పదేళ్లలో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాం
ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా మన బలాలు
సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో స్వీకరించాం
నారీశక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించాం
తొలిసారి నమో భారత్ రైలు ఆవిష్కరణ
ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన క్రీడాకారులు
తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం
5జి నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము
న్యూదిల్లీ, జనవరి 31 : వికసిత భారతావ నిని నిర్మించే పనిలో గడిచిన పదేళ్లలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా మన బలాలుగా మారాయని అన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో చూస్తుందని.. దేశాభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. నూతన పార్లమెంటు భవనంలో తనది తొలి ప్రసంగమని చెప్పారు. భారత సంస్కృతి సభ్యత ఎంతో చైతన్యవంతమైనదని గుర్తు చేశారు. బుధవారం పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లలో దేశం సాధించిన పలు విజయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. విజయాలకు సంబంధించి ప్రభుత్వం చూపిన చొరవను ఆమె ప్రశంసించారు. దేశంలో లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, నారీశక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించడంతో చట్ట సభల్లో వారి ప్రాతినిధ్యం 33 శాతం పెరుగుతుందని అన్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి 107 పతకాలు, పారా క్రీడల్లో 111 పతకాలను భారత్ సాధించిందని అన్నారు.
తొలిసారి నమో భారత్ రైలును ఆవిష్కరించామని, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఉన్న అన్ని ఆటంకాలు అధిగమించి..ప్రపంచమే మెచ్చేలా రాములవారి ఆలయాన్ని నిర్మించడంతో ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారమైందన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశామని, దేశంలో 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తుందని, అందుకు తగినట్లు టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చామని రాష్ట్రపతి తెలిపారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో కొత్త ఆవిష్కరణలు జరిగాయని, కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదించుకున్నామని, భగవాన్ బిర్సాముండా జన్మదిన్నాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకుంటున్నామని రాష్ట్రపతి తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని, సూర్యుడిపై ప్రయోగాల్లో భాగంగా ఆదిత్య ఎల్ – 1 మిషన్ విజయవంతం అయిందని, జీ 20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించామని ముర్ము తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘దేశ అభివృద్ధి యువశక్తి, నారీ శక్తి, రైతులు, పేదలు అనే స్తంభాలపై ఆధారపడి ఉంది. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నాం. సౌర విద్యుదుత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా. ప్రస్తుతం దేశంలో పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలో భారత్ ఒకటిగా ఉంది. రూ.4 లక్షల కోట్లు వెచ్చించి దేశమంతటా తాగునీటి వసతి కల్పిస్తున్నాం. 10 కోట్లకుపైగా ఉజ్వల కనెక్షన్లు, కొరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించాం.
రూ.7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం. సామాన్యులపై భారం పడకుండా ట్యాక్సుల్లో సంస్కరణలు తీసుకొచ్చాం. 2 కోట్లకుపైగా మహిళలు స్వయం సమృద్ధి సాధించారు. 4.10 కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చాం. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయమందిస్తున్నాం. కొరోనా, యుద్దాల ప్రభావం ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్తపడ్డాం. రష్యా – ఉక్రెయిన్, ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్దాల వేళ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశాం. పదేళ్లలో ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం. ఆయా ప్రాంతాలకు శుద్ధ జలాలు అందిస్తున్నాం. ట్రాన్స్జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించాం’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. చైనాలోని హాంగ్జౌలో గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సాధించిన విజయాలను ద్రౌపది ముర్ము గుర్తుచేశారు. 2018లో ఇండోనేషియాలోని జకార్తా, పాలెంబాంగ్‌లలో గెలిచిన 70 కంటే ఎక్కువగా భారత్ 107 పతకాలు సాధించిందని ఆమె ప్రశంసించారు.
భారత ప్లేయర్లు సునాయాసంగా 100కి పైగా పతకాలను సాధించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. 2018 ఆసియా క్రీడల్లో 8వ స్థానంలో నిలిచిన భారత్ గతేడాది క్రీడల్లో నాలుగవ స్థానంలో నిలిందని గుర్తుచేశారు. పతకాల పట్టికలో చైనా, జపాన్, దక్షిణ కొరియా తర్వాతి స్థానంలో ఇండియా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. గతేడాది భారత్ విజయాలతో నిండిరదని, అనేక విజయాలు ఉన్నాయని ఆమె ప్రస్తావించారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ప్రస్తావించారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొట్టమొదటి దేశంగా నిలిచిందన్నారు. జీ20 సమ్మిట్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించిందని చెప్పారు. ఆసియా గేమ్స్‌లో 100కు పైగా పతకాలు, అటల్ టన్నెల్ ప్రారంభంతో పాటు పలు విజయాలను ఆమె పేర్కొన్నారు.





