- మార్గదర్శకాలు రూపొందిస్తున్న రవాణా శాఖ
- పాత నంబర్లు యథావిధిగా ఉంటాయంటున్న అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో తెలంగాణకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్రం పేరును టీఎస్‌కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయించడంతో వాహనాల నంబర్ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్‌కు బదులుగా టీజీ ఉండనుంది. ఈ మేరకు రవాణా శాఖ గైడ్‌లైన్స్ కూడా సిద్ధం చేస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. వానదారులపై భారం పడకుండా రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1.50 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు కొత్తగా 10 వేల నూతన వాహనాల రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. అయితే ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాల నంబర్ ప్లేట్లపై మాత్రమే టీజీగా మార్చే యోచనలో అధికారులు ఉన్నారు. దీంతో ప్రస్తుతం టీఎస్‌గా ఉన్న నెంబర్ ప్లేట్లు కొనసాగనున్నాయి. అలాగే విభజన అనంతరం ఇంకా ఏపీ నెంబర్ ప్లేట్లతోనే 30 లక్షల వాహనాలు కొనసాగుతున్నాయి.
అయితే ఇప్పటికే ఉన్న నెంబర్లు ప్లేట్లు అన్నీ మార్చుకోవాలా అన్న చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అనధికారిక సమాచారం మేరకు టీఎస్ నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత.. అప్పటి నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ కేటాయిస్తారు. ఏపీ పోయి.. టీఎస్ వొచ్చిన తర్వాత రిజిస్టేష్రన్ అయిన వాహనాల నెంబర్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవి యథావిధిగా కొనసాగుతాయి. కొత్తగా వొచ్చిన వాహనాలకు మాత్రమే టీజీ కేటాయిస్తారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు టీఎస్ నెంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవాల్సిన అవసరం లేదు.. మార్చుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది అంటే..అప్పుడు అధికారికంగా ప్రకటిస్తారని..అప్పటి వరకు వాహనదారులు ఎవరూ తమ నెంబర్ ప్లేట్లను టీజీగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు అధికారులు.





