న్యూస్ ఛానల్ అంటే టీఆర్పీ రేటింగ్ ల కోసం వెంపర్లాట కాదు…ఒక సామాజిక బాధ్యత అని గట్టిగా నమ్మిన వ్యక్తి తుమ్మల నరేంద్ర చౌదరి. జర్నలిజం అంటే ప్రజా గళాన్ని వినిపించటం. వార్త అంటే వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టడం. అందుకే సరిగ్గా 15 ఏళ్ల కిందట నరేంద్ర చౌదరి ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకుంది ఎన్టీవీ. రాజకీయ గాలివాటాల నీడ కూడా పడకుండా నిఖార్సైన వార్తలతో ప్రజల్లో విశ్వసనీయతకు మారు పేరుగా నిలిచింది ఎన్టీవీ. 2007 ఆగష్టు 30వ తేదీన అప్పట్లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం అయిన ప్రత్యక్ష ప్రసారాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎన్టీవీ ప్రస్థానం మొదలు పెట్టింది. ప్రతక్ష్య ప్రసారాలకు సరికొత్త నిర్వచనంగా నిలబడింది. 2007లో పంజాగుట్ట ఫ్లైఓవర్ దుర్ఘటనని అందరికంటే ముందే అందించటంతో ఎన్టీవీ అప్రహతి ప్రయామం మొదలయ్యింది. ఎన్టీవీ లక్ష్యం సమాజ సంక్షేం…ప్రజాహితం. అదే ఎన్టీవీ నినాదం. బ్రేకింగ్ న్యూస్ అంటే ఎన్టీవీ… ఎన్టీవీ అంటే బ్రేకింగ్ న్యూస్ అనే పేరు తెచ్చుకుంది. అలా ప్రారంభం అయిన ప్రస్థానంలో ఎన్నో కీలక మైలు రాళ్లు. గెలుపు ఎవరిది అనే పేరుతో ఎన్టీవీ ఇచ్చే సర్వేల కోసం పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఎదురుచూసే వాళ్లు. ఈ సర్వేలు వచ్చిన రిపోర్ట్ కచ్చితత్వానికి నిదర్శనంగా ఉండేవి.
అందుకే ఎన్టీవీ సర్వే అంటే పార్టీలు, రాజకీయ నాయకులకు ఒక లిట్మస్ టెస్ట్ అని చెప్పాలి. ఎన్నికలు దగ్గర పడుతుంటే చాలు నాయకులు ఎన్టీవీ సర్వే నివేదికల కోసం ఆరా తీయటం కూడా మామూలే. ప్రజా గళాన్ని వినిపించటంలోనే కాదు ఆఫ్ ది రికార్డ్ వంటి కార్యక్రమాలతో నాలుగు గోడలకే పరిమితం అయిన వార్తలను, నాయకుల అసలు స్వరూపాలను బట్టబయలు చేయటంలో ఎన్టీవీ కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలోనూ దిల్లీలో జరిగే ప్రతి డెవలప్మెంట్ను అందరి కంటే ముందుగా ప్రజల ముందు పెట్టిన ఏకైక ఛానల్ ఎన్టీవీ. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో. అందుకే ఇవాళ ఎన్టీవీ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఛానల్ గా నిలబడి ఉంది. ప్రజలు ఎన్టీవీ విశ్వసనీయతకు పట్టం కడుతున్నారు. అయితే ప్రజాభిప్రాయానికి ఎన్టీవీ ప్రామాణికంగా మారడం వెనుక..దశాబ్దానికి పైగా ఎన్టీవీ యాజమాన్యం చిత్తశుద్ధి, ఆర్ధికంగా లాభనష్టాల బేరీజు కంటే సామాజిక బాధ్యతకే పట్టం కట్టిన నిబద్దత, ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదని నేతృత్వంలో సిబ్బంది పడిన శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి.
ఎన్టీవీ తన సామాజిక బాధ్యతను ప్రజా సమస్యల విషయంలోనే కాదు దేశ భక్తి విషయంలో చాటుకుని నెంబర్ వన్ గా నిలబడింది. ఎన్టీవీ చేపట్టిన మన దేశం-మన గీతం కార్యక్రమం ద్వారా మన జాతీయ గీతం జన గణ మనను ప్రజల్లోకి తీసుకుని వెళ్లింది. ఏడాది కాలం పాటు ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెల్లోకి బలంగా తీసుకుని వెళ్లి చైతన్యం తీసుకుని వచ్చింది. ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీల్లో మన దేశం- మన గీతం కార్యక్రమం చేపట్టి భవిష్యత్ తరాలు జాతీయ గీతాన్ని, దేశభక్తి స్ఫూర్తిని గుండెల్లో నింపుకునేటట్లు చేసింది. 105 చోట్ల, నగరాలు, జిల్లా కేంద్రాలతో పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లోనూ మన దేశం- మన గీతం కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఈ కార్యక్రమ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. అంతే కాదు భారత-పాకిస్థాన్, భారత- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఎన్టీవీ ప్రయాణించి సరిహద్దుల్లో సిపాయిల పహారా, వారి స్థైర్యాన్ని, ధైర్యాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది.ఎన్టీవీ ప్రారంభించిన రోజే ప్రజల్లో దైవ భక్తిని మరింత ప్రేరేపించేందుకు, హైందవ ధర్మాన్నిపరివ్యాప్తం చేసేందుకు భక్తీ టీవీని కూడా ప్రారంభించారు. భక్తీ టీవీ నేతృత్వంలో జరిగే కోటి దీపోత్సవం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు.
యావత్ భారతావనిలోనే కోటి దీపోత్సవం కార్యక్రమం విఖ్యాతి చెందింది. అనేక ప్రాంతాల నుంచి ధార్మిక గురువులు, మత ప్రేమికులు, భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. కార్తీక మాసంలో జరిగే ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక ఉత్సవంలా జరుగుతుంది. ఈ కార్యక్రమం ధార్మిక సమ్మేళనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ధర్మ పరిరక్షణతో ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతోంది. పాత్రికేయ ప్రమాణాలు అడుగంటిపోతున్న తరుణంలో, ప్రతి మీడియా సంస్థ ఏదో ఒక రాజకీయ పక్షాన్ని వాటుగా చేసుకుని ప్రయాణం చేస్తున్న సందర్భంలో నిష్పక్షపాతంగా , జర్నలిజం విలువలకు కట్టుబడి నిబద్దతో ముందుకు సాగుతున్న ఎన్టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందలు. ఈ ప్రస్థానంగా మరింత ప్రభావవంతంగా సాగాలని ఆకాక్షిద్దాం.
– ప్రజాతంత్ర డెస్క్




