“పాకిస్తాన్ కోణం ఎట్లా ఉన్నప్పటికీ, తాలిబన్లలో చాలామంది భారత్‌ను ఒక హిందూ మెజారిటీ దేశంగా, ముస్లింల అణచివేతకు పాల్పడుతున్న దేశంగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా హిందూ జాతీయవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ను హిందువుల ఉనికి, భద్రతలకు ప్రమాదకారిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఘజనావిడ్-దిల్లీ సుల్తానుల కాలంలో జరిగిన పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. మరి దేశీయంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదులైన తాలిబన్లతో వ్యవహరించడమేంటని విమర్శకులు చేస్తున్న విమర్శ. అంతేకాదు తాలిబన్ విదేశాంగ మంత్రికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం ద్వారా కేవలం పాకిస్తాన్‌ను దృష్టిలో పెట్టుకొని, దేశ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి బీజేపీ ప్రభుత్వం తన రెండు నాల్కల ధోరణిని నిరూపించుకున్నదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.”
శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అనేది సామెత. ప్రస్తుతం ఈ సూత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబన్లకు వర్తిసుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఒకవైపు ఇరుదేశాల ప్రతినిధులు పరస్పరం స్నేహపూర్వకంగా చేతులు కలుపుకోవడం విశేషం కాగా మరోవైపు పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య సంబంధాలు కనిష్ట స్థాయికి క్షీణించడమే కాదు, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతుండటం మరో వైపరీత్యం.ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మం త్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ప్రస్తుతం మనదేశంలో వారం రోజుల పర్యటన కొనసాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మత ఛాంతస సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో కూడా పాల్గొన్నారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ వైఖరి సనాతన హిందూధర్మ సమర్థకుల్లో ఆశ్చర్యం కలిగించడం సహజమే. అసలు బీజేపీ ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తుందని వారు ఊహించి ఉండరు . ఈ విషయంలో వారు హతాశులై ఉండవచ్చు. వీరు సోషల్‌మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తే ఈ పరిణామం పట్ల ఎంతగా ఆశ్చర్యపోతున్నదీ అర్థమవుతుంది. తాలిబన్లను ఏకంగా మనదేశంలోకే ఆహ్వానించడమేంటన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేసే రీతిలో వీరి సోషల్ మీడియా పోస్టులు కొనసాగుతున్నాయి. దారుల్ ఉలూమ్ దియోబంద్ నాయత్వం ఘనంగా ఆహ్వానించిన తీరు, ఇందుకు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ కృతజ్ఞతలు చెప్పిన విధానాన్ని వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఘజ్వా-ఎ-హింద్ కలలను సాకారం చేసే దిశగా ఉద్రిక్తరీతిలో నిశ్శబ్దంగా ప్రచారం చేస్తూ వస్తున్న సంస్థ తీరును కూడా వారు వివరిస్తున్నారు.
అమీర్‌ఖాన్ ముత్తాఖీ మనదేశానికి దౌత్యపరమైన పర్యటనకు వచ్చినట్టు ప్రభుత్వం చెబుతున్న మాటలను ఈ హిందూత్వ వర్గాలు విశ్వసించడంలేదు సరికదా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహారశైలి హిందూత్వంపై రెండు నాల్కల ధోరణిని ప్రతిబింబిస్తున్నదని వారు తమ పోస్టుల్లో నిలదీయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తాలిబన్ అనేది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయినందువల్ల, వీరితో నెరపే దౌత్యం ఎన్నడూ సుస్థిరంగా ఉండజాలదనేది వీరి వాదన. ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రపంచానికే ప్రమాదమని హిందూత్వ అనుకూల రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు గతంలో విపరీతంగా విమర్శించేవి. ప్రస్తుతం తాలిబన్లకు స్నేహహస్తం అందించడం భౌగోళిక, రాజకీయాల అవసరం రీత్యా జరుగుతోందని ఇవే సంస్థలు ప్రచారం చేయడాన్ని విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. అంతేకాదు ఒకప్పుడు తాలిబన్ల అణచివేత విధానాలను తీవ్రంగా ఖండించిన వీరు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడాన్ని వారు తప్పు పడుతున్నారు.
ఆర్ ఎస్ ఎస్ వంటి హిందూ సంస్థలు మొదటినుంచీ ఇస్లామిక్ ఉగ్రవాదం దేశానికి బయటనుంచి వచ్చే పెనుముప్పుగానే పరిగణించాయి. మతఛాందస ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మనదేశంలోని రాజకీయ ఉద్యమం నేడు ఇస్లామిక్ సిద్ధాంతాల అమలు పేరుతో దారుణ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న తాలిబన్‌తో వ్యవహరిస్తున్న తీరును విమర్శకులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. అంతేకాదు ఇది బీజేపీ ప్రభుత్వ నయవంచకత్వం కాక మరేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దేశంలోని మైనారిటీ వర్గాలపట్ల తీవ్ర వివక్ష పాటించే మన ప్రభుత్వం, తమ దేశంలోని మైనారిటీలు, మహిళలు, పిల్లల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించే తాలిబన్లతో జట్టుకట్టడమేంటని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
అసలు మానవహక్కుల ఉల్లంఘనలో తాలిబన్ల వ్యవహారశైలి బాగా తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా వారితో స్నేహగీతిని ఆలాపించడం ఎంతవరకు సబబనేది ప్రత్యర్థుల వాదన. విదేశాంగ విధానంలో ప్రజాసామ్య విలువలకు పెద్దపీట వేసే భారత్ వైఖరికి ఇది పూర్తి విరుద్ధమని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల విదేశాంగ మంత్రి మనదేశంలో జరిపే పర్యటనపై హిందూ జాతీయవాదుల్లో తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. అయితే వ్యూహాత్మక అవసరాల రీత్యా ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వాస్తవిక ధోరణితో కూడినది మాత్రమే కాదు, వ్యూహాత్మక అవసరమని కూడా కొందరు వ్యూహకర్తలు చెబుతున్నమాట. ముఖ్యంగా మనకు శత్రువులుగా ఉన్న పాకిస్తాన్, చైనాలకు చెక్ పెట్టడానికి, మనదేశం అక్కడ పెట్టిన పెట్టుబడుల రక్షణకు, అన్నింటికీ మించి ఆఫ్ఘనిస్తాన్‌ను భారత వ్యతిరేక ఉగ్రవాదుల ప్రధాన కేంద్రంగా మారకుండా అడ్డుకునేందుకు ఈవిధంగా వ్యవహరించక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు.
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య క్షీణించిన సంబంధాలే మన ప్రస్తుత వ్యవహారశైలికి ప్రేరణ అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం అనుసరించే విధానం, సంప్రదాయికంగా ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌కు ఉన్న పలుకుబడిని దెబ్బతీయగలదు. ఇదే సమయంలో ప్రాంతీయంగా తన ప్రాబల్యాన్ని సుసంఘటితం చేసుకోవాలనుకునే పాక్ యత్నాలకు గండికొట్టవచ్చు. పాకిస్తాన్ కోణం ఎట్లా ఉన్నప్పటికీ, తాలిబన్లలో చాలామంది భారత్‌ను ఒక హిందూ మెజారిటీ దేశంగా, ముస్లింల అణచివేతకు పాల్పడుతున్న దేశంగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా హిందూ జాతీయవాదులు ఆఫ్ఘనిస్తాన్‌ను హిందువుల ఉనికి, భద్రతలకు ప్రమాదకారిగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఘజనావిడ్-దిల్లీ సుల్తానుల కాలంలో జరిగిన పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. మరి దేశీయంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదులైన తాలిబన్లతో వ్యవహరించడమేంటని విమర్శకులు చేస్తున్న విమర్శ. అంతేకాదు తాలిబన్ విదేశాంగ మంత్రికి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం ద్వారా కేవలం పాకిస్తాన్‌ను దృష్టిలో పెట్టుకొని, దేశ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి బీజేపీ ప్రభుత్వం తన రెండు నాల్కల ధోరణిని నిరూపించుకున్నదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
అయితే చారిత్రకంగా దాయాది దేశంతో మనకున్న శత్రుత్వం నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం, పాక్ ను దృష్టిలో పెట్టుకొని తన విధానాలను అమలు పరచే శైలిని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో వ్యూహాత్మక హ్రస్వదృష్టి తప్ప ఆధునిక వాస్తవిక కోణం కనిపించదు. కేవలం పాకిస్తాన్ కేంద్రంగా తాలిబన్లతో కొనసాగించే స్నేహాన్ని సహజసిద్ధమైనదిగా, దీర్ఘకాలిక ప్రాతిపదిక ఆధారితమైన దని భావించడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో హిందూ హృదయ సామ్రాట్ (మోదీ) నేతృత్వంలోని ప్రభుత్వం తాలిబన్లకు స్నేహ హస్తాన్ని ఇవ్వడం కొందరు హిందూ జాతీయవాదులను కలవరపాటుకు గురించేసిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
– శామ్ సుందర్





