– అదే మనందరి కర్తవ్యం కావాలి
– ఈ ప్రయాణంలో కార్యకర్తలతో మమేకమయ్యా
– అధ్యక్షుడిగా వంద రోజుల ప్రయాణంపై రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో తన ప్రయాణాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ఎన్.రామచందర్‌రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పార్టీకి కార్యకర్తలే పునాది అంటూ భుజాలు కాయలు కాసేలా జెండాలు మోసి పార్టీని అధికార పీఠం వైపు తీసుకుపోయేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషి తనకు తెలుసునన్నారు. కార్యకర్తల కఠోర శ్రమలో తానూ భాగమేనని, ఒక కార్యకర్తగా పార్టీలో ప్రయాణం ప్రారంభించి, అందరి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందున్నానని అన్నారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్రంలో బీజేపీిని అధికారంలోకి తీసుకురావడమే మనందరి కర్తవ్యమన్నారు. తాను అధ్యక్షుడినై వంద రోజులైందని, ఈ కాలంలో అత్యధిక భాగం కార్యకర్తలతో మమేకం అయ్యేందుకే కృషి చేశానని చెప్పారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత కార్యకర్తలను కలిసేందుకు అనేక జిల్లాల్లో పర్యటనలు జరిపానని, ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చానని అన్నారు. పార్టీకి గుండెకాయలాంటి కార్యకర్తలను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. వంద రోజుల్లో అనేక పోరాటాల్లో పార్టీని భాగం చేస్తూ స్వయంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నానని, పార్టీ అంటే నా ప్రాణం, కార్యకర్తలే పార్టీకి ప్రాణం.. అలాంటి కార్యకర్తల కోసం మనసా వాచా కర్మణా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతం- సేవే లక్ష్యం అనే మంత్రంతో రైతుల సమస్యల నుంచి బీసీ రిజర్వేషన్ల దాకా, మహిళలు, యువత, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేశానని రామచందర్‌రావు వివరించారు. రానున్న రోజుల్లో మరింత బలంగా, మరింత ప్రజా ఆధారంగా పార్టీని ప్రతి పల్లె, ప్రతి కుటుంబంలోకి తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





