సమాజానికి ఒక బలమైన ప్రేరకంగా సాహిత్యం తోడ్పడుతున్నది. ప్రాచీనత నుండి ఆధునికత దాకా సాగిన అప్రతిహత సాహిత్య ప్రస్థానాన్ని పరిశోధించి, అనుశీలించి, విశ్లేషణాత్మకంగా తరచి చూసి ప్రామాణిక వ్యాసాల సమాహారంగా మలిచి సాహిత్య వ్యాస వల్లరి పేరుతో సంపుటిని వెంపరాల వేంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి హృద్యంగా అందించారు. ప్రాచీన సాహిత్యంలోని  నైతికతను, పారమార్థికతను, ఆధునిక సాహిత్యంలోని మానవీయ విలువలను, సామాజిక స్పృహను బీ  ప్రాపంచిక దృక్పధాల్ని, జీవన  కోణాలను  తడిమి ఉన్నతమైన సారాన్ని అందించిన ఈ వ్యాసాలు  మంచి విశ్లేషణా స్థాయిని కలిగి భావి పరిశోధకులకు, విద్యార్థులకు  మార్గదర్శకంగా  నిలుస్తాయనడంలో సందేహం లేదు.


ఎంతో జిజ్ఞాసతో, పరిశోధనాత్మకమైన కృషితో, వీలైనంత క్లుప్తంగా, అత్యంత సరళంగా, సందర్భోచితాలతో కలగలిపి  రాసిన 15 వ్యాసాలు ఈ సంపుటిలో  ఉన్నాయి. రచయిత దశాబ్ద కాలంగా వివిధ పత్రికలలో ప్రచురించిన, సాహిత్య సదస్సుల కోసం చేసిన ప్రసంగాలు,  సమర్పించిన పత్రాలను క్రోడీకరించి ఈ వ్యాసాలను పాఠక లోకానికి అందించారు. స్నాతకోతర విద్యను అభ్యసించే విద్యార్థులను దృష్టిలో  ఉంచుకుని తక్కువ  సమయంలో వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అందిస్తూ ఈ సంపుటిని సాహిత్యాభిమానుల ఆసక్తి  కోసం కూడా రూపొందించానని రచయిత వెల్లడిరచారు. విభిన్నమైన సాహిత్యాన్ని పాఠకుల ముందుకు వ్యాస రూపంలో తీసుకెళ్లడమే  లక్ష్యంగా  ఈ ప్రయత్నాన్ని రచయిత చేశాడు.


 ఇందులోని  తొలి వ్యాసం నన్నయ కవితారీతులు. నన్నయ కవిత్వాన్ని పరిచయం చేసి అతని రచనా స్వతంత్రత, శైలి వంటి అంశాలను విశ్లేషించారు. నన్నయ పద్యాల్లోని పద సుమాల పోహళింపుతో ఆయన సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువచేసే ఉద్దేశ్యం ఈ వ్యాసాంలో కనిపించింది. సోమన కవితాగుణాలు: జనార్థనుడి రాయబారం అన్న రెండవ వ్యాసంలో కవి పరిచయం,  కాల నిర్ణయం తెలిపి ఆయన ఉన్నతోన్నత రచన ఉత్తర హరి వంశ కావ్య ప్రత్యేకతను విశ్లేషించి చూపారు. ఆశ్వాసాంత గద్య వివరణను ఇచ్చి, సాహిత్య రస పోషణను ఎలా పాటించారో  తెలిపారు. సాహిత్య  సంవిధాన చక్రవర్తిగా, నవీన గుణసనాధునిగా సోమన కవితా చమత్కార ప్రత్యేకతలను వివరించారు. జనార్థనుడి రాయబారం మూలకథ ప్రత్యేకతను వివరించారు. హంసడిభకులకు సంబంధించిన  హితబోధను ప్రస్తావిస్తూ సోమన వీర రసవర్ణనను గొప్పగా విశ్లేషించారు. ఇక మూడవ వ్యాసం ముక్కు తిమ్మన ముద్దు పలుకులో పారిజాతాపహరణ ప్రబంధకర్తగా, శ్రీకృష్ణ దేవరాయల భార్య తిరుమలదేవి తరపున వచ్చిన అరణపు కవిగా ప్రతీతి చెందిన ముక్కు తిమ్మనార్యుని ప్రబంధ కథా నైపుణ్య నేపథ్యాన్ని  వివరించారు. తిమ్మనార్యుడు చేసిన సాయంకాల, సంధ్యా కాల, అంధకార, పూర్ణ చంద్రోదయ వర్ణనలలోని వైశిష్ట్యాన్ని, రచనా విలక్షణతను సునిశిత దృష్టితో విశ్లేషించారు. తిమ్మనార్యుని ముద్దు పలుకు విలక్షణతను తెలియజెప్పారు. తిమ్మన ప్రతిభాపాటవం, అభివ్యక్తి విధానం, ప్రబంధశైలి, శైలీ సౌకుమార్యం, ముద్దులొలికే మాటల మాటున సులభ గ్రాహ్యమైన పదాల వినియోగం వంటి అంశాలను ఈ వ్యాసంలో సవివరంగా పేర్కొన్నారు.


 సాహితీ జగత్తులో విశిష్ట స్థానం సంపాదించుకున్న నృత్య, సంగీత, గాన ప్రదర్శనా యోగ్యమైన అనాథి కళారూపం యక్షగానం. ఈ సంపుటిలోని నాలుగవ వ్యాసం యక్షగానం – తెలంగాణం ఆ కళారూపం గూర్చి సవివరమైన అంశాలను ఈ వ్యాసం ద్వారా  రచయిత అందించారు. కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వులు/  గాంధర్వమున యక్షగాన సరణి అని క్రీ.శ 1430 ప్రాంతంలోనే  శ్రీనాధుడు తన భీమేశ్వర  పురాణ కావ్యంలో దక్షారామ ప్రశంస సందర్భంలో యక్షగాన ప్రస్తావన చేసిన తీరును, కాళిదాసు మేఘ సందేశంలో యక్షుల నృత్య గీతిని యస్యాం యక్షా:  పితమణి మయాన్యేత్య హర్మ్య స్థలాన్ని అన్న శ్లోకంలో చెప్పిన రీతిని, ఆ కళారూప ప్రారంభ వికాసాలను రచయిత ఎంతో చక్కగా వివరించారు. ఆంధ్ర వాజ్ఞయంతో పాటు పాల్కురికి సోమనాధుని (క్రీ.శ 1280 – 1340 ప్రాంతం) పండితారాధ్య చరిత్ర పర్వత  ప్రకరణంలో యక్షుల ప్రస్థావనలను తెలిపారు. జక్కుల పాట – కొరవంజి గానం ప్రత్యేకత తెలిపి క్రీ.శ 15వ శతాబ్దిలో ప్రోలుగంటి చెన్నశౌరి రాసిన సౌరభ చరితము అన్న మొదటి యక్షగానం గురించి సవివరంగా రాశారు. క్రీ.శ 1780లో శేషాచల కవి ధర్మపురి రామాయణం, రాపాక శ్రీరామకవి ఆధ్యాత్మిక రామాయణాలను మొదటి తెలంగాణ యక్షగానాలుగా చూపారు. శ్రవ్య, దృశ్య యక్ష గానాలు వాటి లక్షణాలు, వైశిష్ట్యాలు, వస్తు వైవిధ్యం, ఛందో భాషా వికాసాలను వివరించి ఆ కళ లోకవృత్త ప్రదర్శనమై దేశి నాటక కళా ప్రాతినిధ్యంగా స్థిర పడిరదని తెలిపారు.      


 విమర్శ  స్వరూప స్వభావాలు అన్న ఐదవ వ్యాసంలో రచనలోని గుణదోష సౌందర్య వివేచనగా విమర్శను నిర్వచిస్తూ అది సదసద్వివివేకం అన్నారు. సాహిత్య గ్రంథాలను పరిశీలించి గుణగణాలను సహేతుకంగా వివేచించి నిరూపించడం ద్వారా సాహిత్య  విమర్శ ప్రామాణిక ప్రక్రియగా ఎలా స్థిరపడిరదో చెప్పారు. విమర్శ నిర్వచనాలు, విమర్శకుని లక్షణాలు,  విమర్శ ప్రయోజనం, విమర్శ ఆరంభ వికాసాలు, ప్రాచీన  అలంకారికుల, తెలుగు కవుల విమర్శా  దృక్పథాలను సోదాహరణంగా వివరించారు. ఆరవ వ్యాసం చొక్కనాథ చరిత్ర :  కావ్య శిల్పంలో ఇతివృత్తం, కథాకథన శిల్పం, పాత్ర చిత్రణ, వర్ణనలు, శైలి వంటి అంశాలను లోతైన దృష్టితో విశ్లేషించి చూపారు. చొక్కనాథ చరిత్రంలోని ప్రధానమైన ఆఖ్యాన శైలిని వివరించారు. పచ్చ కప్పురపు తిరువేంగళరాజుకు కావ్య పరిజ్ఞానమే కాకుండా స్వప్న, సాముధ్రిక, సంగీత, యోగాది విషయాలలో ఉన్న బహుముఖ ప్రజ్ఞను చొక్కనాథ చరిత్ర ఆధారంగా విశ్లేషించి చూపారు. ఏడవ వ్యాసం ప్రతాప రుద్రీయము  ప్రధాన పాత్రలు. ఈ నాటకాన్ని వేదం వెంకటరాయశాస్త్రి రచించిన తీరును వివరిస్తూ భిన్న వృత్తాంతానికి నాటక రూపాన్ని ఇచ్చినట్టు  చెప్పారు. ప్రతాపరుద్రుడు ఢల్లీి సుల్తాన్కు పట్టుబడిన విషయం తెలిసి యుగంధరుడు బంధ విముక్తుడిని చేయడం, ఢల్లీి సుల్తాన్ను బందీగా ఓరుగల్లుకు తీసుకొని రావడం, అతనితో సంధి కుదుర్చుకొని వదిలిపెట్టిన కథాంశాన్ని వివరిస్తూనే ఇతివృత్తం, సన్నివేశ కల్పన, సంభాషణా నైపుణ్యం, పాత్ర చిత్రణ సామర్థ్యం వంటి అంశాలలో వేంకటరాయ శాస్త్రి మహా నిపుణతను వెల్లడిరచారు.          


 ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య జరిగిన అంతర్యుద్ధమే కొలకలూరి ఇనాక్‌ రచించిన నవల రంధి. ఈ నవల   ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఎనమిదవ వ్యాసం రంధి నవలలో కథానాయక  పాత్ర ఈ సంపుటిలో ఉంది. స్త్రీ విద్య అవసరాన్ని, స్త్రీ స్వాతంత్య్రం యొక్క లక్ష్యాన్ని, రచయిత దృష్టి కోణాన్ని జాగ్రత్తగా వెల్లడిరచారు. తొమ్మిదొవ వ్యాసం కాళిదాసు మేఘ సందేశం. ప్రారంభ ఘట్టంలో కవి ప్రతిభను విద్వత్సమాజం గుర్తించిన తీరును ఉదాహరణలతో ఉదహరిస్తూ తెలిపారు. పదవ వ్యాసం మరపు రాని మనీషి తిరుమల రామచంద్ర. ఇందులో సాహితీమూర్తి, పరిశోధనల దీప్తిగా పేరొందిన తిరుమల రామచంద్ర చేసిన మహనీయమైన  కృషి ఒక తరానికే కాదు రాబోయే తరాలకు కూడా జ్ఞాన సుగంధాన్ని అందిస్తుందని తెలిపారు. బహుముఖమైన  రామచంద్ర కృషిని ఆయన రాసిన రచనల ఆధారంగా నిరూపించారు. 11వ వ్యాసం త్యాగరాజ జగదానంద తారక కృతి :  రామాయణ తత్త్వం.  