నీళ్ల వాటాలో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం..

  • ఏపీ నీటిని త‌ర‌లించుకుపోతున్నా నిర్ల‌క్ష్య‌మెందుకు?
  • సీఎం రేవంత్‌. మంత్రులు మొద్దు నిద్ర వీడాలి
  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నద‌ని, ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి, అధికారుల అలసత్వంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే ప్ర‌మాద‌ముంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు అన్నారు. గోదావరి నదీ జలాలను పెద్దఎత్తున తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ యత్నిస్తోంద‌ని,  తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు కట్టి పెద్ద ఎత్తున నీళ్లు తరలించుకపోయే యత్నాలు చేస్తున్నాయని పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వొస్తున్నాయ‌ని హ‌రీష్ రావు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ ను మూడింతలు పెంచింద‌ని,  దీంతో 200 టీఎంసీల నీటిని బంకచర్ల ద్వారా పెన్నా బేసిన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నద‌ని అన్నారు.

ఏపీ యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆయ‌న విమ‌ర్శించారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.  సీతారామ సాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరంలో 3వ టీఎంసీ, అంబేద్కర్ వార్ధా పెండింగులో ఉన్నాయి.  ఈ నాలుగు ప్రాజెక్టులకు క్లియరెన్స్ సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.  మరోవైపు ఏపీ 200 టీఎంసీల నీటిని గోదావరి నుంచి పెన్నా బేసిన్ కు తీసుకెళ్లడాన్ని యుద్ధ ప్రాతిపదికన, ఆఘమేఘాల మీద చేస్తోంది.  కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్‌ కావాలి, వాటర్ అలొకేషన్ కావాలి, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్‌ కావాలి, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు ప్రకారంగా గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుల అనుమతి కావాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. నేడు ఏపీ ప్రభుత్వం వీటిలో ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచర్ల ప్రాజెక్టును తీసుకొనిపోతోంది.  ఇంత జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నరు? అని హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు.

ఏపీ ప్రాజెక్టులను ఆపాల‌ని కనీసంఉ త్తరం కూడా రాయలేదని ఆరోపించారు.  మేం కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం నిధులివ్వండి అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖలు కూడా రాశారు.  ఏడీబీ నుంచి 40 వేల కోట్ల నిధులిప్పిస్తామని వాళ్లు మాట కూడా ఇచ్చారు.  ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నదా, సోయి లేదా?  సీఎం స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానిని కలిసి ఈ ప్రాజెక్టులను ఆపాలని అడిగే సోయి లేదా?  ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేంద్రం ఏ రకంగా సహకరిస్తుందని అడగాలి కదా?  ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ నీళ్ల విషయంలో నష్టపోవద్దు.  సలహాదారులు,  అధికారులు ఏం చేస్తున్నట్లు? ఏపీ అక్రమంగా కడుతున్న రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద, సుప్రీంకోర్టులో తప్పుడు వాదనలు వినిపించిన ఆదిత్యనాథ్ దాస్ గారికి 3 నెలల జైలు శిక్ష వేసింది.  ఈ దేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి 3 నెలల జైలు శిక్ష పడ్డదంటే, ఒక్క ఆదిత్యనాథ్ దాస్ కే.  ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసిన ఇలాంటి అధికారిని సలహాదారుగా పెట్టుకున్నారు.
తుంగభద్ర నీళ్లను తరలించేందుకు అటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కాల్వలు తవ్వుకుంటున్నాయి.

కల్వకుర్తి, డిండి ఎత్తిపోతలు, సాగర్ ఆయకట్టు నీళ్లందక దెబ్బతినే ప్రమాదం ఉంది.  ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నది?  2017లో ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి నీళ్లు తరలించే ప్రయత్నం చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపింది.  గోదావరి, కృష్ణా బేసిన్లో ఏపీ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ, ఎప్పటికప్పుడు లేఖలు రాశాం. ఆపగలిగాం.  ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయానికి వొస్తే..  బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్ – 3 సాధించారు.  దీనికింద కృష్ణా, గోదావరి జలాలను పున: పంపిణీ చేయాలని అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతికి అప్పటి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. అప్పటి నుంచి పోరాడితే, గడ్కరీ వద్ద, షెకావత్ వద్ద, సుప్రీంకోర్టులో చివరిదాకా పోరాడా విజయం సాధించాం.  దీనిపై ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవియెట్ వేయకపోవడంతో ఏపీ ప్రభుత్వం సెక్షన్ 3 మీద సుప్రీంకోర్టులో కేసు వేసింది.  పదేండ్లు మేం కష్టపడి సెక్షన్ 3 సాధిస్తే మీరు దాన్ని కాపాడాలి కదా, వాదనలు వినిపించాలి కదా  రెండు రాష్ట్రాల మధ్య నదీ పరీవాహక ప్రాంతాల ప్రకారం నీళ్లు సాధించుకోవాలి కదా  దీనిపై దృష్టి పెట్టి కేంద్రానికి, అన్ని ఫోరమ్స్ కు లేఖలు రాయాలని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానంలో పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి అని హ‌రీష్ రావుడిమాండ్ చేశారు. మొద్దు నిద్ర పోతున్న ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడానికే మేం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నామని తెలిపారు.

రాజకీయాలకన్నా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము సూచనలిస్తున్నాంమ‌ని  కానీ మీరు  పట్టించుకోవడం లేదని హ‌రీష్ రావు అన్నారు. మీరు దిల్లీ యాత్రల్లో బిజీగా ఉన్నారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయండి.  మీకు నిజాయితీ ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మేం విలువైన సూచనలు, సలహాలిస్తాం.  మీరు చిల్లర రాజకీయాలు మానుకోండి, తిట్లు బూతులు వద్దు, మేం తిట్టలేక కాదు, బూతులు మాట్లాడలేక కాదు.  సమయం, సందర్భం వొచ్చినపుడు రాజకీయాలు పక్కనపెట్టి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి. ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి.అని హ‌రీష్‌రావు హితువు ప‌లికారు.  ఆ నీళ్లు సాధించుకోవడానికి, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కండ్లు తెరిచి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *