మరో సత్యాగ్రహం

నేడు వరి ధాన్యపు  న్యాయం కోసం
రైతు చైతన్యం కదిలొచ్చింది.
నడిరోడ్డుపై ధ్యానం చేస్తున్న గాంధీజీ
విగ్రహంలో చేతనత్వం జనించింది.
కర్షకుని కన్నీటి వ్యథల అలజడి సంద్రం
మహాత్ముడి గుండె తడిని పలకరించింది.

ఆయన మౌనం రైతు
బాగుకోసం రణం అయ్యింది.
రుణమాఫీ చేయమంటూ
బోనస్ త్వరగా ఇవ్వాలంటూ
మరో సత్యాగ్రహం స్టార్టయ్యింది.

వ్యవసాయం ఓ ఉద్యోగం కాదు.
ఆకలిని తీర్చి అన్నంపెట్టే ఓ మహా ఉద్యమం.
సేద్యమే ఈ దేశాన్ని అంతర్జాతీయ
స్థాయిలో కాపాడుతున్న మన సైన్యం.
పొలమే కాలపు చరితను రాస్తున్న కవికలం.

ఎండలో వానొచ్చి
వాన తోడుగా ఎండొచ్చి
సగం పంట ఎండిపాయె
సగం పంట తడిసిపాయె
ఇది తట్టుకోలేక రైతు గుండె అలసిపాయె.
పొరపాటున ఆ గుండె ఆగిపోతే..
ఆ ప్రపంచ విపత్తును ఆపడం అసాధ్యం కదా..!

సారూ…
ఇది కొంచెం గట్టిగానే ఆలోచించండని..
వ్యవసాయాన్ని ఆదుకోండని..
సర్కార్ కు విన్నవిస్తూ..
రైతు పొలంలో పంట నిండుతనమే..
రైతు ముఖంలో ఆకుపచ్చ నవ్వుతనమే..
మన దేశాన్ని గెలిపిస్తుంది.
ఈ దేశ రాజకీయాలను శాసిస్తుంది.

(రైతు పంటను కొనాలని మరియు ఆదుకోవాలని కోరుతూ..)

ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *