సమైక్యతా మూర్తి మన సర్దార్‌

నేడు ‘‘సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి’’

సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖామంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ జవేరీభాయ్‌ పటేల్‌ 31 అక్టోబర్‌ 1875న నాడియాడ్‌ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, జవేర్‌భాయ్‌ పటేల్‌ దంపతులకు జన్మించారు. స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్యను ప్రారంభించి, జిల్లా ప్లీడర్‌ పరీక్షలో నెగ్గి గోద్రాలో న్యాయవాదిగా పని చేసిన పిదప ఇంగ్లాండ్‌ వెళ్లి బారిస్టరు పట్టాను పొందారు. అనంతరం 1913లో అహ్మదాబాదులో న్యాయవాద వృత్తి చేపట్టారు. తన 16వ ఏట వివాహం చేసుకొని ఒక కుమారుడు, ఒక కుమార్తెకు జన్మనిచ్చారు.

స్వాతంత్య్ర ఉద్యమాల పట్ల ఆకర్షణ:
1908లో భార్య అకాల మరణం తరువాత పిల్లల వృద్ధికి కృషి చేస్తూనే స్వాతంత్య్ర ఉద్యమాల్లో, సామాజిక అనాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. 1917-24ల మధ్య మునిసిపల్‌ కమీషనర్‌గా, 1924-28 మధ్య మునిసిపల్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనారు. గాంధీ నేతృత్వంలో సాగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడైన పటేల్‌ సహాయనిరాకరణోద్యమంలో పాల్గొనడంతో పాటు బర్దోలీ కిసాన్‌ ఉద్యమం(1928), విదేశీ వస్తు బహిష్కరణ/దహనం, ఉప్పు సత్యాగ్రహం(1930), క్విట్‌ ఇండియా(1942), మద్యనిషేధం, అస్పృశ్యత నివారణ, కులవివక్షను వ్యతిరేకించడం లాంటి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని ‘సర్దార్‌(నాయకుడు)’ అనే ప్రజా బిరుదును పొందారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1932-34, 1940-41, 1942-45ల మధ్య పలు దఫాలుగా జైలు పాలైయ్యారు. భారత జాతీయ కాంగ్రేస్‌ అధ్యక్షుడిగా మెజారిటీ సభ్యుల మద్దత్తు ఉన్నప్పటికీ గాంధీ సూచనతో తప్పుకొని నెహ్రూకు అప్పగించారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రధానమంత్రి పదవి చేపట్టవలసిన సర్దార్‌ పటేల్‌ ఎం. కె. గాంధీ కోరిక మేరకు ఉప ప్రధానిగా సేవలందించవలసి వచ్చింది. ఆ సమయంలో మెజారిటీ సభ్యుల మద్దత్తుతో తొలి ప్రధానిగా పటేల్‌ ఎంపికై ఉన్నట్లయితే నేడు సువిశాల భారత దేశ పరిస్థితి మరో విధంగా ఉండేదని అభిప్రాయపడే వారు అనేకులు నేడు భావిస్తుండం విశేషం.

హైదరాబాదు విముక్తిలో పటేల్‌ పాత్ర:
దేశం స్వాతంత్య్రం పొందిన ఆనంద సమయాన దేశ విభజన గాయాలు ఉప్పెనలా ఉబికిన గడియల్లో దేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి సర్దార్‌ పటేల్‌ నాడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 565 సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడంలో ప్రధాన పాత్రను నిర్వహించి సువిశాల భారతికి  ఎనలేని సమైక్య సేవలు అందించారు. నాటి 565 సంస్థానాల్లో కాశ్మీర్‌, హైదరాబాదు, జునాఘడ్‌ మినహా మిగిలినవన్నీ పటేల్‌ కృషితో బేషరతుగా భారతంలో అంతర్భాగం అయ్యాయి. ఈ మూడు పెద్ద సంస్థానాలను భారతంలో విలీనం చేయడానికి సర్దార్‌ పటేల్‌ తీసుకున్న సాహసోపేతమైన చర్యలు ప్రశంసనీయం. ‘భారత నడిబొడ్డున క్యాన్సర్‌ పుండు(క్యాన్సర్‌ ఇన్‌ ది బెల్లీ ఆఫ్‌ ఇండియా)’లా హైదరాబాదు సంస్థానం దేశానికి ప్రమాదకరమని భావించారు మన సర్దార్‌ పటేల్‌. నాటి హైదరాబాదు (80,000 ఘనపు మైల్స్‌) సంస్థానంలో 85 శాతం హిందువులు, 15 శాతం ముస్లిమ్‌లు ఇతర మతస్థులు ఉండగా, నిజామ్‌ ఆర్మీలో 90 శాతం ముస్లింలు ఉండేవారు. హైదరాబాదు రైల్వే స్టేషన్‌లో ‘ముస్లిమ్‌ టీ రూం’, ‘హిందూ టీ రూం’ల రూపంలో మత వివక్ష ఉండేవి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలా ఖాన్‌ కబంధ హస్తాల్లో నలుగుతున్న హైదరాబాదు సంస్థానాన్ని ముస్లిమ్‌ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నాలు చేశారు.

హైదరాబాదు సంస్థానానికి తనదైన ప్రత్యేక కరెన్సీ, రైల్వే, సైనిక బలగాలు ఉండేవి. పటేల్‌ కోరినట్లు కాకుండా నాటి నిజామ్‌ భారత్‌లో హైదరాబాదు విలీనాన్ని వ్యతిరేకించి స్వతంత్ర దేశంగా ఉండటానికి లేదా పాకిస్థాన్‌లో విలీనానికి దురాచనలు చేశారు. దీనికి తోడుగా ఓ వైపు రాక్షస రజాకార్లు (నిజాం పోలీస్‌ దళం) మతకల్లోలాలు సృష్టించడం, మరో వైపు భూస్వాముల అరాచకాలతో ప్రజల మానప్రాణాలు గాల్లో దీపాలు అయ్యాయి. రజాకార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాలు ఉవ్వెత్తున ఎగిశాయి. క్రూర ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రాక్షస రజాకార్లు హిందూ మహిళలను మానభంగం చేయడం, దోపిడీలు, హింసలు విచ్చలవిడిగా చేశారు. నిజామ్‌ తలవంచడానికి, హైదరాబాదు విమోచనకు 13 సెప్టెంబర్‌ 1947న ‘ఆపరేషన్‌ పోలో’ పేరుతో సైనిక చర్య ప్రారంభమై 108 గంటల పాటు కొనసాగి 17 అక్టోబర్‌ 1947న ముగిసింది. సైనిక చర్యను వ్యతిరేకించిన నాటి ప్రధాని నెహ్రూ అభిప్రాయాలను పక్కనపెట్టి సర్దార్‌ పటేల్‌ హైదరాబాదు విముక్తి విజేతగా నిలిచారు. నిజాం రాక్షస పాలన అంతమైంది. నాటి హిందూ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలంతా ఏకతాటి మీద నిలిస్తే ఏ ప్రభుత్వం ఏమీ చేయలేదని నమ్మే దేశ ‘‘సమైక్యతా మూర్తి పటేట్‌’’ తీసుకున్న చొరవ అనన్యసామాన్యం, అనితరసాధ్యం.

భారత రత్న, సమైక్యతా మూర్తి:
భారత రాజ్యాంగ రచనకు ఏర్పడిన కమిటీలో ముఖ్య సభ్యుడు, ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్‌, 1931 కరాచీ జాతీయ కాంగ్రేస్‌ సదస్సుకు అధ్యక్షుడిగా అమూల్య సేవలు అందించారు. నెహ్రూ మంత్రివర్గంలో దేశ తొలి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రిగా 40 మాసాలు (1947-1950) మాత్రమే సేవలందించి 15 డిసెంబర్‌ 1950న గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. దేశ సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారాలు అందించిన పటేల్‌ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1991లో ‘భారత రత్న’ బిరుదును మరణానంతరం ప్రదానం చేసింది. ‘ఉక్కు మనిషి(ఐరన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా)’గా పేరొందిన సర్దార్‌ పటేల్‌కు ‘జాతీయ సమైక్య సాధకుడు(యూనిఫైయర్‌ ఆఫ్‌ ది నేషన్‌)’గా కూడా పేరుంది.

జాతీయ సమైక్యతా దినోత్సవం (నేషనల్‌ యునిటీ డే):
21 ఏప్రిల్‌ 1947న సివిల్‌ సర్వెంట్లను ఉద్దేశించి తొలిసారి పటేల్‌ మాట్లాడిన శుభ సందర్భానికి గుర్తుగా ప్రతి ఏట 21 ఏప్రిల్‌న ‘నేషనల్‌ సివిల్‌ సర్వీసెస్‌ డే’ను పాటించుట ఆనవాయితీగా మారింది. పటేల్‌ జన్మదినం సందర్భంగా 2014 నుంచి ప్రతి ఏట ‘నేషనల్‌ యునిటీ డేట్‌’ను పాటిస్తున్నాం. సర్దార్‌ పటేల్‌ సేవలకు సరైన గుర్తింపుగా ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పొడవైన (182 మీటర్స్‌) విగ్రహాన్ని ‘సమైక్య విగ్రహం (స్టాచ్యూ ఆఫ్‌ యునిటీ)’ పేరుతో నిర్మించి 31 అక్టోబర్‌ 2018న జాతికి అంకితం చేశారు.
       ` బుమరెడ్డి
కరీంనగరం – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *