రాష్ట్రంలో దొంగలు పోయి.. గజదొంగలు వొచ్చారు

కాంగ్రెస్‌ ది 70 ఏళ్ల  దోపిడీ  చరిత్ర
బిఆర్‌ఎస్‌ బాటలోనే  హస్తం పార్టీ అవినీతి అక్రమాలు..
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం
ప్రధాని మోదీ పాలనను ప్రజలు  మరోసారి  కోరుకుంటున్నారు..
దేశంలో 400 స్థానాలు, రాష్ట్రంలో  బిజెపి రెండంకెల స్కోరు
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ రెడ్డి

మహబూబ్‌ నగర్‌,  ప్రజాతంత్ర మార్చి 29   తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లు  దొంగలు దోచుకున్నారని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వారి కంటే గజదొంగల మాదిరిగా  దోచుకుంటున్నారని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి ఘాటుగా విమర్శించారు. శుక్రవారం మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాహుల్‌ గాంధీకి  టాక్స్‌ కట్టేందుకు  తెలంగాణ ప్రజల నుంచి దోచుకోవడం మొదలుపెట్టారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు.  రూ. 2 లక్షల  రుణమాఫీ ఓకే దఫాలో చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ ఊసే  లేదన్నారు.  మహిళల కోసం రూ.2500 ఆర్థికసాయం అందిస్తామని చెప్పి  ఇప్పటికీ నోచుకోలేదన్నారు. నిరుద్యోగ భృతి అని యువతను మభ్య పెట్టారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ .14,000 ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారని, కానీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు.   కాళేశ్వరం ప్రాజెక్టులో  మాజీ ముఖ్యమంత్రి చేసిన  దోపిడీలపై చర్యలు తీసుకుంటామని  చెప్పి ఇప్పుడు మౌనం ఎందుకు పాటిస్తున్నారని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తుందని ఎక్కడ చూసినా దోపిడీలకు పాల్పడుతున్నారన్నారు.  ఢల్లీిలో రాహుల్‌ గాంధీకి డొనేషన్స్‌ కోసం  వ్యాపారులను పీడిస్తున్నారు. వ్యాపారస్తులపై కాంగ్రెస్‌ రాహుల్‌ గాంధీ ట్యాక్స్‌ వేస్తున్నారని ఆరోపించారు.   రాబోవు పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి డబుల్‌ డిజిట్‌ సాధించడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మరిన్ని స్థానాలు కోల్పోయే అవకాశముందన్నారు.   హిమాచల్‌ ప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయమని,  కర్ణాటకలో బిజెపి 90% గెలవబోతుందని జోస్యంచెప్పారు.    తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలంగా ఉందని, ఖమ్మంలోనూ బిజెపి గెలుస్తుందని చెప్పారు.  కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో  హామీలను అమలు చేసే పరిస్థితిలో లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు, కరువుతో రైతులు సతమతమవుతున్నారని, తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు.  కాంగ్రెస్‌ పార్టీకి 70 ఏళ్ల  దోపిడీ చరిత్ర ఉందన్నారు. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న సమయములో రూ .12 లక్షల కోట్ల దోపిడీ చేసిన ఘటన దేశ ప్రజలందరికీ తెలుసన్నారు.    దేశంలో రానున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని, ముచ్చటగా మూడవసారి భాజపా ప్రభుత్వం ఏర్పడబోతున్నదని చెప్పారు.

దేశంలో 400 స్థానాల్లో,   రాష్ట్రంలో 12 సీట్లకు పైగా బిజెపి  గెలవబోతున్నామని చెప్పారు. అలాగే హైదరాబాదులో వొవైసీ స్థానాన్ని కూడా బిజెపి కైవసం చేసుకుంటుందని తెలిపారు.   కేవలం ధాన్యం కొనుగోలు కోసమే ప్రతి ఏడాది రూ 26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నరేంద్ర మోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.  వచ్చే ఎన్నికల్లో రైతులు, మహిళలు, యువకులు , నిరుపేదలు  అనే 4 అంశాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. .  రైతుల కోసం  పెట్టుబడి సాయం, ఎరువుల్లో సబ్సిడీ, మద్దతు ధరలు ఇలా అన్ని రకాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని, . రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని,  కేంద్రం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

మహిళల కోసం పొదుపు సంఘాలకు రుణాలు, ముద్ర లోన్స్‌ ఇస్తామని తెలిపారు.  అలాగే మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్‌ కల్పించామని తెలిపారు.   నిరుపేదల ఆరోగ్యం, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.   ఇక యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని కిషన్‌ రెడ్డి తెలిపారు.  ఉమ్మడి మహబూబ్‌ నగర్‌  జిల్లాలో పాలమూరు, నాగర్‌ కర్నూల్‌ రెండు స్థానాలలో బిజెపి పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని తెలిపారు.  సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ,  పార్లమెంట్‌ ఇంచార్జి డోకూరు పవన్‌ కుమార్‌ రెడ్డి, బంగారు శృతి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌ రెడ్డి రాష్ట్ర నాయకులు నాగురావ్‌ నమోజి పద్మజా రెడ్డి రవీంద్రనాథ్‌ రావు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *