స్టార్ట్‌తో స్టాప్‌ స్మోకింగ్‌ ఒక్క పఫ్‌ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు !

స్మోకింగ్‌ ప్రాణానికి హానికరం అని తెలిసినా.. చాలా మంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్టైల్‌, ఫ్యాషన్‌, రిలాక్సేషన్‌, సరదా కోసం మొదలైన అలవాటు.. వ్యసనంగా మారి ప్రాణాలనే తీసుకుంటుంది. మన దేశంలో స్మోకింగ్‌ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, ఉపిరి తిత్తుల క్యాన్సర్‌, ఉదరకోశ క్యాన్సర్‌ వంటి తీవ్రమైన అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. స్మోకింగ్‌ కారణంగా దంతవ్యాధులు, క్షయ వ్యాధి, అల్సర్‌, గ్యాస్‌ ట్రబుల్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి. పొగాకులో ఆర్సెనిక్‌, బెంజీన్‌, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, ఇథిలీన్‌ ఆక్సైడ్‌ వంటి 72 రకాల క్యాన్సర్‌ కారకాలుంటాయి. కానీ చాలా మంది ఈ అలవాటును మానుకోలేరు. దేనికైనా బానిసైపోతే దాని నుండి బయట పడడం కష్టం. ధూమపానం మానేయడం అంత తేలికైన పని కాదు.
సిగరెట్‌ బానిసలు: నిజంగా ధూమపానం అలవాటు కనుక ఉంటే మానేయడం చాలా కష్టం. కానీ తప్పకుండా మానేయగలరు. అది ఎప్పుడు అంటే మీరు మానేయడానికి సిద్ధంగా వున్నప్పుడు. అయితే దీని వలన వచ్చే సమస్యల నుండి పోరాడటం కూడా కష్టమే. ఎన్నో అనారోగ్య సమస్యలు దీని వల్ల మనకి కలుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది దీని బారిన పడి కాన్సర్‌ని కొని తెచ్చుకుంటున్నారు. మొదట టెన్షన్‌ ఎక్కువ అయిపోయింది అని కంట్రోల్‌ చేసుకోలేక పొగాకుకి దగ్గరవుతున్నారు. అలా క్రమంగా వాళ్ళు బానిసలవుతున్నారు. మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా స్మోకింగ్‌కి అలవాటు పడిపోయారు.

సిగరెట్‌ ఫ్యాషన్‌ కాదు.. అది మీ మరణానికి దారి:  పొగాకు వల్ల వ్యాపార సంస్థలకు లాభాలు కలిగిన, ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని గుగ్గిపాలు చేస్తుంది. పొగాకు నేడు ప్రజారోగ్యానికి అతిపెద్ద శత్రువు.  పొగాకు వాడడం వల్ల ఆరోగ్యం పై తీవ్రప్రభావంతో ఊపిరితిత్తులు పాడై మరణానికి దారితీస్తుంది, ప్రపంచంలో మరణానికి రెండవ ప్రధాన కారణం పొగాకు.  ఈ రోజు క్రమం తప్పకుండా ధూమపానం చేసే సగం మంది (సుమారు 650 మిలియన్ల మంది) చివరికి పొగాకుతో చంపబడతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. సిగరెట్‌, తంబాకు వినియోగించడం ఫ్యాషన్‌ కాదు అది మీ మరణానికి దారి అని గుర్తించాలి.

