కస్టడీ సవాల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
కిందికోర్టు తీర్పును సమర్థించిన న్యాయమూర్తి
హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి21: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్ పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం ప్రణీత్ రావు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పును వెల్లడిరచింది. ప్రణీత్ రావ్ కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన కస్టడీ అనుమతి సరైందే అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కాగా.. వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందంటూ ప్రణీత్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని వెల్లడిరచారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలన్నారు. దర్యాప్తులోని అంశాలను డియాకు లీక్ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎందుకు లీక్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమేనని ప్రణీత్ రావు అన్నారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారని.. బంధువులు, న్యాయవాదిని కూడా అనుమతించడం లేదని తెలిపారు. ఇంటరాగేషన్‌లో ఏఎస్పీ డి.రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు.
ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని ప్రణీత్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. తొలుత పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు. అనంతరం పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పోలీసు స్టేషన్‌లో కనీస వసతులు ఉన్నాయని తెలిపారు. ఫిర్యాదుదారు అయిన ఏస్పీ రమేశ్‌కు దర్యాప్తులో పాత్ర లేదన్నారు. పిటిషనర్.. తన న్యాయవాది ఫోన్ ద్వారా తల్లిదండ్రులతోనూ మాట్లాడుతున్నారన్నారు. ఏడురోజుల కస్టడీలో 4 రోజులు పూర్తయ్యాయని.. మిగిలింది మూడు రోజులేనని, ఉపయోగంలేని ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.