రెండుపార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక..ముగియక ముందు ప్రజలకు మాత్రం ఒకటి బాగా అర్థమయ్యింది. అది బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని. ఇప్పుడు అవే సంకేతాలు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలసి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదా..కలసి అవగాహనతో ముందుకు వెళ్లడమో చేస్తాయని ప్రచారం సాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక సీట్లు సాధించాలని బిజెపి పట్టుదలగా ఉంది. తెలంగాణలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లు దక్కాయి. ఇప్పుడు పరిస్థితుల్లో ఆ నాలుగు దక్కుతాయా అన్నది అనుమానంగా ఉంది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు బిజెపి ఎంపిలు ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో నాలుగు దక్కడం కష్టంగానే ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది. ఎపిలో ఒక్కటంటే ఒక్కసీటు లేదు. అక్కడా కనీసం ఒకటిరెండు సీట్లయినా సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో పొత్తులుంటేనే గెలుస్తారు. మరోవైపు తెలంగాణలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ దూకుడువిూదుంది. ప్రజల్లో మంచి మార్కులు కొట్టేస్తోంది. ఒక్కో హావిూని చక్కబెట్టుకుంటూనే.. గత ప్రభుత్వ అవినీతిని తవ్వి తీస్తోంది. దీనిపై విపక్ష బిఆర్‌ఎస్‌, బీజేపీ ల స్పందన చూస్తుంటే..ఈ రెండు పార్టీల మధ్య అవగాహనను అర్థం చేసుకోవొచ్చు. అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తోంది. అలాగే పరోక్షంగా బిఆర్‌ఎస్‌ను సమర్థిస్తూ బిజెపి నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఈ రెండు పార్టీలు ఒక్కటేనని, వాటి మధ్య అవగాహన ఉందన్న ప్రచారం బలంగా సాగుతోంది.

మరోమారు ప్రధానిగా మోదీ అధికారం దక్కించుకోవాలన్నా..బిజెపి కేంద్రంలో హ్యాట్రిక్‌ కొట్టాలన్నా ఎక్కువ ఎంపి సీట్లు దక్షిణాది నుంచి దక్కించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. తమిళనాడులో డిఎంకె, కేరళలో ఎల్‌డిఎఫ్‌ అధికారంలో ఉంది. ఎపిలో వైసిపి ఉంది. వైసిపితోనూ ఇప్పటి వరకు అవగాహన ఉంది. నిజానికి తెలంగాణలోనే బిజెపి బలంగా ఉంది. కానీ మొన్నటి ఎన్నికల్లో వేసిన తప్పటడుగు వల్ల ఇప్పుడు బిజెపికి అంతగా పట్టులేకుండా పోయింది. ఒకవేళ బిఆర్‌ఎస్‌తో అంట కాగితే నాలుగు కాదుకదా ఒక్క సీటు కూడా రాదన్న విశ్లేషణలు ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల పోరులో కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యేకమైన వ్యూహాలు ఉన్నాయి. అత్యధిక సీట్లు గెలిపించుకోవాలని సిఎం రేవంత్‌ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకే అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌ను కట్టడి చేయడానికి బీఆర్‌ఎస్‌, బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. విడివిడిగా చేస్తే కాంగ్రెస్‌దే పైచేయి అవుతుందని అనుకుంటున్నారు. కలసి చేస్తే.. కాంగ్రెస్‌ను తక్కువ స్థానాలకే పరిమితం చేయవొచ్చన్న ఆలోచన కూడా ఉన్నట్లు ఉంది. అయితే కలసి పోటీ చేస్తే లాభం కన్నా బిజెపికి నష్టమే ఎక్కువని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అలా జరిగితే బిఆర్‌ఎస్‌ పాపాలను బిజెపి సమర్థించినట్లుగా అవుతుంది. అప్పుడు కాంగ్రెస్‌ మరింత వాడిగా ఈ రెండు పార్టీల వ్యవహారాన్ని ప్రజల్లో తూర్పారబట్టే అవకాశం ఉంటుంది.

బలహీనంగా ఉన్న చోట్ల ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడం బీజేపీ వ్యూహం. ఎపిలోనూ జనసేన, టిడిపిలతో కలసి పోవడం ద్వారా కొన్ని ఎంపి సీట్లు గెలుచుకోవాలన్న ప్లాన్‌ చేస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం లోక్‌సభ ఎన్నికల్లో బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నది. ఒకటి ఎన్నడూ గెలువని స్థానాలను దక్కించు కోవడం. రెండోది కాంగ్రెస్‌ పక్కాగా గెలిచే చోట తమకు అవకాశం లేకపోతే ప్రాంతీయపార్టీలను కలుపుకుని అక్కడ కాంగ్రెస్‌ గెలువకుండా చూడటం. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉన్న చోట బిఆర్‌ఎస్‌ను సమర్థించడం కోసం ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారం కూడా ఉంది. నిజానికి అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. పార్లమెంటులో గణనీయంగా సీట్లు గెలిస్తేనే బిఆర్‌ఎస్‌ మనుగడ సాధ్యం. ఓటమి తర్వాత పార్టీ క్యాడర్‌ నిరాశ నిస్పృహలో ఉన్నది. పార్టీని నిలబెట్టుకోవడం పెద్ద సమస్య అన్నది బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల్లో ఉన్న ఆందోళన. ఎందుకంటే నేతలు మెల్లగా జారుకుంటున్నారు. నల్లగొండ మున్సిపాలిటీ జారిపోయింది. అవినీతి కేసులు తరుముకుని వొస్తున్నాయి. అందుకే కేటీఆర్‌ స్వయంగా బీజేపీతో పొత్తుల కోసం సంప్రదింపులు ప్రారంభించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అధికారం కోల్పోవడాన్ని కెటిఆర్‌ జీర్ణించుకోలేక పోతున్నారు.

కాంగ్రెస్‌ బొటా బొటి మెజార్టీతో ఉందని ..ఆ పార్టీ ని ఎలాగైనా దెబ్బతీయవొచ్చన్న దురాలోచనలో ఉన్నట్లు వారి ప్రసంగాలను, విమర్శలను బట్టి అర్థం అవుతోంది. బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఏకపక్షంగా లోక్‌సభ సీట్లను గెల్చుకునే అవకాశం లేదు. మొన్నటి ఫలితాల ప్రకారం చూసినా రెండు,మూడు సీట్లు గెల్చుకోవడం కూడా కష్టమే. లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితి మరింత దిగజారి.. కాంగ్రెస్‌, బిజెపి పార్టీల మధ్యే పోరుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకే ఏదో బిజెపితో కలవాలనేది బీఆర్‌ఎస్‌ ఆలోచనగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యూహాలు జాగ్రత్తగా గమనిస్తే రెండుపార్టీల టార్గెట్‌ కాంగ్రెస్‌ పార్టీనే అన్నది స్పష్టమవుతున్నది. రాజకీయాల్లో శాశ్వత శతృవులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నది నానుడి. లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండుపార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ పార్టీనే. అందుకే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ గెలుపును అడ్డుకోవడానికి ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు. అయితే నేరుగా పొత్తులు పెట్టుకుంటే.. రెండు పార్టీలు నష్టపోతాయి. పరోక్షం గా సహకరించుకుంటే.. ఫలితాలు అనుకున్నట్లుగా వొస్తాయన్న నమ్మకం కూడా లేదు. కనుక కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు అవసరమైన వ్యూహంలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎపిలో కూడా బిజెపి పొత్తులకు తహతహలాడుతోంది. అక్కడ జనసేన, టిడిపి కూటమిలతో కలిసి పోవడం ద్వారా ఎంపి సీట్లు గెలుచుకోవాలని ఆశిస్తోంది.
`ప్రజాతంత్ర డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *