నవభారత శిల్పిని కోల్పోయాం..:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ఆర్థిక సంక్షోభం నుంచి ఈ దేశాన్ని గట్టెంకించి నవభారత దేశాన్ని నిర్మించిన మహా నాయకుడిని ఈ దేశం కోల్పోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వివాదాలు, విమర్శలకు తావు లేకుండా రాజకీయ ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో మన్మోహన్‌ సింగ్‌ తన ప్రవర్తన ద్వారా చూపారని తెలిపారు. ఆయన గొప్ప ఆర్థికవేత్త, మహానాయకుడు, సంస్కరణవాది అన్నిటికీ మించి గొప్ప మానవతావాది అని తన సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశ ఆధునికతకు, శాస్త్రీయ విద్యా విధానానికి, ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చిన విద్వత్‌ వివేచనా పరులను ప్రధానులను చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు తన ప్రగాడ నివాళి అర్పిస్తూ%ౌ% ఈ దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకించిన చరిత్ర మన్మోహన్‌ సింగ్‌కే దక్కింది అన్నారు.

ఉదారవాద కాలంలో ఈ దేశానికి ప్రధానంగా ఆర్థిక రంగానికి ఆయన సేవలు ఎంతో విలువైనవని, తన సుదీర్ఘ జీవితకాలంలో ఎన్నో రంగాలను ఆయన పరిపుష్టి చేశారని తెలిపారు. ప్లానింగ్‌ కమిషన్‌లో డిప్యూటీ ఛైర్మన్‌, భారత ఆర్థికశాఖ, అణుశక్తి, అంతరిక్ష కమిషన్‌, భారత ప్రధాని ఆర్థిక సలహాదారుడిగా ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా.. భారతదేశ చరిత్రలో ఒక ఆర్థికవేత్త, విద్యావేత్త భారత ప్రధాని కావడం వెనక కాంగ్రెస్‌ పార్టీ దూర దృష్టి ఉందని ఆయన అన్నారు. ఈ దేశ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వృద్ధి వెనక మన్మోహన్‌ సింగ్‌ అపారమైన జ్ఞానం,ఆచరణ, కృషి ఉన్నాయన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల విస్తరణ, సమాచార హక్కు చట్టం, గృహహింస చట్టం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌, 2013 భూ సేకరణ చట్టం, ఎన్‌ఐఏ ఏర్పాటు, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్‌ కార్డుల రూపకల్పన ఎన్నో కీలకమైన దశలలో ఆయన ఆలోచనలు ఈ దేశ పునర్నిర్మాణానికి తోడ్పడ్డాయి. వారి మృతి ఈ దేశానికి, కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page