సిగరెట్‌ మానేస్తానని మనసులో ప్రతిజ్ఞ: మనుషులు తినే ఆహారం, జీవనశైలి కూడా ధూమపాన అలవాట్లు, ఆరోగ్య విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. యోగా, మెడిటేషన్‌, మార్నింగ్‌ వాక్‌ వంటివి అలవాటు చేసుకోవాలి. సిగరెట్‌ మానేస్తానని మనసులో ప్రతిజ్ఞ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభంలో ఇవన్నీ పనికిరానివిగా కనిపిస్తాయి. కానీ ఈ విషయాలకు అలవాటు పడ్డాక, శరీరం, మనసు తేలికగా ఉంటుంది. మనిషి ఆలోచనలలో స్పష్టత ఉంటుంది. ఇన్ని రోజులు ధూమపానం ఎందుకు చేశాము, ఎందుకు మానలేకపోయాం అని దాని గురించి బాధపడటం ప్రారంభమవుతుంది.
తల్లిదండ్రులుగా ఆలోచించండి: ముఖ్యంగా మీరు జన్మనిచ్చిన మీ పిల్లలు మిమ్మల్నే ఫాలో అవుతుంటారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అటు మీకు, ఇటు మీ పిల్లలకు చెడు చేసేదాన్ని ఎందుకు అలవాటు చేసుకోవాలి. ఏదైనా గట్టిగా అనుకుంటే చేయగలరు.. ఆ పని ఎప్పటి నుంచో కాదు ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. మీ పిల్లలకు మీరే మార్గదర్శకులు అవ్వాలి. ఆరోగ్యాన్ని హరించే ఏదైనా సరే ఆనందాన్ని ఇస్తుంది అని అనుకోవడం ఒక భ్రమ మాత్రమే అని గుర్తుంచుకోవాలి.

స్టార్ట్‌ తో మీ స్టాప్‌ స్మోకింగ్‌ ప్లాన్‌ను ప్రారంభించండి మానేసే తేదిని నిర్ణయించుకోవాలి : ధూమపానం మానేయాలని ఆలోచిస్తుంటే ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం రోజును మించిన మంచి రోజు మరోటి లేదు. ఈ రోజు నే స్ఫూర్తి గా తీసుకుని 2023 సంవత్సరం నుండి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి. ధూమపానం మానేసిన విషయం చెప్పండి : ధూమపానం వదిలేసిన నిర్ణయం కుటుంబ సభ్యులకు, సహోద్యోగులకు, ఆత్మీయ మిత్రులకు తెలియ పరచండి. ఇట్టి విషయాన్ని సానుకూల వ్యక్తులతో పంచుకోండి. వారి సపోర్ట్‌ ను తీసుకోవాలి.  మీ మిత్రులకు  ధూమపానం మానేయాలని, ధూమపానం చేసేవారితో  మీ దగ్గరగా పొగతాగవద్దని, సిగరెట్లు తనకు ఇవ్వవద్దని సున్నితంగా చెప్పండి
ముందుగానే ఊహించాలి:  ధూమపానం మానేయడం వల్ల కలిగే ఫలితాలు అంచనా వేయాలి.  బలాలు, బలహీనతలను ముందుగానే తెలుసుకోవాలి. సిగరెట్‌ తాగడానికి మిమ్మల్ని ఏ పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయో గమనించండి. సిగరేట్లు మానేయడం సులువే. పొగతాగడం మానివేసే సమయంలో ఉత్పన్నమయ్యే అసహనం, ఆందోళన వంటి లక్షణాలు అగుపిస్తాయి. వీటిని ధృఢసంకల్పంతో,  ధీమాగా ఎదుర్కొవాలి.
పరిసర ప్రాంతాల్లో పొగాకు లేకుండా చేయాలి: ఇంటి పరిసర ప్రాంతాల్లో పొగాకు సంబంధించిన వస్తువులు తొలగించాలి. సిగరెట్లు, లైటర్లు, అష్ట్రేలు దూరంగా విసిరేయాలి.
సైకాలజిస్టు లేదా కౌన్సెలర్‌ తో మాట్లాడండి : ధూమపానం మానేయడానికి సైకాలజిస్టు లేదా కౌన్సెలర్‌ తో సహాయం కోసం మాట్లాడాలి. కౌన్సెలింగ్‌  పునరుత్తేజం, ఆత్మ విశ్వాసం పెరగటానికి దోహదం చేస్తుంది.                                                 ి

 -డా.అట్ల  శ్రీనివాస్‌ రెడ్డి,  
స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ రిహాబిలిటేషన్‌, సైకాలజిస్ట్‌
ఫ్యామిలీ కౌన్సెలర్‌
సెల్‌: 9703935321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *