ్గించలేకపోయాయి.
ఆఖరుకు పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ ఫెడరల్ సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి వొచ్చింది. సైనిక రక్షణ మధ్య Little Rock Nine విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించిన రోజు అమెరికా పౌరహక్కుల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.కానీ డైసీ బేట్స్ ఈ పోరాటానికి భారీ మూల్యం చెల్లించాల్సి వొచ్చింది. ఆమె పత్రికపై ప్రకటనల బహిష్కరణ జరిగింది. ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. చివరకు Arkansas State Press మూతపడాల్సి వొచ్చింది. అయినా ఆమె తన విలువలను విడిచిపెట్టలేదు.అది జర్నలిజం చరిత్రలో ఒక గొప్ప సందేశం: “పత్రికను నిలబెట్టడం కంటే సత్యాన్ని నిలబెట్టడం గొప్పది..”
తరువాత ఆమె తన అనుభవాలను “The Long Shadow of Little Rock” అనే గ్రంథంగా రాసింది. 1963లో జరిగిన చారిత్రక March on Washington పౌరహక్కుల ఉద్యమంలో కూడా ఆమెకు విశిష్ట స్థానం లభించింది. నేడు అమెరికా క్యాపిటల్‌లోని National Statuary Hallలో ఆమె విగ్రహం నిలబడటం ఒక వ్యక్తికి ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు. అది పౌరహక్కుల ఉద్యమానికి, సమాన విద్యా హక్కుకు, ధైర్యవంతమైన జర్నలిజానికి ఇచ్చిన గౌరవం. విగ్రహం పీఠంపై ఆమెను ఇలా పరిచయం చేస్తారు:“Civil Rights Leader – Journalist – Author – Publisher.”ఈ నాలుగు పదాలు ఒక జీవితాన్ని చెబుతాయి.
మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష భావజాలాన్ని విస్తరింప జేయడంలో తన వంతు పాత్ర పోషించిన ” ప్రజాతంత్ర’ పత్రిక నిర్వాహకునిగా ఆ విగ్రహం ముందు నిలబడినప్పుడు సహజంగానే మన దేశ,రాష్ట్ర పరిస్థితులు గుర్తుకు వొస్తాయి. మన దగ్గర కూడా పత్రికా స్వేచ్ఛ, పౌరహక్కులు, మానవ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలు నిరంతరం పరీక్షకు లోనవుతూనే ఉన్నాయి. ఈ సమయంలో డైసీ బేట్స్ జీవితం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. జర్నలిస్టు అధికారానికి సమీపంగా ఉండటం కన్నా ప్రజలకు సమీపంగా ఉండాలి. పత్రిక అధికార వర్గాల ప్రతిధ్వని కాకూడదు; స్వరం లేని వారి స్వరంగా నిలవాలి.
భయపడకుండా ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి అవసరం. డైసీ బేట్స్ విగ్రహం ముందు నిలబడ్డ ఈ చిత్రం అందుకే ఒక వ్యక్తిగత జ్ఞాపకం మాత్రమే కాదు. పత్రికా వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక స్ఫూర్తిదాయక గుర్తుచేసే చిత్రం. కాలం మారుతుంది. ప్రభుత్వాలు మారతాయి. సమాజాలు మారతాయి. కానీ సత్యం, సమానత్వం, పౌరహక్కులు, స్వేచ్ఛ కోసం నిలబడే జర్నలిజం విలువ మాత్రం ఎప్పటికీ మారదు. డైసీ బేట్స్ జీవితం మనకు అదే చెబుతోంది.
( రేపటి సంచికలో ..” నయాగరా” కూడా ఖబ్జా లకు గురైంది ..”)
-దేవులపల్లి అజయ్





