తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ కు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం అవసరం. ఇప్పుడున్న అంచనాల మేరకు ఒక్క సీటు కూడా రాదని అంటున్నారు. అయితే కనీసం ఓ నాలుగైదు ఎంపి సీట్లు గెలిస్తే తప్ప పార్టీ మనుగడ కష్టం. ఎందుకంటే ఇప్పటికే అనేకమంది బిఆర్ఎస్ను వీడి అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు. ఎంపిలుగా నిలబెడదామను కున్న వారు వెళ్లిపోయారు. ఆఖరికి కష్టపడి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిరది. ఎపిలో విపక్షంగా టిడిపి బలంగా ఉంది. ఆ పార్టీ నుంచి టిక్కెట్ కోసం డిమాండ్ ఏర్పడిరది. అధికార వైసిపికి కూడా టిక్కెట్ల డిమాండ్ ఉంది. అక్కడ వైసిపికి కూటమికి మధ్యన పోటాపోటీ ఉంది. కానీ తెలంగాణలో అలా లేదు. పోటీ కేవలం కాంగ్రెస్, బిజెపిల మధ్యనే ఉంది. ఈ రెండు పార్టీలు 15 సీట్లు లక్ష్యంగా పెట్టుకుని పోరాడుతున్నాయి. దీంతో విపక్ష బిఆర్ఎస్లో పోటీ చేసేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఇంతగా ప్రజల్లో ఆదరణ కోల్పోవడం కేవలం బిఆర్ఎస్లో మాత్రమే కనిపిస్తోంది.
ఈ క్రమంలో బిఆర్ఎస్ అత్యధిక ఎంపి సీట్లు గెలిస్తేనే రాజకీయంగా నిలుస్తుంది. అందుకే మైండ్ గేమ్ ఆడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ చతికిల బడటం,కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న ప్రచారం,ఎమ్మెల్సీ కవిత మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లడం, ముఖ్యనేతలు అనుకున్న వారంతా కారు దిగి హస్తం పార్టీలోకో, బీజేపీ గూటికో చేరడం వంటి పరిణామాలతో గులాబీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీంతో పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేందుకు జిల్లా యాత్రలు చేపట్టారు. రైతులను పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీతోనే రైతులకు లాభం జరుగుతుందని యాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కానరావడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమని విమర్శలు చేస్తోంది. మాతో 20మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీరాలు పలుకుతుంది. అందుకే కెసిఆర్ తనముందున్న అన్ని అస్త్రాలను ఉపయోగించాలని చూస్తున్నారు. అయితే ఇప్ప్పటికిప్పుడు బిఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అయినా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలతో పోటీగా బీఆర్ఎస్ గెలుపు కోసం తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ గెలుపు అంతా సీఎం రేవంత్ రెడ్డి తన భుజాల విూద వేసుకుని 10-12 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీకి మళ్లీ మోదీ క్రేజే గెలుపు గుర్రమని భావిస్తోంది. గులాబీ పార్టీ విజయం కోసం మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఈ మూడు పార్టీలు తమ తమ బలాబలాలను సవిూకరించుకుని 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలవడానికి కృషి చేస్తున్నాయి. దీని కోసం అన్ని పార్టీలు మైండ్ గేమ్ ప్రారంభించాయి.గెలుపు తమదేనంటూనే… ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలుతుందని ఓ పార్టీ అంటే, మరో పార్టీ ఈ ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు ఉనికి కోల్పోతాయని జోస్యం చెబుతోంది. అయితే ఈ మూడు పార్టీలు తమదైన శైలిలో మానసిక యుద్దానికి తెర లేపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెల్చుకోగా, మిత్రపక్షం సీపీఐ ఒక స్థానంలో గెలిచింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా ఉత్తర, దక్షిణ తెలంగాణలో మెజార్టీ అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ లెక్కన దాదాపు 12 సీట్ల వరకు తాము గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఆరు గ్యారంటీల అమలు, రాహుల్ గాంధీ పాదయాత్ర, బీజేపీ వ్యతిరేక గాలి తమకు కలిసి వొస్తుందన్నది హస్తం పార్టీ అంచనా. దీనికితోడు సిఎం రేవంత్‌రెడ్డి తీరుపై సానుకూల దృక్పథం రోజురోజుకూ బలపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చెక్ పెట్టిన బీఆర్ఎస్ మళ్లీ కోలుకోకుండా ఉండేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి బీఆర్ఎస్ క్యాడర్ లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతోంది. తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే తప్ప బీఆర్ఎస్ కాదని నేతలు చెబుతున్నారు. బిజెపి కూడా కాంగ్రెస్ తమ ప్రధాన ప్రత్యర్తిగా చెబుతోంది. అందుకే ఈ రెండు పార్టీలు బిఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని, దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కారు దిగడం ఖాయమని ప్రచారం సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో నలుగురు మాత్రమే ఉంటారని, మిగతా వారంతా బయటకు రావడం ఖాయమని గులాబీ నేతలను మానసికంగా కృంగదీసేలా మంత్రులు తమ వ్యాఖ్యలు ముమ్మరం చేస్తున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో మాత్రమే కమలం పార్టీ విజయం సాధించింది. రామాలయ నిర్మాణం, మోదీ హవాతో ఈ దఫా దశ తిరిగి పది స్థానాలకుపైగా తెలంగాణలో దక్కించు కుంటామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే బీజేపీ నుంచి గెలిచారు. కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌లలో గెలిచి బీజేపీ సంచలనం సృష్టించింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా 10 స్థానాల వరకు గెలుస్తామని కమలం నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. బొటా బోటి మెజార్టీతో ఉన్న కాంగ్రెస్, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాల్లో గెలవకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమేనని కమలం నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా.. ఊడుతుందా అంటూ…పొలిటికల్ మైండ్ గేమ్‌తో అధికార కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేందుకు కమలం నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
-ప్రజాతంత్ర డెస్క్




