గాలి కాలుష్యం సువిశాల భారతావవని సమస్యగా గుర్తించబడిరది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదన ప్రకారం భారతదేశ సగటు పిఎం2.5 గాలి కాలుష్య గాఢత సురక్షిత స్థాయి కన్న 10.7 రేట్లు అధికంగా నమోదు కావడం ఒక ప్రమాదకర, ప్రాణాంతక హెచ్చరికగా పేర్కొనబడుతున్నది. గాలిలో 2.5 మైక్రాన్స్ లేదా అంత కన్న తక్కువ వ్యాసం కలిగిన ‘‘ధూళి కణాలు లేదా ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (పిఎం2.5)’’ను పిఎం2.5 అని పిలుస్తారు. భారతీయ ప్రజలు సగటున ఘనపు మీటరుకు 83 మైక్రోగ్రాముల పిఎం2.5 కాలుష్య కణాలు కలిగిన గాలిని అధిక గంటలు పీల్చడంతో ప్రాణాంతకంగా మారుతున్నది. అతి స్వల్ప కాలుష్యం నమోదు అవుతున్న కొన్ని దేశాల్లో పిఎం2.5 గాఢత ఘనపు మీటరుకు 8 మైక్రోగ్రామ్స్ మాత్రమే నమోదు కావడం గమనించాల్సిన విషయంగా భారతీయులు భావించాలి. మన దేశానికి చెందిన ఢల్లీి, పూనే, రాయపూర్, కోల్‌కతా, జైపూర్ లాంటి మహానగరాల్లో గాలి కాలుష్యం అత్యధికంగా నమోదు అవుతూ, నగరవాసుల ఆరోగ్యాలను హరించే స్థాయికి చేరుతున్నది.
పిఎం2.5 కాలుష్యానికి కారణాలు
ఇటీవల ‘‘ఐఫారెస్ట్’’ పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. భారతావనిలో సాలీనా 5.2 మిలియన్ టన్నుల పిఎం2.5 కాలుష్యాలు వెలువడుతున్నట్లు తేలింది. వీటిలో 48 శాతం బయోమాస్ (వంట చెరుకు, పిడకలు, బయట వంటలు) వాడకం, 37 శాతం పారిశ్రామిక/పవర్ ప్లాంట్స్ ఉద్గారాలు, 7 శాతం రవాణా వాహనాలు, 6.5 శాతం వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం వల్ల కలుగుతున్నది. పవర్ ప్లాంట్లలో బొగ్గు లేదా డిజిల్ వాడకంతో పోల్చితే గ్రామీణులు వాడే వంట చెరుకు, వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత వల్ల అనేక రేట్ల పిఎం2.5 కాలుష్య మేఘాలు కమ్ముతూ పల్లెల్లో అకాల మరణాలకు ఆజ్యం పోస్తున్నాయి. గత దశాబ్దంలో వంట చెరుకు వాడకం 13 శాతం తగ్గడానికి ఎల్‌పిజీ గ్యాస్ కారణంగా నిలుస్తున్నది. ఈ కాలంలో దాదాపు 50 మిలియన్ల కుటుంబాలు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంతో ఎల్‌పిజీ వాడడం ప్రారంభించడంతో గాలి కాలుష్యం, ముఖ్యంగా పిఎం2.5 కాలుష్యం తగ్గడం గమనించారు.
ఆరోగ్యంపై ఎం2.5 దుష్ప్రభావాలు
పిఎం2.5 గాలి కాలుష్యం పెరిగిన కొద్దీ శ్వాస సంబంధ అనారోగ్యాలు, పరిమితులు దాటితే ప్రాణాంతకంగా కూడా మారుతుంది. పిఎం2.5 కాలుష్యంతో గుండె జబ్బులు, ఉబ్బసం (అస్తమా), తక్కువ శరీర బరువు లాంటి అనారోగ్యాలు కలుగుతాయి. పిఎం2.5 పరిమాణం ఘనపు మీటరుకు 12 మైక్రోగ్రామ్స్ లోపు ఉన్నప్పుడు ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. పిఎం2.5 విలువ 35 దాటిన గాలిలో 24 గంటలు గడిపితే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. గాలి నాణ్యత సూచిక(ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఏక్యూఐ)ను నిర్ణయించడంలో పిఎం2.5 ప్రభావం కూడా పరిగణనలోకి తీసుకోబడుతుంది. కలుషిత గాలి పేల్చడంతో భారతంలోని నగర, గ్రామీణులు దాదాపు 12 కోట్ల మంది అకాల మరణాలు చెందుతున్నారనే అధ్యయనాలను హెచ్చరికగా తీసుకోవాలి. అకాల మరణాలకు 70 శాతం గాలి కాలుష్యమే కారణమని తేల్చారు.
