రాజకీయ ఎత్తుగడే ..!

‘‘‌సహజంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి సమావేశాలను ఆయాపార్టీలు ఏర్పాటు చేస్తాయి. కాని, తెలంగాణలోగాని, పక్కనున్న ఏపిలోగాని అంతగా మెజార్టీలేక పోయినా హైదారాబాద్‌లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడంలోనే ఆ పార్టీ ఎత్తుగడ ఏమిటన్నది అర్థమవుతున్నది. పైగా ఆ పార్టీ అగ్రనేతలంతా కట్టకట్టుకుని ఇక్కడి వొస్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ ‌సర్కార్‌ను టార్గెట్‌ ‌చేస్తూ వారి ప్రసంగాలు ఉండబోతాయన్న విషయం వేరే చెప్పాల్సిన అవసరంలేదు.’’

తెలంగాణ రాజధాని నగరంలో భారతీయ జనతాపార్టీ నిర్వహిస్తున్న జాతీయ కార్యవర్గ సమావేశాలపై టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌శ్రేణులు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్‌ ‌వొస్తున్నారని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటులో తమ పార్టీది ప్రధాన భూమిక ఉందని ఇంతకాలం చెప్పుకుంటున్న బిజెపి ప్రధాని తెలంగాణరాష్ట్ర ఆవిర్భావంపై చేసిన వ్యాఖ్యలతో తలదించుకోవాలని ఘాటుగానే స్పందిస్తున్నాయి. తల్లిని చంపి బిడ్డను బతికించారని ఆనాటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపైన కామెంట్‌ ‌చేసిన ప్రధానికి వాస్తవంగా తెలంగాణరాష్ట్రం ఏర్పడడం ఇష్టంలేదన్నది స్పష్టమవుతున్నదని, అలాంటప్పుడు ఇక్కడ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటుచేసుకోవడమెందుకని ఆ రెండు పార్టీలు బిజెపికి సవాల్‌ ‌విసురుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంకోసం దశాబ్దాలుగా పోరాటం చేసిన ఇక్కడి ప్రజలను ఒకవిధంగా ప్రధాని అవమానర్చినట్లేనంటు న్నాయి. ఆ ఉద్దేశ్యంగానే తెలంగాణను అన్నివిధాలుగా చిన్నచూపు చూస్తున్న నరేంద్రమోదీ ముందుగా ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పినతర్వాతే సమావేశాలకు హాజరుకావాలని అటు కాంగ్రెస్‌ , ఇటు టిఆర్‌ఎస్‌ ‌పార్టీలు బిజెపిపైన విరుచుకు పడుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినప్పటికీ దశాబ్ధాల స్థానిక ప్రజల కోరికను మన్నించి తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ‌రెండుగా విభజించింది. అయితే విభజన అనంతరం కాంగ్రెస్‌ అధికారం కోల్పోవడంతో విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత బిజెపిపై ఉండింది. కాని, ఆ హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా బిజెపి అమలుచేయకపోగా పార్లమెంటు సాక్షిగా తల్లిని బిడ్డను విడదీశారంటూ కాంగ్రెస్‌పై కామెంట్‌ ‌చేయడాన్ని ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌ ‌రెడ్డి ప్రధానిపై విమర్షనాస్త్రాలను సంధిస్తున్నారు.. తెలంగాణ ఏర్పడిందే నిధులు,నీళ్ళు, నియామకాల కోసం. అలాంటప్పుడు రాష్ట్రానికి వాస్తవంగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక, ఖాలీగా ఉన్న లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను నింపకపోగా, కనీసం విభజన హామీలమేరకు బయ్యారంలో ఏర్పాటు చేస్తామన్న ఉక్కు ఫ్యాక్టరీనిగాని, కాజీపేటలో ఏర్పాటు చేస్తామన్న కోచ్‌ ‌ఫ్యాక్టరీ విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా ఎదగవలసిన తెలంగాణను ఎదగకుండా చేస్తున్నాడని రేవంత్‌ ‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బిజెపిపై పడింది. ములుగులో ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్శిటీ, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామన్న హామీ, ఐటిఐఆర్‌ ‌వంటి చట్టబద్దమైన హామీలేవీ ఈ ఎనమిదేళ్ళ కాలంలో మోదీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పైగా ఈ కాలంలోనే వివిధ రాష్ట్రాలకు కేటాయించిన మెడికల్‌ ‌కాలేజీల్లో తెలంగాణరాష్ట్రం లేకపోవడం కూడా తెలంగాణపట్ల మోదీకి ఉన్న ప్రేమ ఎలాంటిదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నది.

