– బీసీ-ఎలోకి మార్చాలని విద్యాసంతుల వేదిక డిమాండ్
– ముదిరాజ్ సింహావలోకనం రాష్ట్రస్థాయి సమాలోచన సదస్సుకు ఏర్పాట్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముదిరాజ్, ముత్తరాసి, తెనుగోళ్లు వర్గాల ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని తెలంగాణ విద్యాసంతుల వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో ఐదు దశాబ్దాలపాటు ముదిరాజ్ సామాజికవర్గం తీవ్ర అంచివేత, విస్మరణకు గురైందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పరిస్థితుల్లో పెద్ద మార్పు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో తొలి అమరుడైన పోలీసు కిష్టయ్య బలిదానాన్ని ప్రభుత్వాలు గుర్తించలేదని విమర్శించారు. సీపెక్(ఎస్ఈఈఈపీసీ)-2025 కులాలవారీ జనాభా లెక్కల విశ్లేషణలో ముదిరాజ్ వర్గం సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల కంటే కూడా వెనుకబడి ఉందన్నారు. పాలనలో, ఎన్నికల టికెట్ల కేటాయింపులో, నామినేటెడ్ పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ ప్రయోజనాలు కూడా ముదిరాజ్‌లకు పూర్తిస్థాయిలో అందడం లేదని, విద్యారంగంలో డ్రాపవుట్ల శాతం అధికంగా ఉందని తెలిపారు. మత్స్యరంగంలో ఆదాయాలు తగ్గిపోవడంతో అనేక కుటుంబాలు దినసరి కూలీలుగా మారుతున్నాయన్నారు. సమ్మిళిత వెనుకబాటుతనం సూచికలో రాష్ట్రస్థాయి 81గా ఉండగా ముదిరాజ్ వర్గం 94 పాయింట్లతో అత్యంత వెనుకబడిన వర్గంగా నమోదైందన్నారు. ముదిరాజ్ ప్రజల తలసరి ఆదాయం రూ.లక్షలోపే ఉందని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు ముదిరాజ్ ప్రజలు 8 పైసల ఆదాయం సమకూరుస్తున్నా ప్రభుత్వ ఖర్చులో వారికి 3 పైసలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన బీసీ-డి నుంచి బీసీ-ఏ రిజర్వేషన్ మార్పు హామీ అమలు కాలేదని, సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర జనాభాలో 7.4 శాతం ఉన్న ముదిరాజ్ ప్రజల వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ముదిరాజ్ సింహావలోకనం సదస్సు 26న
ముదిరాజ్ సింహావలోకనం పేరుతో రాష్ట్రస్థాయి సమాలోచన సదస్సును ఈ నెల 26న ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని గ్రాండ్ లాన్స్‌లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ముదిరాజ్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సోషల్ ఫిలాసఫర్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ టి.చిరంజీవులు, సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ శివకేశవులు ముదిరాజ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పిట్టల రవీందర్ రచించిన ముదిరాజ్ ముఖచిత్రం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. సదస్సుకు ప్రొఫెసర్ సిహెచ్ దినేష్ కుమార్ ముదిరాజ్ అధ్యక్షత వహిస్తారు. డాక్టర్ జూలు నాగేశ్వర్ ముదిరాజ్, డాక్టర్ కావలి చెన్నయ్య ముదిరాజ్ కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే కృష్ణ కిషోర్ ముదిరాజ్, పూల నాగరాజు, పిల్ల కిరణ్ ముదిరాజ్, డి.కె.మల్వర్ తదితరులు కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




