వొచ్చే ఎన్నికలకు ‘ఆవిర్భావ దినోత్సవం’ టర్నింగ్‌పాయింట్‌

 ‘‘అన్నిటికన్నా ఇక్కడ విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్రం తన సొంత• నిధులతో నిర్వహించడం. ఇంతవకరు ఏ రాష్ట్రంలో కూడా కేంద్రం స్యయంగా ఆ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించిన దాఖలాలు లేవు.  గత సంవత్సరం కూడా దేశరాజధాని దిల్లీలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించిన విషయం తెలియందికాదు. ఇప్పటికే సెప్టెంబర్‌ 17 ‌విమోచన దినంపైన ప్రతీ ఏటా ఆందోళనలు చేపడుతున్న బిజెపి, పోటీ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. నిజంగానే రాష్ట్ర ఉత్సవాలను కూడా కేంద్రం నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ పాలసీ అయితే పక్క రాష్ట్రమైన ఏపీకూడా అదే రోజున కొత్త్త రాష్ట్రంగా ఆవిర్భవించింది కదా..! కేంద్రం ఆ రాష్ట్రంలో ఎందుకు ఉత్సవాన్ని నిర్వహించడంలేదన్నది ప్రశ్న.’’

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్ర రాజకీయ పార్టీలన్నిటికీ ఒక టర్నింగ్‌ ‌పాయింట్‌ ‌కాబోతున్నది. తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించి రానున్న జూన్‌ 2‌వ తేదీకి సరిగ్గా తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకుని పదవఏటికి కాలిడబోతన్నది. ఏడాదికి ముందునుండే దశాబ్ధి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ప్రధాన రాజకీయ పార్టీలుకూడా వేడుకల రంగాన్ని సిద్ధం చేస్తున్నాయి. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రానున్న క్రమంలో ఈ వేడుకలను తమ రాజకీయ లబ్ధికి వినియోగించుకునే పథక రచన చేస్తున్నాయి ఆయా పార్టీలు. 57 ఏండ్ల గోసకు  నేటికి సరిగ్గా తొమ్మిదేళ్ళకింద తెరపడింది. అనేక పోరాటాలు, బలిదానాల తర్వాత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 1956 నవంబర్‌ ఒకటిన భాషా ప్రయుక్త రాష్ట్రాలపేరున అప్పటికే ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో మద్రాసునుండి విడిపోయిన ఆంధ్ర ప్రాంతాన్ని కలిపినప్పటి నుండి ఇక్కడ పోరాటం ప్రారంభమైంది. అప్పటినుండి 2014 వరకు తెలంగాణ ప్రజలు తమ ఆత్మాభిమానంకోసం అనేకానేక పోరాటాలు చేశారు. పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆత్మాహుతి చేసుకున్నారు. స్వతంత్ర పోరాటంలో తుపాకి గుండ్లకు గుండెలు ఎదురొడ్డినట్లు, వేగంగా వొచ్చే   రైళ్ళకు ఎదురుగా నిలబడి బలిదానాలు చేయడం ద్వారా తమ ఆకాంక్షను తెలియజేశారు. తెలంగాణ సమాజమంతా ఒకటై నిలవడంతో  అధికార, విపక్ష పార్టీలకు ప్రజాభిష్టానికి తలవంచక తప్పలేదు. ఇగో.. అలా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి మరింత ఘనంగా జరుపుకోవాలని అధికార బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం  తన యంత్రాంగాన్ని ఆదేశించింది. వాస్తవంగా వొచ్చే జూన్‌ 2‌వ తేదీకి సరిగ్గా తొమ్మిదేళ్ళు నిండుతున్నా దవాబ్ధి ఉత్సవాల పేరున ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. గ్రామ, మండల స్థాయి మొదలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ వేడుకలను న భూతో న భవిష్యత్‌ అన్నట్లుగా ఉండాలని సూచించింది. ఇందుకుగాను తాజాగా ముప్పైమూడు జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్స వాలకు ఆర్థిక వెసులుబాటు కోసం ప్రతీ జిల్లాకు 105 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందంటేనే ఇరవై ఒక్క రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించబోతున్నారన్నది అర్థమవుతున్నది.
ఇదిలా ఉంటే ఉద్యోగులకు, పెన్షనర్లకు సకాలంలో నిధులను మంజూరుచేయలేక, దళిత బంధు, రైతుల రుణమాఫీ చేయలేకపోతున్న ప్రభుత్వం ఉత్సవాల పేరిట వందలాదికోట్ల రూపాయలను మంచినీళ్ళ ప్రాయంగా వెచ్చించడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. అంత మాత్రాన విపక్షాలేవీ ఉత్సవాలకు దూరంగా ఉంటున్నాయా అంటే ఎవరిగోల వారిదన్నట్లు అదేరోజు (జూన్‌ 2)‌ను తమ ఎన్నికల క్యాంపెయిన్‌గా వాడుకునే ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఈసారి భారీస్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నదని ఒకపక్క ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఆదేరోజు నుండి ప్రజల మధ్యకు వెళ్ళేందుకు ఆయా పార్టీలు తమ కార్యక్రమాకు శ్రీకారం చుడుతున్నాయి. అధికార బిఆర్‌ఎస్‌ ‌పార్టీ 21 రోజుల పాటు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు ధీటుగా  కాంగ్రెస్‌ ‌కూడా ఆ రోజునుండి 20 రోజుల పాటు భిన్న కార్యక్రమాలతో ప్రజాసమూహాల్లోకి వెళ్ళి గత తొమ్మిదిఏళ్ళుగా బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేపడుతున్న అవినీతి, అక్రమాలను ఏకరువు పెట్టే కార్యక్రమాల రూపకల్పనలో తలమునకలవుతోంది. ఈ సందర్భంగా ప్రతీ పల్లెటూరులో కాంగ్రెస్‌ అభిమానులు, కార్యకర్తల ఇండ్ల మీద కాంగ్రెస్‌ ‌జంఢాలను రెపరెపలాడించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులను ఆ పార్టీ రాష్ట్ర అధినేత సూచించారు.. తాను నష్టపోతానని తెలిసికూడా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు అత్యంత సాహాసోపేత నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీకి ఊరూరా పాలభిషేకం చేయాలని ఆ పార్టీ సూచించింది. కార్యక్రమాల అభిర్భావ సభకు సోనియాగాంధీతోపాటు, సమీప కర్ణాటక రాష్ట్రంలో అత్యంత మెజార్టీతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని నెలకొల్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ద  రామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ను ఆ పార్టీ ఆహ్వానించబోతున్నది.

కాగా భారతీయ జనతాపార్టీ కూడా తానేమీ తక్కువ కాదనట్లుగా అదే రోజున రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మొదటినుండి గోలకొండ కోటపైన కాషాయ జంఢాను ఎగువేస్తామని చెబుతున్న బిజెపి ఈసారిమాత్రం గోలకొండకోట పైన రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జాతీయ జంఢాను ఎగురవేయాలని నిశ్చయించింది. విచిత్రమేమంటే ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  నిర్వహించాలనుకోవడం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఇక్కడి ఏర్పాట్లను చూడాల్సిందిగా కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తున్నది. అన్నిటికన్నా ఇక్కడ విచిత్రకర విషయమేమంటే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కేంద్రం తన సొంత• నిధులతో నిర్వహించడం. ఇంతవకరు ఏ రాష్ట్రంలో కూడా కేంద్రం స్యయంగా ఆ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిర్వహించిన దాఖలాలు లేవు.  గత సంవత్సరం కూడా దేశరాజధాని దిల్లీలో  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించిన విషయం తెలియందికాదు. ఇప్పటికే సెప్టెంబర్‌ 17 ‌విమోచన దినంపైన ప్రతీ ఏటా ఆందోళనలు చేపడుతున్న బిజెపి, పోటీ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. నిజంగానే రాష్ట్ర ఉత్సవాలను కూడా కేంద్రం నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ పాలసీ అయితే పక్క రాష్ట్రమైన ఏపీకూడా అదే రోజున కొత్త్త రాష్ట్రంగా ఆవిర్భవించింది కదా..! కేంద్రం ఆ రాష్ట్రంలో ఎందుకు ఉత్సవాన్ని నిర్వహించడంలేదన్నది ప్రశ్న. ఈ ఉత్సవాలకు కేంద్ర హాంశాఖ మంత్రి అమిత్‌షాను ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్న నిర్వాహకులు ఆ రోజున కేంద్ర పారామిలటరీ బలగాలతో కవాతు నిర్వహించబోవటం మరో వింత. మొత్తానికి రానున్న ఎన్నిక)ను దృష్టిలో పెట్టుకుని జూన్‌ 2‌న చేసే పోటాపోటీ ప్రచారాలు తమకు టర్నింగ్‌ ‌పాయింట్‌ అవుతుందని ఉత్సాహపడుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *