బ్రిజ్‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌కు దిల్లీ కోర్టులో ఊరట

– మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో.. 
– ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన దిల్లీ కోర్టు

న్యూదిల్లీ,ఆగస్టు 3:  ‌మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్‌ ‌సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ‌మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌కు దిల్లీ కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు అదనపు ప్రధాన న్యాయమూర్తి అశ్విని పన్వార్‌ ‌సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో మరో నిందితుడైన డబ్ల్యూఎఫ్‌ఐ ‌మాజీ సహాయ కార్యదర్శి వినోద్‌ ‌తోమర్‌ను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, బాధితుల వాంగ్మూలాల్లో వ్యత్యాసం కారణంగా కోర్టు ఈ కేసును కొట్టేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ఆధారంగా బ్రిజ్‌భూషణ్‌పై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం 2023 జూన్‌ 15‌న మహిళల గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడినట్లు పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్‌ ‌దాఖలు చేశారు. 2024 మే 10న ట్రయల్‌ ‌కోర్టు ఐదుగురు మహిళా రెజ్లర్లకు సంబంధించిన ఆరోపణలపై బ్రిజ్‌భూషణ్‌పై అభియోగాలు నమోదు చేసింది. ఇద్దరు రెజ్లర్లను బెదిరించిన ఆరోపణలపైనా విచారణ కొనసాగింది. అలాగే ఒక మైనర్‌ ‌రెజ్లర్‌ ‌కూడా ఆరోపణలు చేసినప్పటికీ, అనంతరం ఆమె ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో పోక్సో చట్టం కింద నమోదైన కేసును పోలీసులు రద్దు చేశారు. తాజా తీర్పుతో బ్రిజ్‌భూషణ్‌ ‌శరణ్‌ ‌సింగ్‌, ‌వినోద్‌ ‌తోమర్‌ ఇద్దరూ ఈ కేసులో నిర్దోషులుగా విడుదలయ్యారు. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వ్యత్యాసం కారణంగా కోర్టు ఈ కేసును కొట్టివేసింది.2016-2019 మధ్యకాలంలో తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ 2023లో మహిళా రెజర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద నిరసనలు చేపట్టడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. నాటి సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ ‌భూషణ్‌, ఇతర సభ్యులపై వారు ఈ ఆరోపణలు చేశారు. ఈ నిరసనల్లో స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌సాక్షి మాలిక్‌, ‌బజరంగ్‌ ‌పునియా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం జోక్యంతో వారు మధ్యలో నిరసనలు విరమించారు. అయితే తగిన చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ ఆరుగురు రెజ్లర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మరోసారి నిరసనలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా పార్లమెంట్‌ ‌కొత్త భవనంవైపు మార్చ్ ‌చేపట్టగా.. వారిని పోలీసులు అడ్డుకోవడం, వారిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. అంతర్జాతీయ ఒలింపిక్‌ ‌కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదు ఆధారంగా బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదైంది. పోలీసులు అభియోగాలు దాఖలు చేశారు. ఆ ఆరుగురిలో వినేశ్‌ ‌ఫొగాట్‌ ‌కూడా ఉన్నారు. ఆ విషయాన్ని మూడు నెలల క్రితం ఆమె వెల్లడించారు. లైంగిక వేధింపుల బాధితుల గుర్తింపును పరిరక్షించేలా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంతకాలం తన గుర్తింపును బయటపెట్టేలేదని వెల్లడించారు. అంతకుముందు మైనర్‌ ‌రెజ్లర్‌ ఒకరు తాను చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవడంతో పోక్సో కేసులో సింగ్‌ ఇప్పటికే నిర్దోషిగా తేలారు. ఇక నేటి తీర్పుతో ఆయనపై క్రిమినల్‌ ‌విచారణ ముగిసినట్లయింది. తొలినుంచి బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ ఆరోపణలు నిజమని తేలితే.. నేను ఉరివేసుకుంటానని తొలిరోజే చెప్పాను. నేడు నేను నిర్దోషిగా తేలినందుకు ఎంతోసంతోషంగా ఉందని తీర్పు అనంతరం సింగ్‌ ‌వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *