సర్వోత్తమ న్యాయ శిఖరానికి వజ్రోత్సవ కిరీటం!

దేశ సర్వోన్నత న్యాయస్థానం నేటికి 75-వసంతాలు పూర్తి చేసుకుంటూ వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భమిది. సార్వభౌమిక ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా 26 జనవరి 1950న అవతరించిన భారతంలో 1950, జనవరి 30న భారత సుప్రీమ్‌ కోర్టు ప్రారంభం అయ్యింది. ప్రారంభమైన తొలి రోజుల్లో పార్లమెంట్‌ భవన ఆవరణ నుంచే మాత్రమే కార్యకలాపాలు నిర్వహించింది. 01 అక్టోబర్‌ 1937 నుంచి 29 జనవరి 1950 వరకు ‘ఫెడరల్‌ కోర్టు ఆఫ్‌ ఇండియా’గా దేశ న్యాయ వ్యవస్థ సేవలందించిన విషయం మనకు తెలుసు. 30 జనవరి 1950న ఉదయ వేళ నాటి ఫెడరల్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి హరిలాల్‌ జె కనియా, పలువురు న్యాయమూర్తులతో పాటు నాటి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, విదేశీ న్యాయమూర్తులు, సీనియర్‌ అడ్వొకేట్ల సమక్షంలో ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 15 ఆగష్టు 1947న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ 26 జనవరి 1950 నుంచి మాత్రమే మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన విషయం మనకు విధితమే. దేశంలోని అన్ని న్యాయ స్థానాలకు మిన్నగా న్యాయ సమీక్షలు, చట్టసభల పని తీరు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికార పరిధులు, రాజ్యాంగం నిర్థేశించిన మౌళిక హక్కుల పరిరక్షణలు లాంటి అనేక ఇతర అంశాలు సుప్రీమ్‌ కోర్టు పరిధిలోకి మాత్రమే వస్తాయి.
సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తులు
1950 నుంచి 1958 వరకు పార్లమెంట్‌ భవనంలో సేవలందించి 1958లో ప్రస్తుత భవనంలోకి మారింది. 1979లో మరో రెండు అదనపు భవనాలు పని చేయడం ప్రారంభించాయి. ప్రస్తుత సుప్రీమ్‌ కోర్టులో కేంద్ర భాగాన ప్రధాన న్యాయమూర్తి కోర్టు, 19 కోర్టు రూమ్‌లు పని చేస్తున్నాయి. 1950లో ప్రధాన న్యాయమూర్తితో కలిపి 08 మంది న్యాయమూర్తులు పని చేయగా, 1956లో వారి సంఖ్య 11 మంది, 1960లో 14 మంది, 1978లో 18 మంది, 1986లో 26 మంది, 2009లో 31 మంది, 2019లో 34 మంది వరకు సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచారు. అర్హత కలిగిన సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తే తొలగించడానికి పార్లమెంట్‌ సభ్యుల 2/3 మెజారిటీ ఓటింగ్‌తో మాత్రమే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. సుప్రీమ్‌ కోర్టు కేసులకు ఆంగ్ల భాషలో కార్యకలాపాలు నిర్వహిస్తారు. 1993 నుంచి  సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్‌కు మాత్రమే ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను అప్పగించడం జరుగుతున్నది. 1998 నుంచి సుప్రీమ్‌ కోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు/ న్యాయమూర్తుల కొలీజియమ్‌ మాత్రమే నియామకాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ఆనవాయితీగా మారింది. కనీసం ఐదేళ్ల పాటు హైకోర్టులో న్యాయమూర్తిగా లేదా 10 ఏండ్ల పాటు అడ్వకేట్‌గా సేవలందించిన అర్హుతగల భారత పౌరులను మాత్రమే సుప్రీమ్‌ కోర్టులో న్యాయమూర్తులుగా నియామకం పొందే హక్కు/అర్హత కలిగి ఉంటారు. న్యాయమూర్తుల ఉద్యోగ విరమణ 65 ఏండ్లుగా నిర్ణయించారు.
సుప్రీమ్‌ కోర్టు ప్రాధాన్యం
దేశ సర్వోన్నత న్యాయ స్థానంగా సుప్రీమ్‌ కోర్టు తీర్పు అత్యున్నతమైన అంతిమ తీర్పుగా తీసుకోవాలి. హైకోర్టులో సరైన న్యాయం అందలేదని నిర్ణయించుకున్న వారు సుప్రీమ్‌ కోర్టు తలుపులు తట్టవచ్చు. రాజ్యాంగ మౌళిక హక్కుల ఉల్లంఘన విషయంలో సుప్రీమ్‌ కోర్టును ఆశ్రయించవచ్చు. రాజ్యాంగ పరిధిని దాటిన చట్టసభల నిర్ణయాలపై సుప్రీమ్‌ కోర్టులో చర్చించవచ్చు. ప్రభుత్వ అంగాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను సమీక్షించే అధికారం సుప్రీమ్‌ కోర్టుకు ఉంటుంది. సుప్రీమ్‌ కోర్టు తీర్పులకు లోబడి మాత్రమే దిగువ కోర్టులు పని చేస్తాయి. దేశ అత్యున్నత న్యాయ స్థానం ద్వారా దేశ ప్రజలకు సరైన న్యాయం లభించడం, ప్రభుత్వాల ప్రతికూల నిర్ణయాలను కట్టడి చేయడం, కేంద్ర రాష్ట్ర వివాదాలు, రాష్ట్రాల మధ్య వివాదాలు, రాష్ట్రపతి/ఉపరాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యాంగ నిబద్ధతను నిర్ణయించే అంశాలు లాంటి అంశాల్లో సుప్రీమ్‌ కోర్టు అమూల్య సేవలు చేస్తున్నది. రాజ్యాంగ అమలు బాధ్యతను సుప్రీమ్‌ కోర్టు విధిగా నిర్వహిస్తున్నది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య తలెత్తే వివాదాలకు అంతిమ తీర్పు సుప్రీమ్‌ కోర్టు ఇస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 5 కోట్లకు పైగా కేసులు పెండిరగులో ఉండగా సుప్రీమ్‌ కోర్టులో 80,000 కేసులు పెండిరగ్‌లో ఉన్నాయి. 2023లో సుప్రీమ్‌ కోర్టు 52,191 కేసుల్లో తీర్పులు (2022లో 39,800 కేసులు) ఇవ్వగా 49,191 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గత 75 ఏండ్ల సుదీర్ఘ చరిత్రలో వివాదాస్పగ తీర్పులు ఇవ్వని సుప్రీమ్‌ కోర్టు దేశ ప్రజలందరికీ సరైన న్యాయాన్ని అందించే సర్వోన్నత శిఖరంగా భాసిల్లాలని కోరుకుందాం, అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పించే సుప్రీమ్‌ న్యాయ దేవతగా నిలబడుతూ ప్రజలకు అభయ హస్తం ఇస్తున్నది. ఇదే ఒరవడిలో సాగుతూ శతాబ్ది ఉత్సవాలను చేసుకోవడానికి ముందుకు సాగుతున్న సుప్రీమ్‌ కోర్టుకు కృతజ్ఞతలు తెలియజేద్దాం.
-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *