వికటించిన మధ్యాహ్న భోజనం

మాగనూరు స్కూల్‌లో  21మంది విద్యార్థులకు అస్వస్థత..
వారం రోజుల్లో వరుసగా రెండో ఘటన

నారాయణపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు  రోజు మాదిరిగానే మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం తిన్న తర్వాత 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వెంటనే వారిని మాగనూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత బుధవారం ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో మురళీధర్‌రెడ్డి, భోజన నిర్వహణ ఇన్‌ఛార్జి హెచ్‌ఎం ‌బాపురెడ్డిలను సస్పెండ్‌ ‌చేస్తూ పాఠశాల విద్యా సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆ పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేశారు. ఆ ఘటన మరువక ముందే మరో 21 మంది విద్యార్థులు హాస్పిటల్‌ ‌పాలు కావడం గమనార్హం.

ప్రభుత్వ తీరుపై మండిపడిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు 

 నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌ ‌జరగడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నాయకులు హరీష్‌ ‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఫుడ్‌పాయిజన్‌ ‌జరిగి 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై పది రోజులు కూడా గడవకముందే మళ్లీ ఫుడ్‌పాయిజన్‌   జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌ ‌జరగడంపై హరీష్‌ ‌రావు తీవ్రంగా మండిపడ్డారు. వాంతులు, కడుపునొప్పితో 30 మంది విద్యార్థులు జిల్లా దవాఖానాలో చేరిన దుస్థితి నెలకొందని అన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని హరీష్‌రావు మండిపడ్డారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదని విమర్శించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని అన్నారు. మాటలే తప్ప చేతలు లేని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు హాస్పిటల్‌ ‌పాలవ్వాలని.. ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని హరీష్‌ ‌రావు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page