పిఎం2.5 కాలుష్యం తగ్గించే మార్గాలు
దేశవ్యాప్తంగా పట్టణ/గ్రామీణ అన్ని కుటుంబాలకు వంటలకు ఎల్‌పిజీ లేదా కిచెన్‌లో ఎలక్ట్రిసిటీ సౌకర్యం కల్పించడం తక్షణావసరంగా గుర్తించాలి. 2011లో 160 మిలియన్ల కుటుంబాలు వంటలకు వంట చెరుకుపై ఆధారపడగా 2021లో 110 మిలియన్ల కుటుంబాలకు తగ్గడం జరిగింది. దీనికి తోడుగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడం, సరి లేదా బేసి సంఖ్య నంబరు కలిగిన వాహనాలను అనుమతించడం, భవన నిర్మాణాలను కట్టడి చేయడం, నీటిని స్ప్రే చేయడం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవడం, కృత్రిమ వర్షా జల్లులను ఏర్పాటు చేయడం, పారిశ్రామిక కాలుష్యాలను తగ్గించడం లాంటి చర్యలు వెంటనే తీసుకోవాలి. గ్రామీణ వంటలకు ఎల్‌పిజీ సౌకర్యం కల్పిస్తే దాదాపు 80,000 అకాల మరణాలను అడ్డుకోవచ్చని తెలుసు కోవాలి.
జాతీయ కాలుష్య నియంత్రణ దినం-2023
ప్రతి ఏట 02 డిసెంబరు రోజున దేశవ్యాప్తంగా ‘‘జాతీయ కాలుష్య నియంత్రణ దినం (నేషనల్ పెల్యూషన్ కంట్రోల్ డే)’’ను పాటిస్తూ కాలుష్య విష ప్రభావాలను, కట్టడి మార్గాలను వివరించుట జరుగుతుంది. జాతీయ కాలుష్య నియంత్రణ దినం – 2023 నినాదంగా ‘‘పరిశుద్ధ ఆరోగ్యకర పర్యావరణ భూగోళంలో కోసం సుస్థిరాభివృద్ధి’’ అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలు, పర్యావరణ కాలుష్యం పట్ల ప్రజల్లో అవగాహనలు, కాలుష్య నివారణ పరిశోధనలు, సుస్థిరాభివృద్ధి పథకాల అమలు లాంటి అంశాలను చర్చించడానికి ఈ వేదికలు ఉపయోగపడతాయి. శక్తి పొదుపు, సుస్థిర రవాణా వ్యవస్థలను ప్రోత్సహించడం, నీటి పొదుపు, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడంతో లాంటి అంశాలను ప్రతి ఒక్కరు దృష్టిలో ఉంచుకుంటూ క్రమశిక్షణాయుత జీవన విధానాలను పాటించడం అలవర్చుకోవాలి. గాలి కాలుష్య కట్టడి చర్యలను ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవడం వల్ల 2030 నాటికి ‘‘క్లీన్ ఎనర్జీ ఫర్ ఆల్’’ అనబడే ‘‘ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యం – 07’’ ఫలవంతం అవుతుందని గమనించాలి. ఏ రకమైన కాలుష్యం అయినా జీవకోటి మనుగడకు ప్రమాదకరమే అని భావిస్తూ ప్రపంచ మానవాళి తమ తమ జీవన విధానాల్లో గాలి కాలుష్య కారణాలను తెలుసుకొని కట్టడి చేయడానికి ప్రత్యేక శ్రద్ధను తీసుకోని యెడల గరళ గాలి పీల్చి మిలియన్ల జనులు ప్రాణాలను కోల్పోవడం చూస్తుండగానే జరుగుతుంది. పిఎం2.5 కాలుష్య భూతాన్ని తరిమి పరిశుద్ధ గాలిని భవిష్యత్ తరాలకు అందిద్దాం.
-మధుపాళీ
9949700037