పరమ ధర్మాన్ని బోధించే ఉపనిషత్తుల వంటి కీర్తనలను, విజ్ఞానాన్ని నూరిపోసి నడిపించే ఆధ్యాత్మిక  ప్రవాహాలుగా విశ్లేషించారు. భక్తి, ముక్తి, శక్తితో కూడిన త్యాగరాజ స్వామి కృతులన్నీ మహాకావ్యాలేనని చెప్పారు. ఆలోచనాత్మకమైన 12వ వ్యాసం తాపీ ధర్మారావు రచనలు : ఒక సమీక్ష. ప్రశ్నలు, సమాధానాలు సహేతుకంగా ఉంటేనే సత్యం ఆవిష్కృతమవుతుందని  చెప్పారు. అడిగే వాడు జ్ఞానాన్ని ఆదెరువు అని చెప్పగలిగినవాడే గొప్పవాడు అని పేర్కొన్నారు. భాషా పరంగా, భావాల పరంగా తాపీ ధర్మారావు రచనలు ఒక ఉద్దేశంతో వినూత్నంగా ఉంటాయని వెల్లడిరచారు. 13వ వ్యాసం విశ్వనాథ సాహిత్య దర్శనం : సంక్షిప్త పరిచయంలో ఒక అపురూపమైన కవితాశిల్పం కలిగిన గొప్పతనంగా విశ్వనాథను చూపారు. మనిషి వివేకం, విచక్షణా జ్ఞానం కలిగి ఉంటే పురోగమనమే అవుతుందని విశ్వనాథ ఆకాంక్షించారు.

వేయి పడగలు నవల సాహిత్యంలో వెలుగొందడాన్ని ఓ విశేషంగా చూపారు. విశ్వనాథ కథలను మానవీయ సంబంధాలతో వివిధ చిత్త వృత్తుల, విలువలో మాణిక్యాలుగా చూపారు. నర్తనశాల, అనార్కలి, వేనరాజు నాటకాలను విశ్వనాథ ప్రత్యేకతకు తలమానికాలుగా ఈ వ్యాసంలో నిలిపారు. తెలుగు సాహిత్యంలో దేశభక్తి అన్నది పధ్నాల్గవ వ్యాసం. దేశమంటే ఒక సమూహమని దేశభక్తి వాదం, నా దేశం నా ప్రజలు అనే భావన సర్వత్రా సంతరించుకోవాలని ఆకాంక్షించారు. చిలకమర్తి భరత ఖండంబు పద్యంతో పాటు మాకొద్దీ తెల్ల దొరతనం, దండాలు దండాలు భారతమాత వంటి వాటిని ఉదాహరించి చూపారు. కొడవటిగంటి వ్యాసాలు.. సంక్షిప్త సమాలోచన అన్న శీర్షికతో  పదిహేనొవ వ్యాసం ఒక సంపూర్ణ సాహిత్య కృషిని అత్యద్భుతంగా  ఆవిష్కరించింది. కొడవటిగంటి వ్యాసాలలోని అనేక అనుభూతులు, ఆలోచనలు, సమాజ హితాన్ని కోరుకుంటూ నిద్రాణమైన జాతిని జాగృతం చేసే శక్తిని ఎలా కలిగి ఎదిగి తెలిపారు. సామాజిక దృక్పథంతో సాగిన కొడవటిగంటి రచనల్లోంచి తప్పక స్వీకరించవలసిన ఆదర్శాలను వివరణాత్మకంగా వెల్లడిరచారు. మనిషి తనకు లభ్యమైన భౌతిక జ్ఞానాన్ని, సమాజ జ్ఞానాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే జీవితం ఎలా పరిపూర్ణమై వికసిస్తుందో తెలిపారు. సాహిత్యంలో జీవిత విశ్లేషణ ఉంటుందన్న సంపూర్ణ స్పష్టతను ఎంతో జాగ్రత్తగా వివరించి చెప్పారు.  భిన్న రచయితల రచనా వైవిధ్యాలను ఎంతో లోతైన విశ్లేషణతో ఈ వ్యాసాలు అందించాయి.  అద్భుతమైన సాహిత్యాంశాలను ఒకచోట రాశులుగా పోసి  అందించిన వ్యాస రత్నాలివి.
             – డా.తిరునగరి శ్రీనివాస్‌
                       8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *