ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులపట్ల ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపుతూ, స్థానికులకు మొండిచేయి చూపి, ఇష్టారాజ్యంగా నియామాకాలు చేపట్టిన నేపథ్యంలో స్వ రాష్ట్రంలోనే తమ వాటా తమకు దక్కుతుందన్న ఆకాంక్షతో ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థులు, నిరుద్యోగులకు స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగకపోవడం దురదృష్టకరం. నేతలు మారిన తలరాతలు మారడం లేదని, పోరాటం చేస్తూ, అలసిసొలసిన కొన్ని గుండెలు ఆగిపోయినా, న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. చట్టంలోని లోసుగులను ఆసరాగా చేసుకొని, మార్కుల కట్ ఆఫ్ తగ్గించి, మౌఖిక పరీక్షలో సన్నిహితులకు అధికంగా మార్కులు కేటాయించి, రాత పరీక్షలు ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు రాకుండ అధికారులు ఇష్టారీతిన నియామకాలు చేపట్టడంతో మూడు దశాబ్దాలుగా డీఎస్సీ`98 అభ్యర్థులు శిక్ష అనుభవిస్తూ, న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, డీఎస్సీ అర్హత పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించి కూడా ఉపాధ్యాయులుగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశ నెరవేరకపోగా, ఇంకా పోరాట బాటలోనే కొనసాగుతున్నారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి, నిరుద్యోగుల జీవితాలకు శాపంగా మారింది.
1998 డీఎస్సీ రాత పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించి, బతుకు పోరులో కొంతమంది అలసిపోయి ఇతర వృత్తుల్లో స్ధిరపడగా, మరికొంతమంది తమ హక్కుల సాధన కోసం ముప్ఫై ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నీళ్లు, నిధులు, నియామాకాల కేటాయింపుల్లో తెలంగాణ ప్రాంత వాసుల పట్ల వివక్ష చూపుతున్నారని, నిరుద్యో గులు, యువకులు, ఉపాధ్యాయ, ఉద్యోగులతోపాటు సకల జనులు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి, పోరాడి సాధించుకున్నప్పటికి స్వరాష్ట్రంలోసైతం సైతం పాలకుల నిర్లక్ష్య వైఖరితో, విద్యా వ్యవస్థపై చిన్నచూపుతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టక పోవడంతోపాటు డీఎస్సీ రాతపరీక్షలో అర్హత సాధించి ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న అభ్యర్థులకుసైతం న్యాయం జరగడం లేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో డీఎస్సీ 1998 నోటిఫికేషన్ ప్రకారం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించారు. ఈ క్రమంలో రాత పరీక్షతోపాటు, మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన డీఎస్సీ కమిటీ నిర్వహించింది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతోపాటు నాన్ లోకల్ అభ్యర్థులను, అనర్హులను నియమించడంతో విద్యా వ్యవస్థకు పునాది రాళ్లయిన ఉపాధ్యాయ అభ్యర్థులు తమ హక్కుల సాధన కోసం ముప్ఫై ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం లభించక పోవడంతో తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు ముందు వరుసలో నిలబడి పోరాటం చేసి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోసైతం నేటికీ న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.
1998 డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకు రాత పరీక్ష నిర్వహించగా, డీఎస్సీ రాత పరీక్షలో వివిధ కేటగిరిలవారీగా కట్‌ఆఫ్ మార్కులు నిర్ధేశిస్తూ జీవో నంబర్ 618 జారీ చేశారు. భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టులకన్నా తక్కువ మంది రాత పరీక్షలో అర్హత సాధించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం కట్‌ఆఫ్ మార్కులను కేటగిరిల వారీగా తగ్గిస్తూ జీవో నంబర్ 221 జారీ చేసి, భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో అనర్హులకు, నాన్ లోకల్ అభ్యర్థులకు రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి మౌఖిక పరీక్షలో ఎక్కువ మార్కులు కేటాయించి, నియామకాలు చేపట్టడంతో రాత పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేపట్టగా అప్పటి ప్రభుత్వం ఐవీ సుబ్బారావు ఆధ్వర్యంలో కమిటీ వేయగా, రాత పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చిన అంశం నిజమేనని తేల్చినప్పటికి, ప్రభుత్వం నివేదికను అమలు చేయకుండ నాన్చడంతో డీఎస్సీ అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు.
దీంతో రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికి ఉద్యోగాలు ఇవ్వాలని సూచించినప్పటికి, ప్రభుత్వం కోర్టు ఆదేశాలనుసైతం భేఖాతరు చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ పాలకులతో పలుమార్పు చర్చలు జరిపినప్పటికి, పాలకుల నిర్లక్ష్య వైఖరితో అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరుగలేదు.ఉమ్మడి రాష్ట్రంలో 1998 డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులు 10వేలమంది ఉండగా, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌లో ఆరు వేల మందికిగాను కొంతమంది వివిధ వృత్తుల్లో స్థిరపడగా, ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1998 డీఎస్సీ అభ్యర్థుల నియామకం కోసం కమిటీ వేసి, కమిటీ సిఫార్సుల మేరకు జీవో నంబర్ 27 జారీ చేసి, ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకాలు చేపట్టింది. 1998 డీఎస్సీ రాత పరీక్షలో అర్హత సాధించి, ముప్ఫై ఏళ్లుగా పోరాటం చేస్తున్న అభ్యర్థుల్లో కొంతమంది వివిధ వృత్తుల్లో స్థిరపడగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2000మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన వైఖరితో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని, తమ న్యాయ పోరాటానికి ప్రభుత్వం అండగా నిలిచి, డీఎస్సీ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, మిగిలిపోయిన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమిస్తారనే ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.
-చంద్రశేఖర్ జే. జర్నలిస్టు





