మన దేశ జనాభా 143 కోట్లుగా నమోదు అయ్యింది. ‘యువ’భారతంలో 66 శాతం (అనగా 80.8 కోట్లు) జనాభా 35 ఏండ్ల లోపు ఉన్నారని, 18 – 35 మధ్య వయస్సు ఉన్న యువత 60 కోట్లు, 25 ఏండ్ల లోపు యువత/పిల్లలు 50 శాతానికి పైగా ఉన్నారని తెలుస్తున్నది. 15 – 29 వయస్సు కలిగిన జనాభాను యువత అని పిలవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచ మానవాళి సగ టు వయస్సు 31.0 ఏండ్లు ఉండగా, భారత జనాభా సగటు వయస్సు 29.5 ఏండ్లు ఉండడంతో మన దేశాన్ని ‘యువభారతం’ అని పిలుస్తున్నది ప్రపంచ మానవాళి. ప్రపంచ దేశాల్లో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తున్న విషయం మనకు ప్రధాన బలం కావాలి. 2024 అంచనాల ప్రకారం మొనాకో దేశ జనాభా సగటు వయస్సు 56.2 ఏళ్లు, జపాన్ 49.5, ఇటలీ 48.1, జర్మనీ 46.7, ఫ్రాన్స్ 42.4, యూకె 40.6, అమెరికా 38.8 నమోదు కాగా అతి తక్కువ సగటు వయస్సు ఉన్న దేశాలుగా 15.1తో నైగర్, 15.5తో ఉగాండా ఉన్నాయి.
భారత్‌లో ఉద్యోగ ఉపాధుల సంక్షోభం
యువత అధికంగా ఉన్న యువ భారతాన్ని ఉద్యోగ ఉపాధుల సమస్య వెంటాడుతున్నది. ఇటీవల విడుదలైన ‘భారత ఉద్యోగ/ఉపాధి నివేదిక – 2024 (ఇండియా ఎంప్రాయిమెంట్ రిపోర్ట్ – 2024)’ పలు నిరుద్యోగ అంశాలను బహిర్గతం చేసింది. ‘‘అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ)’’, ‘‘మానవ అభివృద్ధి విభాగం (ఐహెచ్‌డి)‘‘ సంయుక్తంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం యువ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ విద్యార్హతలకు తగిన అత్యాధునిక నైపుణ్యాలు కొరవడడంతో ఉద్యోగ ఉపాధులకు దూరం అవుతున్నట్లు తెలిపింది. సెకండరీ/ఉన్నత విద్యార్హతల నిరుద్యోగ యువత 2000లో 35.2 శాతం ఉండగా 2022లో 65.7 శాతం వరకు పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో సెకండరీ/ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత నిరుద్యోగ రేటు 6 రెట్లు, డిగ్రీ ఆ పైన విద్యార్హతలు కలిగిన యువత నిరుద్యోగ రేటు 9 రెట్లు పెరగడం గమనించారు.
జపాన్‌లో వృద్ధుల జనాభా అధికం
అభివృద్ధి చెందిన జపాన్ ప్రస్తుత జనాభా 12.3 కోట్లు ఉన్నది. జపాన్ ప్రజల సగటు వయస్సు 46.7 ఏండ్లుగా నమోదు కావడంతో అక్కడ యువత జనాభా చాలా తక్కువగా ఉన్నట్లు అర్థం అవుతున్నది. ప్రతి 10 జపనీయుల్లో ఒకరు 80 ఏండ్లు దాటిన వారే ఉన్నారు. జపాన్‌లో 15 ఏండ్ల లోపు వారు 11.98 శాతం, 15 – 64 ఏండ్ల జనాభా 59.32 శాతం ఉన్నారు. జపాన్ జనాభాలో 65 ఏండ్లు దాటిన వృద్ధుల జనాభా దాదాపు మూడవ వంతు 3.6 కోట్లు (28.70 శాతం) ఉన్నది. జపాన్‌లో వృద్ధుల జనాభా పెరగడంతో పాటు ఆ దేశపు జనాభా వేగంగా తగ్గడం ప్రమాద హెచ్చరికగా పేర్కొంటున్నారు. జపాన్ జననాల రేటు తీవ్రంగా తగ్గడం, మరణాల రేటు రెట్టింపు కావడంతో జపాన్ అదృశ్యం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని ఆ దేశ ప్రధాని సహితం పేర్కొనడం పరిస్థితి గంభీరతను వెల్లడిస్తున్నది. 2022లో జపాన్‌లో జననాలు 8 లక్షలు ఉండగా మరణాలు 15.8 లక్షలు నమోదు కావడం గమనించారు.
జపాన్ చూపు యుభారత్ వైపు..
జపాన్‌లో యువ జనాభా తగ్గడం, వృద్ధుల జనాభా పెరగడంతో వివిధ ఉద్యోగ ఉపాధుల నిమిత్తం అవసరమయ్యే నైపుణ్య యువత కోసం భారత్ వైపు చూడడం క్రమంగా పెరుగుతోంది. యువ జనాభా అధికంగా ఉన్న భారత్‌కు చెందిన నైపుణ్య యువతకు జపాన్, యూఎస్ లాంటి పాశ్చాత్య దేశాల్లో గిరాకీ పెరుగుతున్నది. గత మూడు దశాబ్దాల్లో జపాన్ ఉద్యోగ/శ్రామిక వర్గ జనాభా 15 శాతం కుంచించుకా పోవడంతో నేడు భారత్‌కు చెందిన ఇంజనీర్లు, డాక్టర్లు, టెక్నోక్రాట్లకు గిరాకీ పెరుగుతున్నది. జపాన్ సుజీకీ ఫాక్టరీలో మాత్రమే 400లకు పైగా భారత ఇంజనీర్లు పని చేస్తున్నారు. వీరితో పాటు జపాన్‌లో వైద్యులు, డ్రైవర్స్, గృహ నిర్మాణ వర్కర్స్ కొరత తీవ్రంగా ఉన్నది. జపాన్‌లో పని చేసే వయస్సు కలిగిన జనాభా తగ్గడంతో రిటైర్మెంట్ వయస్సుతో పాటు ఓవర్ టైమ్ సౌకర్యం కూడా పెంచడం జరుగుతున్నది. జపాన్‌లో డ్రైవర్ల సగటు వయస్సు 59 ఏండ్లు, నిర్మాణ రంగంలో 25 శాతం జపనీయుల వయస్సు 60 దాటడం, వ్యాపార వర్గాలు 70 ఏండ్లు దాటిన వృద్ధులు కూడా పని చేయడం గమనిస్తున్నాం. కొన్ని నిర్థారిత నైపుణ్యాలు కలిగిన ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు 5 ఏండ్ల పాటు జపాన్‌లో పని చేయడానికి అవకాశం కలిపించారు. ఉన్నత విద్య, అత్యున్నత నైపుణ్యాలు కలిగినవిదేశీ యువతకు శాశ్వత నివాసం కూడా కల్పిస్తున్నారు. పర్యాటక, ఉపాధ్యాయ, అధ్యాపక రంగాల్లో కూడా భారతీయులకు జపాన్‌లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.జపాన్, యూఎస్, ఆస్ట్రేలియా లాంటి పలు దేశాల్లో ఉద్యోగ ఉపాధులు పొందడానికి భారత్‌కు చెందిన యువత సరైన విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు, వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.
విద్యకు నైపుణ్య అండ కావాలి
విద్యకు సరైన నైపుణ్యం తోడైతేనే యువభారతం సమగ్రాభివృద్ధికి బాటలు పడతాయని గమనించాలి. ప్రస్తుతం అత్యధికంగా వ్యవసాయరంగంలో శ్రమిస్తున్న యువత ఆధునిక మార్పులకు అనుగుణంగా పట్టణ నిర్మాణ, సేవారంగాల వైపు చూస్తూ ఉపాధికి తగిన నైపుణ్యాలు కొరవడి సతమతం అవుతున్నారని తేలింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్స్‌ను సత్వరమే ఏర్పాటు చేసి ప్రణాళికల ప్రకారం డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సుల్లో నైపుణ్య శిక్షణలను అందించాలి. కోర్సులు/పాఠ్యాంశాలను పరిశ్రమల అవసరానికి తగినట్లుగా మార్చడం, అప్రెంట్‌షిప్, మెంటరింగ్, వృత్తి విద్య కేంద్రాలను పరిశ్రమలతో అనుసంధానం చేయడం, నైపుణ్య నిపుణుల అనుభవాలను/నైపుణ్యాలను యువతకు అందించడం, ప్రైవేట్ నైపుణ్య కేంద్రాలకు రాయితీలు ఇవ్వడం, పన్నులు తగ్గించడం లాంటి చర్యల ద్వారా నిరుద్యోగ సమస్య కొంత వరకు తగ్గుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్-ది-జాబ్ ట్రేనింగులు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (పిపిపి) విభాగాలు ఏర్పాటు చేయడం, యాజమాన్యం తమ ఉద్యోగులకు నిరంతర ‘స్కిల్లింగ్’, ‘అప్‌స్కిల్లింగ్’ శిక్షణలు ఇవ్వడం సముచితంగా ఉంటుందని గమనించాలి.
అధికారిక వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ పొందిన భారత యువతను కనీసం 15 శాతం వరకు పెంచాల్సిన అగత్యం ఏర్పడిరదని నివేదిక తెలిపింది. ప్రభుత్వాలు, వృత్తి శిక్షణ కేంద్రాలు, యూనివర్సిటీలు, పరిశ్రమలు, సేవా రంగాలు పూనుకొని అవసర ఆధునిక నైపుణ్యాలను అందిస్తూ, యువతను అప్‌డేట్ చేస్తూ, విదేశాల్లోకి అవకాశాలను చేజిక్కించుకుంటూ, నిరుద్యోగ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశ సుస్థిరాభివృద్ధికి పటిష్ట పునాదులు వేయాలని సూచనలు చేయడం సముచితంగా ఉన్నది. భారత యువతను నైపుణ్య నిధిగా మార్చడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. యువభారతం భవ్య దివ్య కేంద్రంగా మారాలని, రానున్న శతాబ్దం భారతానిదే అని, ప్రపంచ దేశాలకు నైపుణ్య యువశక్తిని అందించే కేంద్రంగా భారతం మారాలని కోరుకుందాం, ఆ కల సాకారానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





