మన్మోహన్‌కు భారతావని ఘన నివాళి

  • ఇంటికి వెళ్లి నివాళి అర్పించిన రాష్ట్రపతి ముర్ము
  •  ప్రధాని మోదీ, అమిత్‌ షా తదితరుల శ్రద్ధాంజలి
  •  కేబినేట్‌ భేటీలో ఘనంగా నివాళి
  •  దేశంలో వారం రోజుల పాటు సంతాపదినాలు
  •  అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
  •  ప్రధాన కార్యాలయాలపై జాతీయ జెండా అవనతం

న్యూదిల్లీ, డిసెంబర్‌ 27: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తదితర ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని  మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూయడంతో దేశ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.  ఆయన పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరంద్ర మోదీ నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం మన్మోహన్‌ నివాసానికి వెళ్లిన వీరు.. ఆయన భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్‌ సింగ్‌ను దేశం గుర్తుంచుకుంటుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ సహా అనేక కీలక పదవుల్లో దేశానికి సేవలందించారు. పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారు. దేశం, ప్రజల పట్ల ఆయన సేవాభావం స్మరించుకోదగినది. విలక్షణ పార్లమెంటేరియన్‌గా ఆయన సేవలు అందించారు. ఎన్నో కీలక పదవులు చేపట్టినా నిరాడంబర జీవితం గడిపారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చాలాసార్లు మాట్లాడా. ఆయన మృతి విచారకరం. నా తరఫున, దేశ ప్రజల తరఫున శ్రద్దాంజలి ఘటిస్తున్నా‘ అని మోదీ తెలిపారు. అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ అత్యవసరంగా సమావేశమై ఘనంగా నివాళి అర్పించింది. వారంపాటు సంతాప దినాలు ప్రకటించింది. మన్మోహన్‌ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది.

రాష్ట్రపతి భవన్‌ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైనా జాతీయ జెండాను సగానికి దించారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. 92 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌ వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో గత రాత్రి ఇంటివద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు హాస్పిటల్‌లో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌ పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించారు. అంతకుముందు ఆర్‌బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం వెల్లడిరచింది. ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. శనివారం రాజ్‌ఘాట్‌ సవిరీపంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిరచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page