నిరంకుశ నైజాం ను ఆదర్శంగా చేసుకొని రాజరికపు పాలన సాగించిన గులాబీలు ఒకానొక దశలో వారిని మించిపోయి ప్రవర్తించిన విధానాన్ని గమనిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజలు వోటు అనే ఆయుధం ద్వారా దిమ్మతిరిగే ఫలితాలను ఇచ్చారు. చలోక్తులు, ఆగ్రహ వేషాలు, సెటైర్లతో సాగే కెసిఆర్ ఎన్నికల ప్రచార ప్రసంగాలు ఈసారి వేడుకోలు ప్రసంగాలుగా సాగాయి. ఆయన పదేపదే చెప్పినట్టుగానే ప్రజలు ఆలోచించి వోట్లు వేసి తగిన గుణపాఠం చెప్పారు. ఎంతోమంది నియంతలను కాలగర్భంలో కలిపిన విధంగా తెలంగాణ సాధించామని గొప్పలు చెప్పుకున్న ఉద్యమ పార్టీని ప్రజలు గద్దె దించిన విధానం ఆసక్తికరంగా కనిపిస్తుంది. సబ్బండ వర్గాలు కొట్లాడి సంపాదించుకున్న తెలంగాణ ఘనత మొత్తాన్ని తన ఖాతాలో వేసుకొని చరిత్రనే వక్రీకరించడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ కుటుంబానికి తగిన గుణపాఠం లభించింది.పాలించిన రెండు సార్లు ప్రజలు స్పష్టమైన ఆధిక్యత ఇచ్చినప్పటికీ, తెలంగాణ పునర్నిర్మాణం కోసం పాటుపడకుండా ప్రతిపక్ష పార్టీలను అస్థిరపరచడానికి, ప్రశ్నించే గొంతులను అణిచివేసిన దానికి పరాకాష్టంగానే ఈ ఎన్నికల ఫలితాలను చూడవచ్చు. దశాబ్ద పాలన అవలోకనం చేస్తే అడుగడుగునా నిత్య నిర్బంధాలు, అహంకారపూరితమైన, ఫ్యూడల్ పాలన విధానాలే కనిపిస్తాయి. పూర్వ పాలనలో కంటే అద్వానంగా ప్రవర్తించడం, యదేచ్చగా వనరుల విధ్వంసం చేసి పాలన మొత్తం దోచుకొని దాచుకోవడంలోనే సాగింది. స్వేచ్ఛ, స్వతంత్రాలు లేకపోవడం, ప్రజలు ప్రజాస్వామికంగా నిరసన ప్రదర్శనలు చేసే ‘‘ధర్నా చౌక్’’ ను ఎత్తివేసి నియంతలను మరిపించారు. ప్రజలకు కాదు కదా ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా దొరకకపోవడం, అధికారం మొత్తం కుటుంబం చేతిలో కేంద్రీకృతం కావడం మిగతా వారందరూ డమ్మీలుగా మిగిలిపోవడం. పాలన పారదర్శకంగా ఉంటుందని, అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తానని అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు కేసీఆర్ చెప్పిన మాటలు ఆ తదనంతరం అందుకు విరుద్ధంగా చేసారు. ఆయన మాటలు నమ్మిన చాలా మంది ఉద్యమ నాయకులు, మేధావి వర్గం, ఆయా రంగాలలో అభివృద్ధి, స్వయం ప్రతిపత్తి సాధించడానికి ఎన్నో బ్లూ ప్రింట్లను అందించగా అవన్నీ బుట్ట దాఖలయ్యాయియ్య.
సచివాలయ ముఖమే చూడని ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డ్ సృష్టించాడు. కొడుకు, బిడ్డ, అల్లుళ్ళదే రాజ్యం అయిపోయి ఆఖరికి వాళ్లు కూడా ఎమ్మెల్యేలకు, మంత్రులకు దొరకకపోవడం చివరికి పీఏలకు, డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి వారి సమాచారం తెలుసుకొని కలువాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు దాపరించాయి. 17వేల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి ఆడంబరాలకు మాత్రమే పరిమితమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష కోట్ల రూపాయలు నీళ్ళపాలు కావడాన్ని ప్రజలు సహించలేకపోయారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న దానితోపాటు, పూర్వ ఎన్నికల హామీలను తుంగలో తొక్కి గొర్లు, బర్లకు పరిమితం చేశారు. నిరుద్యోగుల ఊసే లేదు, నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి పేపర్లను లీక్ చేసి ఏ ఒక్క నియామకాన్ని సక్రమంగా చేయలేదు. రెండుసార్లు పాలించిన వాళ్లపై సహజంగానే వ్యతిరేకత ఉంటుంది, కానీ వీరిపై వచ్చినంత వ్యతిరేకత ఇంతకుముందు ఎవరిపై రాలేదు. ఈ ఎన్నికలలో భారీగా వోట్లను, సీట్లను పెంచుకున్న భారతీయ జనతా పార్టీ అందరూ అనుకున్న విధంగానే ప్రభుత్వ వ్యతిరేక వోట్లను చీల్చి పరోక్షంగా ఇరవై సీట్లు ఎక్కువ రావడానికి దోహదం చేసింది. కాంగ్రెస్ పదే పదే చెప్పినట్టుగానే బిజెపి వోట్లను చీల్చి బిఆర్‌ఏస్ కు గౌరవప్రదమైన సీట్లు రావడానికి దోహదం చేసిందని చెప్పక తప్పదు.
బంతిని ఎంత బలంగా కొడితే అది అంత బలంగా లేస్తుంది అన్న నానుడి నిలువెత్తు నిదర్శనంలా రేవంత్ రెడ్డి ఉదంతం నిలుస్తుంది. గత ఎన్నికలలో ఆయనను అధికార బలాన్ని ఉపయోగించి కొడంగల్ లో ఓడగొట్టిన వారికి ఈ ఎన్నికలలో ఆయన ముచ్చమటలు పట్టించారు. ఎన్నికల ప్రక్రియ మొదలు ఫలితాలు వెల్లడి దాకా రేవంత్ రెడ్డి జైత్రయాత్ర కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేసిందని చెప్పాలి. మలిదశ ఉద్యమం సాగిన విధంగా గులాబీలను గద్దె దించడానికి కాంగ్రెస్ పార్టీ కంటే సోషల్ మీడియా మరియు పాలమూరు అధ్యయన వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, తెలంగాణ హమాలీ కార్మిక సంఘం, తెలంగాణ భూనిర్వాసితుల సంఘం, గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే బాధితుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, చైతన్య మహిళా సంఘం, తెలంగాణ రైతాంగ సమితి, రైల్వే జేఏసీ, సంచార జాతుల సమాఖ్య లాంటి రాష్ట్ర స్థాయి సంఘాలతో పాటు అనేక స్థానిక ప్రజా సంఘాలు, ప్రొఫెసర్ హరగోపాల్ కన్వీనర్ గా ఉన్న తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీతో కలిసి పని చేశాయి. తెలంగాణ సమైక్య, జాగో తెలంగాణ, ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, భారత్ బచావో, భారత్ జోడో అభియాన్ లాంటి సంస్థలతో కలిసి టీపి జేఏసీ విస్తృతంగా పనిచేసింది. రేపటి నుండి టీపిజేఏసీ ప్రజల ఆకాంక్షల కోసం పాటుపడవలసిన అవసరం ఉంది.
-పబ్బు శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్టు, 9441331288