రాష్ట్రంలోని అధికార టిఆర్‌ఎస్‌కూడా ఇవే విషయాలను ఎత్తి చూపుతూ ముందుగా వీటికి సమాధానం చెప్పినతర్వాతే మోదీ తెలంగాణకు రావాలని డిమాండ్‌ ‌చేస్తోంది. లేదా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ ప్రశ్నలకు సమాధానమైనా చెప్పాలని ఆ పార్టీ నాయ••త్వం బిజెపికి సవాల్‌ ‌విసురుతున్నది. జాతీయ స్థాయిలో దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో పట్టు సాధించిన బిజెపి దక్షిణాది రాష్ట్రాలను తన ఆధీనంలోకి• తీసుకు రావాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అందులో తెలంగాణ టార్గెట్‌గా ఇక్కడ చాలా కాలంగా దూకుడుగా ముందుకు సాగుతున్నది. అనుకోకుండా మధ్యలో మహారాష్ట్ర రాజకీయాలు ఆ పార్టీకి కలిసివొచ్చాయి.. అక్కడి శివసేన ప్రభుత్వానికి చుక్కలు చూపించి, ఎలాగో ఒక లాగా మెజార్టీని ఏర్పాటుచేసుకుని ప్రభుత్వాన్ని చేపట్టింది. ఇప్పటివరకు మెజార్టీ లేని రాష్ట్రాల్లో కూడా తన రాజకీయపు ఎత్తుగడతో, పొత్తులతో మొత్తానికి అధికారంలోకి వొస్తున్నది. ఇప్పుడు తెలంగాణ విషయంలోకూడా అదే దూకుడుగా కదులుతున్నది. సహజంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి సమావేశాలను ఆయాపార్టీలు ఏర్పాటు చేస్తాయి.

కాని, తెలంగాణలోగాని, పక్కనున్న ఏపిలోగాని అంతగా మెజార్టీలేక పోయినా హైదారాబాద్‌లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడంలోనే ఆ పార్టీ ఎత్తుగడ ఏమిటన్నది అర్థమవుతున్నది. పైగా ఆ పార్టీ అగ్రనేతలంతా కట్టకట్టుకుని ఇక్కడి వొస్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ ‌సర్కార్‌ను టార్గెట్‌ ‌చేస్తూ వారి ప్రసంగాలు ఉండబోతాయన్న విషయం వేరే చెప్పాల్సిన అవసరంలేదు. అపర చాణుక్యుడిగా పేరున్న కెసిఆర్‌ ‌దీన్ని ఏవిధంగా ఎదుర్కుంటాడన్నది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే బిజెపి దూకుడుకు కళ్ళెం వేసే పనిని కెసిఆర్‌ ‌ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఈ సమయంలోనే ప్రతిపక్షాల రాష్ట్రపతిఅభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించడం, ఆయనకోసం రాజధానినిండా హోల్డింగ్‌లు, బ్యానర్లతో మొత్తం గులాబిమయం చేయడంతో కాషాయపార్టీ ప్రచార హంగామాను తగ్గించే పనిలో ఉన్నట్లు కనిపిస్తున్నది. దీనికి తోడు యశ్వంత్‌ ‌రాకను పురస్కరించుకుని బేగంపేట ఏయిర్‌పోర్టునుండి జలవిహార్‌ ‌వరకు భారీస్థాయిలో ర్యాలీకి గులాబీపార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈర్యాలీకోసం ఆయా మార్గాలన్నీ గులాబిజండాల రెపరెపలుండే ఏర్పాట్లు జరుగుతుండగా, బిజెపిమాత్రం కావాలని తమకు అవరోధం సృష్టించేందుకే కెసిఆర్‌ ‌సర్కార్‌ ‌పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని దుయ్యబడుతున్నారు. మొత్తంమీద మూడు పార్టీల మధ్య జరుగుతున్న మాటలయుద్ధంలో తెలంగాణ ప్రజలది ప్రేక్షక పాత్రే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *