– బ్రిటన్‌కు భారతీయ నావికుడి భార్య వినతి
న్యూదిల్లీ, ఆగస్ట్ 22 : రష్యా ‘షాడో ప్లీట్’కు చెందినదిగా అనుమానిస్తున్న చమురు ట్యాంకర్‌పై ఇటీవల బ్రిటన్ దళాలు దాడి చేసి ఓ భారతీయుడిని అరెస్ట్ చేశాయి. ఈ ఘటనపై ఆ భారత నావికుడి భార్య మాట్లాడుతూ తన భర్తను బలిపశువును చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కేవలం తన యజమాని ఆదేశాలను మాత్రమే పాటించారని చెప్పారు. సదరు నౌక ఇంగ్లిష్ ఛానల్ మీదుగా ప్రయాణిస్తుండగా బ్రిటన్ కమాండోలు అందులోకి ప్రవేశించారు. నౌక కెప్టెన్‌గా ఉన్న 38ఏళ్ల అజయ్ పంత్‌ను అరెస్ట్ చేశారు. ఇటీవల అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో అతడు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అజయ్ భార్య రితూ పంత్ మీడియాతో మాట్లాడుతూ ‘నౌక యజమాని వద్ద నా భర్త ఓ ఉద్యోగి మాత్రమే. యాజమాన్యం ఎలా చెబితే అలాగే చేశారు. తాను చేసిన తప్పేంటో కూడా అర్థం కావట్లేదని ఆయన వాపోతున్నారు. చేయని తప్పునకు జైల్లో కుమిలిపోతున్నారు‘ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నౌకలో 98వేల టన్నుల చమురును అక్రమంగా రవాణా చేస్తున్నారన్నది బ్రిటన్ ఆరోపణ. నౌక కెప్టెన్‌గా కార్గోలో ఏముందో అజయ్ పంత్‌కు కచ్చితంగా తెలుసునని బ్రిటిష్ ప్రాసిక్యూషన్ కోర్టులో వాదించింది. అయితే,దీన్ని అజయ్ న్యాయవాది తోసిపుచ్చారు. కెప్టెన్ బాధ్యత కేవలం నౌకలోని కార్గోను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమేనని, అందులో ఏముందో వారికి తెలిసే అవకాశం లేదని అన్నారు. ఈ కేసుపై డిసెంబరు 15 నుంచి విచారణ జరగనుంది. మరోవైపు కాన్సులర్ అనుమతితో బ్రిటన్ జైల్లో ఉన్న అజయ్ పంత్‌ను భారత విదేశాంగ శాఖ కలిసి ఘటన గురించి తెలుసుకుంది. జూన్ 14న ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కామెరూన్ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ‘స్మిట్రోస్’ ఇంగ్లిష్ ఛానల్‌లో ప్రయాణిస్తున్న సమయంలో బ్రిటన్ సైనిక దళాలు అందులోకి ప్రవేశించాయి. 6 గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో బ్రిటన్ రాయల్ మెరైన్ కమాండోలు, ఎన్‌సీఏ అధికారులు పాల్గొన్నారు. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉండగా కెప్టెన్‌గా ఉన్న అజయ్‌ను బ్రిటన్ దళాలు అరెస్ట్ చేశాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత విధించిన ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా వందల సంఖ్యలో నౌకలను వివిధ దేశాల జెండాలతో నడుపుతోంది. ఈ ’షాడో ప్లీట్’లో భాగంగానే ఈ ట్యాంకర్ రష్యా నుంచి చమురు రవాణా చేస్తోందని బ్రిటన్ ఆరోపించింది. జూన్ 5న ఇది రష్యా పోర్టు నుంచి ఈజిప్టునకు బయల్దేరిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ నౌక ఇంగ్లాండ్ దక్షిణ తీరంలో ఓ సురక్షిత స్థానంలో ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




