కాకతీయ కలగూర గంప – 13
ఒక సారి దక్షిణాది నుండి నాడీ జ్యోతిష్యం చెప్పే ఒక జ్యోతిష శాస్త్రవేత్త సికిందరాబాదుకు రావడం జరిగింది (ఇది1958 లో శ్రీ పీ వీ గారు ఎం. ఎల్. ఏ గా వున్నప్పుడు జరిగింది.). ఈయన స్పెషాలిటీ ఏమిటంటే తన దగ్గరకు వచ్చే జనాలను అనేక ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టి తన దగ్గర వున్న ఇండెక్సు పుస్తకం లోని ఒక పేజీని నిర్ణయించుకొని ఆ పేజీ ఆధారంగా నాడీ గ్రంధం లోని అసలు జాతక పత్రం తీస్తాడు. ఆ పత్రంలో తెలుప బడిన ఫలితాలను సవివరంగా ఆ వచ్చిన వ్యక్తికి తెలుపుతాడు. అవన్నీ సరిగ్గా సరిపోతాయి. మొత్తానికి ఈ పధ్ధతి క్లిక్ అయింది. జంటనగరాలలో ఆ రోజుల్లో ఈయన నాడీ జ్యోతిష్యం జనా లను విపరీ తంగా ఆకట్టు కుంది.
ఎక్కడ చూసినా ఈ నాడీ గ్రంథ చర్చలే, గుసగుసలే ! ఇక ఆ జ్యోతిష కార్యాలయం ముందు బారులు తీరిన క్యూలు. వచ్చిందెవరూ అల్లాటప్పాలు కాదండీ! బాగా చదువుకున్న వారే, మంచి డిగ్రీ తోకలు తగిలించుకున్నవారే! ఇక నాయకులు, ఆఫీసర్లు. లాయర్లు, వర్తకులైతే మరీ విరగబడ్డారు ఆయన అప్పాయింట్మెంట్ కొరకు. మన పీ వీ గారికి కూడా ఆ గుసగుసలు చేరాయి. ముందుగా అబ్బుర పడ్డారు. అంతటితో ఆగిపోతే ఆయన పీ వీ ఎందుకవుతారు? ఆలోచించి తాను కూడా ఆ జ్యోతిష్కుడితో తన జాతకం పేజీ వెదికించుకొని ఆ పేజీలోని వివరాలను తెలుసుకో దలచారు. ఈలోగా అనుకోకుండా వరంగల్ నుండి మిత్రుడు పాములపర్తి సదాశివరావు అనంతపూర్ పోతూ మధ్యలో ఆ రాత్రి హైదరాబాద్ లో ఆగవలసి వచ్చింది. మిత్రులిద్దరూ వివిధ విషయాలు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ జ్యోతిష్కుడి ప్రస్తావన వచ్చింది. ‘ఏముంది, అనేక డొంక తిరుగుడు ప్రశ్న ల నడిగి మన వివరాలను గుట్టుగా తెలుసుకొని మసి పూసిన మారేడు కాయ లాగా మన కందిస్తాడు’ అన్నాడు మిత్రుడు.
రెండు రోజుల తర్వాత 25 రూపాయలు చెల్లించి ఆ జ్యొతిష్కుడడిగిన వివరాలు చెప్పి తన ఇండెక్సు పేజీ తెరిపించుకున్నారు మన పీ వీ.
ఆ ఇండెక్సు పేజీ ఆధారంగా నాడీ గ్రంథంలో పీ వీ గారి జాతక చక్రం దొరకడమే కాకుండా అందులో చెప్పబడిన వివరాలు అంతకు ముందు పీ వీ గారి జీవితంలో జరిగిన సంఘటనలతో ఖచ్చితంగా సరిపోయాయి. ముందుగా ఆశ్చర్యపోయారు పీ వీ. ఆయన సునిశిత మేధస్సు పనిచేయడం మొదలుపెట్టింది. తనను వివరాలు అడిగినప్పుడు అ జ్యోతిష్కుడు ఇండెక్సు పేజీలను వెదికే క్రమాన్ని, ఆ సందర్భంలో వేసే ప్రశ్నల గురించీ, తాను చెప్పిన సమాధానాల గురించి అసలు కిటుకును తెలుసుకున్నారు.అంతటితో ఊరుకున్నారా మన పీ వీ! ఆ మాయల మారి టెక్నికును ఒక మిత్రుడి ద్వారా ‘‘గోల్కొండ పత్రిక’’ కెక్కించడం జరిగింది. ఇంకేం, ఆ రాతికి రాత్రే ఆ ‘‘జ్యోతిష రత్న’’ బిచాణా ఎత్తేయడం, ఆ కార్యాలయం మూతపడటం జరిగింది. పత్రికలో వివరాలు చదివిన జనాలు ఎంతో నవ్వుకున్నారని ప్రతీతి.-శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
-పాములపర్తి నిరంజన్ రావు





