దీనిని ఎవరూ కాదనలేని సత్యం
కాంగ్రెస్లో చేరడంలో ఎలాంటి రాజకీయం లేదన్న కెకె
కడియంను పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్
అంగీకరించిన కడియం, కావ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి29: కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వొచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేయాలన్న మాజీ సీఎం కేసీఆర్ స్లోగన్తోనే ఇన్నాళ్లు బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పారు. నిజానికి తెలంగాణ రాగానే ఆనాటి టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పిన మాట కూడా వాస్తవమని అన్నారు. శుక్రవారం తన నివాసంలో కేశవరావు డియాతో మాట్లాడుతూ… 85 ఏళ్లున్న తాను 55 ఏళ్లు కాంగ్రెస్లో పని చేశానని అన్నారు. సీడబ్ల్యూసీ మెంబర్గా, నాలుగు రాష్ట్రాల ఇన్చార్జిగా కాంగ్రెస్ తనకు చాలా ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కొంత ఆలస్యం చేయడం వల్ల ఆ పార్టీతో తనకు కొంత తేడా వచ్చిందని కేశవరావు చెప్పారు. తెలంగాణ గురించి కేసీఆర్ ఆలోచించక ముందే తాము ఆలోచించామని అన్నారు. తన కొడుకు విప్లవ కుమార్ కోరిక మేరకు ఆనాడు టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. చాలా బాధతో తాను ఆనాడు కాంగ్రెస్ నుంచి బయటకు వొచ్చానని అన్నారు. పాటలు, ధర్నాల వల్లనో తెలంగాణ రాలేదన్నారు. పార్లమెంట్లో ఫైట్ చేయడం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ కారణం తెలుసుకోని.. పార్టీని సరి చేసుకోవాలని చెప్పారు. ఆయన కుటుంబం పార్టీని నడుపుతుందన్న మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని దెబ్బతీసిందని చెప్పారు. యువకులను ముందు పెట్టీ బీఆర్ఎస్ పార్టీని నడిపించాలని చెప్పారు. 13 ఏళ్ల తీర్థయాత్ర తర్వాత తాను తిరిగి సొంత ఇంటికి చేరుకునే సమయం వచ్చిందని వివరించారు. తన కూతురు శనివారం కాంగ్రెస్లో చేరుతున్నారని కేశవరావు ప్రకటించారు. రాజకీయ అవకాశవాదంతో తాను పార్టీ మారట్లేదన్నారు. తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ ఆ నాడు చెప్పారని.. కానీ మాటద ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు. విలీనం చేయకపోవడం కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి ఓ కారణమని చెప్పారు.
ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. కేసీఆర్ను కూడా ఇండియా కూటమిలో చేరమని సలహా ఇచ్చానని అన్నారు. బీఆర్ఎస్ విషయంలో తాను తప్పు చేస్తే మన్నించాలని కోరారు. తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. మళ్లీ ఎన్నికలోచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేయమంటే చేస్తానని కేశవరావు తెలిపారు. ఇదిలావుంటే ఉదయం కె తనకూతురుతో కలసి సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్టీల చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు మాజీమంత్రి, ఎమమెల్యే కడియం శ్రీహరిని పార్టీఓకి రావాల్సిందిగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ఆహ్వానించారు. ఉదయం ఆమె మల్లురవి తదితర నేతలతో కలసి కడియం ఇంటికి వెళ్లారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో మాజీ ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేయబోతున్నారు. కాంగ్రెస్ నేతలు వచ్చి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఆమె ఇప్పటికే వరంగల్ లోక్ సభకు బిఆర్ఎస్ నుంచి పోటీచేయబోవడాన్ని విరమించుకున్నారు. కడియం శ్రీహరి ఇటీవల బిఆర్ఎస్ పై వచ్చిన అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయన్నారు. కడియం కుటుంబం పార్టీ మార్పు బిఆర్ఎస్ పార్టీకి ఓ ఎదురు దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన అనుయాయులు, కార్యకర్తలతో చర్చించి పార్టలో చేరుతానని శ్రీహరి ప్రకటించారు.





